పులి బదులు ఆవు చనిపోయింది...

ఏనుగుముఖంతో విలక్షణుడైన విఘ్నాధిపతికి ఊరూరా గుళ్లున్నాయి. అయితే పది చేతులతో, సిద్ధిలక్ష్మిని ఎడమతొడపై కూర్చోబెట్టుకున్న విశిష్టమూర్తి శరవు మహాగణపతి కర్ణాటక రాష్ట్ర మంగళూరులో

Updated : 30 Aug 2022 14:27 IST

నుగుముఖంతో విలక్షణుడైన విఘ్నాధిపతికి ఊరూరా గుళ్లున్నాయి. అయితే పది చేతులతో, సిద్ధిలక్ష్మిని ఎడమతొడపై కూర్చోబెట్టుకున్న విశిష్టమూర్తి శరవు మహాగణపతి కర్ణాటక రాష్ట్ర మంగళూరులో కొలువయ్యాడు. అదే ఆలయంలో కోరమీసాల కన్నడరాయుడిగా పరమశివుణ్ని కూడా చూడగలం.

హ్యాద్రి, కుమారగిరి పర్వతాలు, కుమారధార, నేత్రావతి, ఫల్గుణి నదులతో సుందర, చారిత్రక ప్రదేశం మంగళూరు. ఈ సుక్షేత్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. శతాబ్దాల క్రితం వీరబాహు తుళు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. జాతివైరం మరచి సకల జీవులు కలిసుండే ఈ దైవిక ప్రాంతంలో వేటకొచ్చిన వీరబాహు గోవుని చంపబోతోందని పొరబడి పులిపై బాణం వదిలాడు. అది గురితప్పి గోవుకే తగిలి చనిపోయింది. గోహత్యా పాపం పోగొట్టుకోవడానికి భరద్వాజమహర్షి చెప్పినట్లు అక్కడ ఆలయాన్ని నిర్మించి శివలింగం ప్రతిష్టించాడు. ఆ బాణం పడిన చోట ‘శంకరా ఓ శరభేశ్వరా’ అన్న భరద్వాజ వాక్కు ప్రకారం శివునికి శరభేశ్వరుడనే పేరొచ్చింది. తండ్రి చెంతనే స్వయంభువుగా శరవు మహాగణపతి వెలశాడు. కోట, కోట బురుజుల్లా ఉండే ఆలయ బాహ్య నిర్మాణం ఆకర్షిస్తుంది. శృంగి, భృంగిల శిల్పాకృతుల శిల్పశైలి తుళురాజుల శిల్పశైలికి నిదర్శనం. గోపురాలు, ఏకకలశ విమానశిఖరాలు, వాటిపై పలు శిల్పాకృతులు, కేరళ శైలిలో బంగాళాపెంకు పైకప్పుల మంటపాలు ఇంపుగా కనిపిస్తాయి. గోడలపై తైలవర్ణ చిత్రాలు పురాణగాథలను వ్యక్తంచేస్తాయి.  

గర్భాలయంలో దశబాహువులతో దక్షిణతుండపు సిద్ధిలక్ష్మీ సమేత బొజ్జవినాయకుని మహా ఆకృతిగా దర్శనమిస్తున్నాడని భక్తులు భావిస్తారు. కుడివైపుకి తిరిగిన తుండంలో అమృతకలశాన్ని పట్టుకున్న క్షిప్రగణపతిగా పదిచేతుల మహాగణపతిగా భక్తులకు నేత్రపర్వం కలిగిస్తున్నాడు.    

ఇక్కడ జరిగే పూజలు విశేషంగా ఉంటాయి. శరభేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకాలు, రంగపూజ, బిల్వార్చనలు కనువిందు చేస్తాయి. ఉగాది రథోత్సవం, ధ్వజారోహణ, ఆయుధపూజ, వాహనపూజలు జరిపించుకునే అవకాశం భక్తులకుంది. రోడ్డు రైలు వాయు మార్గాల్లో బెంగళూరు వెళ్లి గుబ్బి, బేలూరు, మదిగెరెల మీదుగా మంగళూరు గణపతి దేవస్థానానికి చేరుకుంటారు.    

- టి.విష్ణుకాంతయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని