ఆధ్యాత్మిక భావనే బలం

అరణ్యవాసంలో ఉన్న పాండవులను చూసేందుకు ఒకసారి శ్రీకృష్ణుడు వచ్చాడు. మనోధైర్యాన్ని కలిగించే ఉపాయం చెప్పాలని కన్నయ్యను కోరారు వాళ్లు. దానికి సమాధానంగా ‘ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు’ అని చెప్పాడు నల్లనయ్య. సృష్టిలో మానవ జన్మ ఉన్నతమైంది. జీవితం గొప్ప వరమనీ, సుఖశాంతులతో

Published : 22 Jul 2021 01:55 IST

అరణ్యవాసంలో ఉన్న పాండవులను చూసేందుకు ఒకసారి శ్రీకృష్ణుడు వచ్చాడు. మనోధైర్యాన్ని కలిగించే ఉపాయం చెప్పాలని కన్నయ్యను కోరారు వాళ్లు. దానికి సమాధానంగా ‘ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు’ అని చెప్పాడు నల్లనయ్య. సృష్టిలో మానవ జన్మ ఉన్నతమైంది. జీవితం గొప్ప వరమనీ, సుఖశాంతులతో గడిపేందుకు లభించిన అపూర్వ అవకాశమనీ వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. అయితే మానవ మనుగడలో ఎన్నో సమస్యలు, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఫలితంగా సహజంగానే వేదన, అలసట కలుగుతాయి. వాటిని అధిగమించి, మానసికంగా శారీరకంగా ఉత్తేజం, ఉత్సాహం పొందేందుకు మన పురాణాల్లో ఎన్నో మార్గాలను సూచించారు. పారమార్థిక చింతన కలిగి ఉండి ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకోవడం వాటిలో ఒకటి. అంటే ధర్మబద్ధ జీవనాన్ని గడపడం. ఈ క్రమంలో స్వార్థం, అసూయ, ద్వేషం, మోహం, కుట్ర, వంచన లాంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకూడదు. అవసరమైనవారికి సహాయం, దానధర్మాలు చేయడం, సేవాతత్పరత అలవరచుకోవడమే ధర్మబద్ధ జీవితం. వీటి వల్ల శాంతి, ఆనందం కలుగుతాయి. మానసిక ఒత్తిడి, అలసట దరిచేరవు. ఎప్పుడైనా విసుగు కలిగినా నిరాశ చెందకుండా ధైర్యంగా ఉండాలి. ధైర్యాన్ని దెబ్బతీసే విషాదాన్ని దూరం చేసుకోవాలని రామాయణంలో అంగదుడు చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి. భగవంతుడిపై భారం వేసి నిజాయతీగా నిర్మలమైన మనసుతో చేయాల్సిన విధులను నిర్వర్తించినప్పుడు తప్పకుండా విజయం వరిస్తుంది. అది నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. మంచి మనసు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన మానసిక ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అసలు మానసిక వేదన, ఒత్తిడి అనే భావనలు కలగడానికి మనసే ప్రధాన కారణం. మనసు ఉన్నచోటనే స్వర్గాన్ని సృష్టించగలదు. నరకాన్నీ చూపించగలదు. ‘అన్నిటికంటే వేగమైంది ఏది?’  అన్న యక్షుడి ప్రశ్నకు- ‘మనసు’ అని సమాధానం ఇచ్చాడు ధర్మరాజు. అందుకే ముందు మనసును నియంత్రణలో ఉంచుకోగలగాలి. అందుకు ధర్మబద్ధ జీవనం, సాత్విక ఆహారం, ప్రాణాయామం, పరోపకారం లాంటివి తోడ్పడతాయి.

- ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని