లౌకిక వాసనలు

బెంగాల్‌లోని ఓ కుగ్రామంలో ఇద్దరు యువతులున్నారు. వాళ్లు పొరుగూరులో సంత జరుగుతోంటే చేపలు అమ్మడానికి వెళ్లారు. అమ్మకాలు పూర్తయ్యేసరికి చీకటి పడింది. వచ్చిన డబ్బు లెక్కచూసుకుని

Published : 23 Sep 2021 02:29 IST

బెంగాల్‌లోని ఓ కుగ్రామంలో ఇద్దరు యువతులున్నారు. వాళ్లు పొరుగూరులో సంత జరుగుతోంటే చేపలు అమ్మడానికి వెళ్లారు. అమ్మకాలు పూర్తయ్యేసరికి చీకటి పడింది. వచ్చిన డబ్బు లెక్కచూసుకుని ఇంట్లో అవసరమయ్యే సరుకులు కొనుక్కుని తిరిగి బయల్ద్దేరారు.

ఉన్నట్టుండి వాతావరణంలో మార్పొచ్చింది. సన్నగా జల్లు మొదలై, జడివాన కురుస్తోంది. వడగండ్ల నుంచి రక్షించు కోవటానికి చేతిలో ఉన్న బుట్టల్ని తలపై పెట్టుకున్నారు. ఓ ఇంటి అరుగెక్కి చూరు కింద నిల్చున్నారు. వీళ్ల అలికిడికి ఇంటి యజమాని రాధాకాంతుడు బయటకు వచ్చాడు. అతనో పూల వ్యాపారి. తడుస్తున్నారని లోపలికి రమ్మని పొడి బట్టలు ఇచ్చి భోజనం ఏర్పాటుచేశాడు.

వర్షం అంతకంతకూ పెరగటంతో యజమాని ఆ రాత్రికి అక్కడే పడుకోమన్నాడు. ఆ గది నిండా పూల సుంగంధాలే. యువతులు ఒక చాప పరచుకుని పడుకున్నారు. పగలంతా శ్రమించి అలసిపోయినప్పటికీ ఎంతకూ నిద్రపట్టలేదు. ఇద్దరికీ విసుగ్గా ఉంది. కొంతసేపటికి ఒక యువతి లేచి అరుగు మీదున్న తమ బుట్టలు రెండూ తీసుకొచ్చింది. వాటిని తల దగ్గర పెట్టుకున్నారో లేదో క్షణాల్లో నిద్ర పట్టేసింది.

శిష్యులకు వేదాంతం ఉపదేశించటానికి రామకృష్ణ పరమహంస తరచూ ఈ కథ చెబుతుండేవారు. మనకు అలవాటైన విషయాలు, సౌకర్యాలు మనల్ని పట్టి ఉంచుతాయి. ఆధ్యాత్మికంగా ముందుకు సాగనివ్వవు. వాటిని ఎలాగైనా వదిలించుకోవాలి. అలాగే లౌకిక విషయాలు కనపడని గొలుసులతో మనల్ని బంధిస్తుంటాయి. అది ఆహారం, దుస్తులు, వసతి, వస్తువులు- ఏదైనా సరే.. మనం బానిసలు కాకూడదన్నది పరమహంస ప్రబోధ.  

- ధాత్రీశ్వరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని