Kotappakonda: విశిష్ట నైవేద్యం.. అరిసె ప్రసాదం

తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదానిది ప్రత్యేక స్థానం. ఎవరైనా తిరుపతి

Updated : 01 Mar 2022 10:54 IST

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదానిది ప్రత్యేక స్థానం. ఎవరైనా తిరుపతి వెళితే ప్రసాదం ఏది అని అడిగేంత ప్రీతి.  గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే ‘అరిసె’ ప్రసాదం కూడా విశేషమైనదే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సంప్రదాయం లేదు. రుచిలోనూ దీటుగా నిలుస్తోంది. త్రికోటేశ్వరస్వామి దేవస్థానం చరిత్రలో 90వ దశకం చిరస్థాయిలో నిలిచిపోతుంది. కోటప్పకొండకు ఘాట్‌రోడ్డు నిర్మాణం, ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది అప్పుడే. ఆ సమయంలోనే త్రికోటేశ్వరుని ప్రత్యేకత చాటేలా ప్రసాదం ఉండాలని అప్పటి మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పండితులతో చర్చించి స్వామికి అరిసె ప్రసాదం సమర్పించాలన్న యోచనకు వచ్చారు. 2000 సంవత్సరం నుంచి అరిసెను స్వామికి నైవేద్యంగా ఉంచుతున్నారు. 

ఈశ్వరునికి ప్రీతిపాత్రం 

ఈశ్వరునికి నైవేద్యంగా సమర్పించే వాటిని భోగాలుగా పిలుస్తారు. భోగం అంటే ఘనమైనది అని అర్థం. స్వామికి సమర్పించే భోగాల్లో పులిహోర, చక్రపొంగలి వంటివి ఉన్నాయి. ఈ క్రమంలోనే అపూపం(అరిసె)ను స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యంగా గుర్తించి సమర్పిస్తున్నారు. సంస్కృతంలో అరిసెను అపూపంగా పిలుస్తారు. స్వామికి నివేదన చేసిన తర్వాతే కౌంటర్లకు తరలించి భక్తులకు విక్రయిస్తారు. 

ప్రసాదం తయారీ ఇలా ..

అరిసె ప్రసాదం తయారీకి అధికారులు ప్రత్యేకంగా వినియోగించాల్సిన పదార్థాలను నిర్ణయించారు. 360 అరిసెల తయారీకి ఉపయోగించాల్సిన వస్తువులను పట్టిగా పిలుస్తారు. అరిసె, లడ్డూ ప్రసాదాలు వంటశాలలోనే తయారవుతాయి. 12 కిలోల బియ్యం, 8 కిలోల బెల్లం, 5 కిలోల నెయ్యి, 100 గ్రాముల యాలకులు, 5 గ్రాముల పచ్చకర్పూరం వినియోగిస్తారు. స్వచ్ఛమైన నెయ్యి, పచ్చకర్పూరం వాడటం వల్ల అరిసెకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. నెలకు 20వేల అరిసెలు స్వామి  వంటశాలలో తయారవుతాయి. అదే కార్తిక మాసం, మహాశివరాత్రి సమయాల్లో లక్షకు పైగా భక్తుల కోసం సిద్ధం చేస్తారు.   


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని