వేద దేవతా.. వందనం!

వేదాల్ని జీవన నాదంగా భారతీయ సంప్రదాయం భావిస్తుంది. ఇవి అపౌరుషేయాలని, అంటే పరమాత్మ ఊపిరి ద్వారా పుట్టాయని పేర్కొంటారు. వీటిని పెంచి పోషించే దైవం, అధిదైవం ఉంటారు.

Published : 27 May 2021 00:12 IST

వేదాల్ని జీవన నాదంగా భారతీయ సంప్రదాయం భావిస్తుంది. ఇవి అపౌరుషేయాలని, అంటే పరమాత్మ ఊపిరి ద్వారా పుట్టాయని పేర్కొంటారు. వీటిని పెంచి పోషించే దైవం, అధిదైవం ఉంటారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారంలోకి వచ్చిన ఈ వేద దేవతల ఆహార్య, ఆకృతుల వెనుక లోతైన అర్థాలున్నాయి.
రుచీకుడు, రుచిమయూరలకు ఖర, నెమలి ముఖాలు ఉండటం కూడా వేద రహస్యమే. ఖరం సహనానికి ప్రతీక. అలాగే అలసత్వం కూడా ఎక్కువే. కానీ, నెమలి అందుకు వ్యతిరేకం. ‘రుచీకా! జ్ఞాన విస్తరణ, భాష, ధర్మ పరిరక్షణలో అలసత్వం పనికిరాదు సుమా!’ అని నిత్యం చెప్పటానికే భార్యగా రుచిమయూరను నిర్దేశించింది వేద నిరుక్తం.

పిల్లలకు తల్లి అధి (గొప్ప) దైవం. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలకి అమ్మ ఇచ్చే ఆహారమే మూలం. ఆ ఆహారం సంపాదించే తండ్రి పిల్లలకి దైవం. ఇలా దైవ, అధిదైవాలు కుటుంబ రక్షణ చేస్తున్నట్టుగా వేదాల విషయంలోనూ దైవ - అధిదైవాలు అవి క్షీణించకుండా, నిత్య చిరంజీవులుగా ఉండేలా చూస్తారు. మరో కోణంలో చూస్తే వేదం ‘శబ్ద-అర్థాల’తో కూడింది. వీటిలో ఏది లేకున్నా వేదాల అసలు సారం గ్రహించలేం. ఇందులో శబ్దం - దైవం - నాన్న అయితే, అర్థం - అధిదైవం - అమ్మ.

ముందుగా రుగ్వేద దేవతను చూద్దాం...
రుగ్వేదః శ్వేతవర్ణస్స్యాత్‌ ద్విభుజో రాసభాననః।
అక్షమాలాధర స్సౌమ్యః ప్రీతో వ్యాఖ్యాకృతోద్యమః।।

* వివిధ దేవతల్ని స్తుతించే రుక్కులు అనే మంత్రాలను వివరిస్తుంది రుగ్వేదం. దీనికి దైవం (తండ్రి) - రుచీకుడు. ఈయన శరీరం, వస్త్రం తెల్లగా ఉంటాయి. భుజం మీద ఆకుపచ్చ కండువా ఉంటుంది. రెండు చేతులుంటాయి. ఖరం (గాడిద) ముఖం, కుడిచేతిలో జపమాలతో, ప్రసన్న వదనంతో, ప్రీతిగా మాట్లాడే భంగిమలో, ఎరుపు రంగు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.
* ఎడమ తొడ మీద ఉండే భార్య ‘రుచి మయూర’ రుగ్వేదానికి అధిదైవం (తల్లి). నెమలి ముఖంతో, పసుపు రంగు చీర ధరించి ఉంటుంది.
* రుచీకుడి విషయంలో తెలుపు జ్ఞానానికి ప్రతీక. ఆకుపచ్చ రంగు బుద్ధి, వాక్కులను సూచిస్తుంది.
* ఆకుపచ్చకు బుధుడు, తెలుపునకు శుక్రుడు అధిపతులు. అంటే ఏకకాలంలో రుచీకుడు శుక్రుడి జ్ఞానాన్ని, దాన్ని ఇతరులకు పంచటానికి బుధుడి వాక్‌శక్తిని కలిగి ఉన్నాడని అర్థం.
* కుడి చేతిలో ధరించిన 50 పూసల అక్షమాల సంస్కృతంలో అ నుంచి క్ష వరకు ఉన్న 50 అక్షరాలకు సంకేతం. అంటే సంస్కృత భాషా పరిరక్షణ రుచీకుడి దినచర్య.
* మాట్లాడే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి న్యాయాన్యాయ విచక్షణ, మంచిని చెప్పటం అనేవి ఈ దేవత ప్రధాన లక్షణాలు.
* ఎర్రని సింహాసనం కనుక, రుచీకుడు అగ్నిదేవుడి ప్రతినిధి. అగ్ని శక్తిమయం కాబట్టి రుగ్వేద దేవుణ్ని ఆరాధిస్తే తేజస్సు, బలం, ఆరోగ్యం కలుగుతాయి. ఇంట్లో నిత్య దీపారాధన చేసినా ఈ దేవతను పరోక్షంగా పూజించినట్టే.
* శరీరంలో ప్రధాన అవయవం గుండె ఎడమవైపునే ఉంటుంది. అందువల్ల కుటుంబానికి ఆధారమైన భార్య ఎప్పుడూ భర్తకి ఎడమవైపునే ఉండాలంటారు. రుచి మయూర కూడా అలా ఎడమ తొడమీద కూర్చుని ఉంటుంది.
* ఆమె ధరించిన పసుపు రంగు చీర అభివృద్ధి, వ్యాపనశక్తి, కోర్కెలు నెరవేరటానికి ప్రతీక.
* పసుపు రంగు దేవ గురువు బృహస్పతికి చెందింది. అంటే రుచిమయూర రుచీకునికే సాక్షాత్తు గురువు లాంటిదని అర్థం.

యజుర్వేద దేవత పరిచయం వచ్చేవారం

- చల్లా జయదేవ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని