మహిమాలయం!

మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 348వ ఆరాధనోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. స్వామి జీవితం, బృందావనం మాత్రమే కాదు మరికొన్ని విశేషాలూ ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి.

Published : 08 Aug 2019 01:01 IST

మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 348వ ఆరాధనోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. స్వామి జీవితం, బృందావనం మాత్రమే కాదు మరికొన్ని విశేషాలూ ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి.

పాదోదకం...పావనం: రోజూ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇస్తారు. బృందావనాన్ని హరి మందిరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ 700 సాలిగ్రామాలను ప్రతిష్ఠించారు. ఎందరో మహానుభావులూ ఇక్కడే కొలువై ఉన్నారనీ భక్తులు నమ్ముతారు. ఒక్కసారి రాఘవేంద్రస్వామి బృందావనానికి అభిషేకం చేస్తే ఎందరో గురువులకు, సాలిగ్రామాలకు అభిషేకాలు చేసినట్లు అవుతుంది. అలాంటి జలం అత్యంత పవిత్రమైందని... చాలా వ్యాధులను ఇది నివారిస్తుందని చెబుతారు. ఈ పాదోదకాన్ని తాగడానికి మాత్రమే కాకుండా భక్తులపై ప్రోక్షణం కూడా చేస్తారు. దీని వల్ల పిశాచి వంటి పీడలు తొలిగిపోతాయని విశ్వసిస్తారు.

మంత్రాక్షితలు: రాఘవేంద్రస్వామి దర్శనం అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షితల కోసం బారులు తీరుతారు. ఈ అక్షితల్లో పసుపు, సున్నం కలుపుతారు. అందుకే అవి ఎర్రగా ఉంటాయి. రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతిగా ఎవరున్నా భక్తులకు అక్షితలను ఇచ్చే సంప్రదాయం రాఘవేంద్రస్వామి కాలం నుంచి కొనసాగుతోంది. ఆనాడు ఆ యతీంద్రులు వాడిన పాత్రలోనే నేటికీ వాటిని తయారుచేసి భక్తులకు ఇస్తుండడం విశేషం. మఠంలో ఆ పాత్ర పవిత్రతను కాపాడుకుంటూ వస్తున్నారు.

మృత్తిక మహిమ: రాఘవేంద్రస్వామి బృందావనంపై ఉంచే మృత్తిక చాలా విశిష్ఠమైందని నమ్మకం. దీన్ని విషయంలో ఓ కథ ఉంది. గురు రాఘవేంద్రులు బృందావన ప్రవేశానికి ముందు మంత్రాలయంలో ఉన్నప్పుడు.. ఓ బ్రాహ్మణ భక్తుడు స్వామి దగ్గరకు వెళ్లి స్వామీ నా కుమారుడి ఉపనయనానికి ధనం కావాలని అడిగాడు. ఆ సమయంలో స్వామి తుంగభద్ర నది ఒడ్డున స్నానం కోసం ఉన్నారు. రోజూ మృత్తికతో స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలోని ఆ మట్టినే భక్తుడికి ఇచ్చారు. దానిని తీసుకొని వెళ్తూ ఆ భక్తుడు దారితప్పి మరో గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ గురు రాఘవేంద్రులు ఇచ్చిన మృత్తిక సాయంతో ఓ ధనవంతుడి సంతానాన్ని హరిస్తున్న పిశాచిని సంహరిస్తాడు. అప్పుడా ధనవంతుడు సంతోషంతో పేద భక్తుడి ఇంట్లో ఉపనయన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. అంతటి మహిమ ఉన్న ఆ మృత్తికను   నేటికీ మంత్రాలయంలో పూజిస్తున్నారు. రాఘవేంద్రస్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసి వనం ఏర్పాటుచేశారు. ఏటా ఆషాఢమాసంలో గురుపౌర్ణమి రోజు స్వామి ఉత్సవమూర్తిని తీసుకెళ్లి అక్కడి మృత్తికకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుతో తెచ్చి స్వామి మూల బృందావనంపై ఉంచుతారు. ఇతర ప్రాంతాల్లో రాఘవేంద్రస్వామి ఆలయాల స్థాపనకు ఈ మృత్తికను వినియోగిస్తారు. అలాగే ఈ మృత్తికను భక్తులు తీసుకెళ్లి ఇళ్లల్లో ఉంచుకుంటారు.

మంచాలమ్మ దర్శనం: రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా మఠం ముందు ఉండే గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుంటారు. రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో బృందావనం ప్రవేశం చేయక ముందు అమ్మవారిని దర్శించి నేను ఇక్కడే కొలువై ఉంటాను. ముందుగా నీకు నైవేద్యం, దర్శనం అయిన తర్వాతే నా బృందావనాన్ని భక్తులు దర్శించుకుంటారని చెప్పినట్లు మఠం పండితులు చెబుతారు.

ఉత్సవాలు ఇలా...:

14(బుధవారం): పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.
* 15: శాఖోత్సవం, ధాన్యపూజలు చేస్తారు.
* 16: పూర్వారాధన నిర్వహిస్తారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం ఉంటుంది.
* 18: ఉత్తరారాధన రోజున స్వామివారి ఉత్సవమూర్తిని మహా రథంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగిస్తారు.
* 19: సుజ్ఞానేంద్ర ఆరాధన జరుగుతుంది.
* 20: ఆరాధనోత్సవాలు ముగుస్తాయి.
- ఈ.రామకృష్ణ, మంత్రాలయం

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని