నిజమైన యోగి

గురుకులానికి వచ్చిన ఆ బాలుణ్ని చూశాడు గౌతముడు. ‘నా పేరు సత్యకాముడు. మీ వద్ద చదువుకోవాలని వచ్చాను! మా అమ్మ శ్రమజీవి. నా తండ్రెవరో, పుట్టుక వివరాలేమిటో తెలియదు. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి’ అన్నాడు. ఆ నిజాయతీ, వినమ్రతకి మెచ్చి శిష్యుడిగా గౌతముడు అంగీకరించాడు.

Published : 22 Jul 2021 01:58 IST

గురుకులానికి వచ్చిన ఆ బాలుణ్ని చూశాడు గౌతముడు. ‘నా పేరు సత్యకాముడు. మీ వద్ద చదువుకోవాలని వచ్చాను! మా అమ్మ శ్రమజీవి. నా తండ్రెవరో, పుట్టుక వివరాలేమిటో తెలియదు. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి’ అన్నాడు. ఆ నిజాయతీ, వినమ్రతకి మెచ్చి శిష్యుడిగా గౌతముడు అంగీకరించాడు. క్రమంగా సత్యకాముడు గురువు మీద గురి తప్పని భక్తితో చదువులో రాణించసాగాడు. మొదట్లో సంకుచితంగా వ్యవహరించిన ఇతర శిష్యులు సత్యకాముడికి చేరువయ్యారు.
తన ఉనికిని అంతటా అన్నిటా దర్శిస్తూ, అందరినీ, అన్నిటినీ తనలో చూసే ఈ పరబ్రహ్మ తత్త్వాన్ని గుర్తెరిగినవాడే నిజమైన యోగీశ్వరుడు! తాను అంటే శరీరం కాదు, ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకున్నవాడే బ్రహ్మవేత్త- అని శిష్యులకు బోధించాడు గౌతముడు. ఆ దశలో బ్రహ్మజ్ఞానాన్ని సత్యకామ జాబాలి అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేయాలనుకున్నాడు. అంతులేని ప్రశాంతత, విషయ వాంఛలపట్ల నిర్లిప్తత, అంతరంగ ఔన్నత్యాన్ని ప్రతిఫలించే కాంతి, తనలోనే పరబ్రహ్మను కనుగొనడం అనే కీలకమైన నాలుగు లక్షణాలను సంతరించుకున్న పరిపూర్ణ బ్రహ్మజ్ఞానిగా సత్యకాముణ్ని చూడాలనుకున్నాడాయన!
ఒకనాడు సత్యకాముణ్ని పిలిచాడు. ఆశ్రమంలోని నాలుగు వందల గోవులను అడవికి తోలుకెళ్లి, వాటి సంఖ్య వెయ్యికి చేరిన తర్వాత తిరిగి తీసుకురమ్మన్నాడు. గురువుగారికి నమస్కరించి ఆవులతో పాటు అడవికి వెళ్లాడు సత్యకాముడు. గరిక మైదానాలు, గలగలా పారే సెలయేళ్లు, పూలనూ, పండ్లనూ ప్రసాదించే వృక్షాలు సత్యకాముడికి ధ్యాన యోగాన్ని నేర్పాయి. ప్రకృతిని ఉపాసించడం బోధించాయి.
కొన్నాళ్లకు గో సంతతి వెయ్యికి చేరిందని సత్యకాముడికి ఓ ఎద్దు చెప్పింది. గురువు వద్దకు తోలుకెళ్లమని సూచిస్తూ, బ్రహ్మజ్ఞానంలోని మొదటి పాదాన్ని బోధించింది. సత్యకాముడి హృదయంలో అంతులేని శాంతి వెల్లివిరిసింది. మందను తోలుకుని బయలుదేరాడు. చీకటిపడే వేళ ఓ నది ఒడ్డున బస చేశాడు. అక్కడ అగ్ని ప్రత్యక్షమై బ్రహ్మజ్ఞానంలోని రెండో పాదాన్ని వివరించాడు. సత్యకాముడిలో విషయ వాంఛలు అంతరించాయి. మర్నాడు దినమంతా ప్రయాణించి ఒక చోట ఆగిన సత్యకాముడి ఎదుట ఓ హంస ప్రత్యక్షమై బ్రహ్మజ్ఞానంలోని మూడో పాదాన్ని తేటపరచింది. దాంతో అతనిలో కొత్త కాంతులు వెల్లివిరిశాయి. ఆ తర్వాతి రోజు సాయంత్రం ఓ ప్రదేశంలో సేదదీరిన సత్యకాముడి ఎదుట బంగారు రంగులో ఉన్న ఓ పక్షి వాలింది. బ్రహ్మజ్ఞానం నాలుగో పాదాన్ని ఆవిష్కరించింది. తనలోనే బ్రహ్మాన్ని దర్శించుకున్న సత్యకాముడు మర్నాడు మందతోపాటు గౌతముడి గురుకులాన్ని చేరుకున్నాడు. అణువణువునా బ్రహ్మజ్ఞాన తేజస్సుతో వెలిగిపోతున్న సత్యకాముణ్ని గురువు హృదయానికి హత్తుకున్నాడు. ఛాందోగ్య ఉపనిషత్తులో కనిపిస్తుందీ కథ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు