ముక్కోటి ఆశీస్సులు!

ధనుర్మాసం మొదలైన తర్వాత వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. సౌరమానం ప్రకారం మార్గశిర, పుష్య మాసాలలో ఏదో ఒక నెలలో ఈ పర్వదినం వస్తుంది. ఈ రోజును స్వర్గద్వార ఏకాదశి, ముక్కోటిఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనే పేర్లతో

Published : 24 Dec 2020 01:42 IST

రేపు వైకుంఠ ఏకాదశి

ధనుర్మాసం మొదలైన తర్వాత వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. సౌరమానం ప్రకారం మార్గశిర, పుష్య మాసాలలో ఏదో ఒక నెలలో ఈ పర్వదినం వస్తుంది. ఈ రోజును స్వర్గద్వార ఏకాదశి, ముక్కోటిఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈ పేర్ల వెనక వేర్వేరు కథనాలున్నాయి.
* దేవతలకు ఉత్తరాయణం పగలు. దక్షిణాయనం రాత్రి. ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో వచ్చే ఏకాదశినాడు ముక్కోటి దేవతలు విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. ఆ రోజున శ్రీమహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే వారికి ఐహిక, పారమార్థిక ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి అన్నారు..
* మధు కైటభులనే రాక్షసులను సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి ఉన్న ఉత్తర ద్వారం నుంచి వెళ్లాడు. వారి నుంచి వేదాలను రక్షించి తిరిగి అదే ద్వారం నుంచి వైకుంఠంలోకి ప్రవేశించాడు. అందుకే దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చిందని పురాణ కథనం. ఆ రోజు స్వర్గ ద్వారాలన్నీ తెరుచుకుని ఉంటాయి కాబట్టి స్వర్గద్వారైకాదశి అనే పేరు కూడా వచ్చింది. విష్ణువు సంచరించిన ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ఆయన దర్శనం చేసుకుంటే పుణ్యమని చెబుతారు. ఉత్తర దిక్కు జ్ఞానానికి ప్రతీక కాబట్టి పరమాత్మను జ్ఞానంతోనే సేవించాలన్నది ఈ దర్శనంలోని అంతరార్థంగా చెబుతారు.
ఉత్తరం ఎందుకు?
ఏ పనైనా తూర్పు ముఖంగా తిరిగి చేయడం భారతీయుల ఆచారం. ఆ దిశగా నిలబడినప్పుడు ఎడమ భాగంలో ఉత్తర దిక్కు ఉంటుంది. దేహానికి ఎడమ భాగం చాలా ప్రధానమైంది. అక్కడుండే హృదయం ప్రేమ, ఆనందం, సుఖాలకు నిలయం. మానవ జీవన గమనం సుఖసంతోషాల వైపు సాగుతుంది. అలా ప్రారంభమైన పయనం పారమార్థిక జీవనం వైపు మరలుతుంది. ఇలా ఉత్తర దిక్కు లౌకిక సుఖాలను ఇస్తూ ఆధ్యాత్మిక మార్గం వైపు నడుపుతుందని దీని అంతరార్థం. ఆలయాల్లో ప్రదక్షిణ పరమార్ధం కూడా ఇదే. .వేదాల్లో ప్రాక్‌ ఆరభ్య దక్షిణేన వర్తనం అని స్పష్టంగా చెప్పారు. అంటే తూర్పు వైపు తిరిగి ఉత్తరం నుంచి దక్షిణానికి, అటు నుంచి పడమర మీదుగా యధాస్థానానికి వచ్చేట్టు తిరగాలి అని దీని భావం. అంటే ఐహికమైన కోరికలతో మొదలైన జీవితం ఆముష్మికంతో ముగియాలనే దీని భావం.  

-రమా శ్రీనివాస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని