అదీ నా సేవే!

నిరంతర గాయత్రీ ఉపాసకుడైన గౌరీపతి వృద్ధాప్యంతో మరణించాడు. దేవదూతలు అతణ్ని మణిద్వీపం చేర్చి అమ్మవారి చెంత వదిలి వెళ్లారు. తేజస్సుతో వెలిగిపోతున్న మాతను చూసి పులకించిపోయాడు గౌరీపతి.

Published : 22 Jul 2021 01:20 IST

నిరంతర గాయత్రీ ఉపాసకుడైన గౌరీపతి వృద్ధాప్యంతో మరణించాడు. దేవదూతలు అతణ్ని మణిద్వీపం చేర్చి అమ్మవారి చెంత వదిలి వెళ్లారు. తేజస్సుతో వెలిగిపోతున్న మాతను చూసి పులకించిపోయాడు గౌరీపతి. అంతలో అదే దేవదూతలు అతనికి బాగా తెలిసిన సింహాచలాన్ని తీసుకొచ్చారు. అతణ్ని చూసి ఆశ్చర్యపోయాడు గౌరీపతి. ‘అమ్మా! నాదొక సందేహం’ వినమ్రంగా అన్నాడు. ఏమిటన్నట్లు చూసింది మాత.
‘నా చిన్నప్పటి నుంచీ నీ మంత్రోపాసనే శ్వాసగా జీవిస్తున్నాను. నీ పూజలు తప్ప నాకు మరేమీ తెలియదు. జీవనపర్యంతం నీ సేవలో గడిపాను. ఇంత కష్టపడితే నీ దర్శనభాగ్యం దొరికింది. కానీ, ఏనాడూ నీ పేరు తలవని పరమ నాస్తికుడైన సింహాచలం నీ సన్నిధికి ఎలా రాగలిగాడు?’ అడిగాడు గౌరీపతి.
గాయత్రీదేవి ప్రశాంతంగా నవ్వి ‘అతను నాస్తికుడే. కానీ నాకోసం ఆకుపచ్చ దీపాలు వెలిగించాడు’ అంది. గౌరీపతికి అర్థంకాలేదు.
‘సింహాచలం నాకు పూజలు చేయకుంటేనేం, అతను నిర్వర్తించింది నా సేవే! ఎప్పుడూ పరుల సౌఖ్యం గురించే ఆలోచించాడు. మొక్కలు నాటుతూ మైళ్ల కొద్దీ భూమిని పచ్చదనంతో నింపాడు. పశుపక్ష్యాదులకు ఆశ్రయం కల్పించాడు. అతను వెలిగించిన ఆ ఆకుపచ్చ దీపాలతో నేనెంతో సంతోషించాను’ అంది. గౌరీపతి మాట కరవై చెమర్చిన కళ్లతో నమస్కరించాడు.

- డా।। పి.రాజసులోచన


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని