అభిషేకం అంతరంగానికి!

అభిషేక సమయంలో అర్చకస్వామి వల్లించే వేద మంత్రాలు ‘రుద్రాధ్యాయం’లోవి. ఈమంత్ర భాగాన్ని ‘శతరుద్రీయం’ అని కూడా అంటారు. ఈ మంత్రాలలో కొన్నింటి చివర ‘నమో నమో’ అనీ, మరికొన్నింటి చివర ‘చ మే - చ మే’ అనీ అంటారు

Published : 20 Feb 2020 00:04 IST

అభిషేక సమయంలో అర్చకస్వామి వల్లించే వేద మంత్రాలు ‘రుద్రాధ్యాయం’లోవి. ఈమంత్ర భాగాన్ని ‘శతరుద్రీయం’ అని కూడా అంటారు. ఈ మంత్రాలలో కొన్నింటి చివర ‘నమో నమో’ అనీ, మరికొన్నింటి చివర ‘చ మే - చ మే’ అనీ అంటారు కనుక, వీటిని ‘నమకం-చమకం’ అని వ్యవహరిస్తాం. ఈ మంత్రాలను పఠిస్తూ పరమశివునికి అభిషేకం చేస్తారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఫలరసాలు, కొబ్బరినీళ్లు అభిషేకంలో ఉపయోగిస్తారు.

● పరమశివుడు అభిషేక ప్రియుడు. ఓ పండు సమర్పించినా, ఓ చెంబుడు నీళ్లతో అభిషేకించినా దండిగా అనుగ్రహించే బోళాశంకరుడాయన. మహాశివరాత్రినాడు చేసే అభిషేకం మహాదేవునికి మరింత ప్రీతికరమని చెబుతారు. మనం ఒంటిపై ఉన్న దుమ్ము, ధూళి, మురికి తొలగించుకోవటానికి స్నానం చేస్తాం. మన అంతరంగంలోని మాలిన్యం ప్రక్షాళన కావడానికి పరమశివుడికి అభిషేకం చేయాలి. రజస్సు అంటే రజోగుణం అనీ ధూళి అనీ అర్థాలున్నాయి. మనలోని రజోగుణాన్ని సంస్కరించడానికి, మానవత్వం ఉన్నవారిగా మారడానికి పరమశివుణ్ణి అభిషేకించాలి.

ఫలోదకాలను మన తెలివితో సంపాదించుకున్నామనే అహంకారం వదిలి, అవన్నీ భగవంతుడు ప్రసాదిస్తేనే అనుభవించగలుగుతున్నామని గుర్తించాలి. అలా గుర్తించి, ‘నీవిచ్చిన సంపదతోనే నిన్ను అర్చిస్తున్నామ’ని స్వామికి కృతజ్ఞతను తెలియజేయడం అభిషేకంలో ఉన్న అంతరార్థం.

వినయాన్ని విన్నవించుకోవటం అభిషేకం. సృష్టిలో తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తిననీ, తనంతటివారు మరెవరూ లేరనీ అనుకోవటం అహంకారం. కానీ, అభిషేక సమయంలో వినిపించే ‘రుద్రాధ్యాయం’లోని మంత్రభాగం మనకు కనువిప్పు కలిగిస్తుంది. సృష్టిలోని సకలప్రాణులు, వృక్షాలు మొదలైనవన్నీ పరమేశ్వర స్వరూపమేననీ, సకల ప్రాణులకూ శుభం కలగాలని మనం అందులో కోరుకుంటాం. ఈ మంత్రాల అర్థాలు మన అంతరంగాన్ని తట్టి మేల్కొల్పుతాయి. అప్పుడు జ్ఞాన జ్యోతి స్వరూపుడైన పరమశివుడు మనలో ఆవిర్భవిస్తాడు. అదే మహాశివరాత్రి నాడు మనం పొందవలసిన ‘మహాలింగోద్భవ’ సందర్శనం.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని