మాటల మొలకలు

మంచి మాటలను మంచి నేలపై పడిన విత్తనాలుగా చెబుతారు క్రీస్తు ప్రభువు. రైతు విత్తనాలు చల్లుతాడు. తోవలో పడిన వాటిని పక్షులు తింటాయి. రాతినేల మీద పడినవి దాని మీదున్న కొద్దిపాటి మట్టి ఆసరాతో మొలకెత్తినా, ఆ తర్వాత ఎదగలేవు. భూమి మీద పడినవాటికి తేమ తోడైతే చిగురించి ఏపుగా పెరుగుతాయి.

Published : 22 Jul 2021 01:47 IST

మంచి మాటలను మంచి నేలపై పడిన విత్తనాలుగా చెబుతారు క్రీస్తు ప్రభువు. రైతు విత్తనాలు చల్లుతాడు. తోవలో పడిన వాటిని పక్షులు తింటాయి. రాతినేల మీద పడినవి దాని మీదున్న కొద్దిపాటి మట్టి ఆసరాతో మొలకెత్తినా, ఆ తర్వాత ఎదగలేవు. భూమి మీద పడినవాటికి తేమ తోడైతే చిగురించి ఏపుగా పెరుగుతాయి. పక్షులు తినేసిన విత్తనాల్లా కొందరు సూక్తులను వెంటనే మర్చిపోతారు. రాతినేల మీద పడిన విత్తనాల్లా కొందరు విన్న మాటల గురించి కాస్తంత ఆలోచించి అనంతరం పట్టించుకోరు. నేలమీద పడిన విత్తనాల్లా కొందరు విన్న మాటలను ఆచరణలో పెడతారు. అయితే, అలా వినే వాటి విషయంలోనూ జాగ్రత్తపడాలి అంటారు క్రీస్తు. మాటలు మకరందంలా ఉండటమే కాదు, కొన్నిసార్లు కలుషితమూ చేయగలవు. మనసును తట్టే మాటలు మనిషిని మహోన్నతుడిని చేస్తాయి. మాటలు ఎదుటి వారిని కేవలం మెప్పించేవిగానో, నొప్పించేవిగానో కాక మంచి మార్పును తెచ్చేవిగా, బుద్ధిని వికసింపజేసేవిగా ఉండాలనే ఉద్దేశంతో ‘వినడానికి చెవులున్నవారు వింటారు’ అన్నారు. ఎవరేం చెప్పినా వినేందుకే రెండు చెవులున్నాయి. వినడం అంటే సహానుభూతి. చెప్పేవారి ఆర్తిని, ఆవేదనను అర్థంచేసుకోవడం. అదే క్రమంలో మంచి చెడులను వినే విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు ప్రభువు. మంచి నేలమీద పడిన విత్తనపు మొలకలుగా మాటలుంటే సమాజం ప్రేమమయ ఉద్యానవనం అవుతుంది.

- శ్రీహర్షసాయి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని