దైవదూత దిగివచ్చే కాలం

‘ఓ శ్రేయోభిలాషీ! ముందుకు సాగు! ఇప్పటి దాకా చేసిన అలక్ష్యం చాలు. నిద్ర నుంచి మేలుకో! నింగినున్నవాడు అనుగ్రహించిన రంజాన్‌ ప్రారంభమైంది. ఇది పుణ్యకాలం. మేలుకో! సత్కార్యాల సామగ్రిని కూడ బెట్టుకో! దైవభీతి మూటను తోడు తీసుకో! నువ్వో బాటసారివి. ఇహలోకం కేవలం విశ్రాంతి స్థలం

Updated : 07 Apr 2022 04:43 IST

ఇస్లాం సందేశం

‘ఓ శ్రేయోభిలాషీ! ముందుకు సాగు! ఇప్పటి దాకా చేసిన అలక్ష్యం చాలు. నిద్ర నుంచి మేలుకో! నింగినున్నవాడు అనుగ్రహించిన రంజాన్‌ ప్రారంభమైంది. ఇది పుణ్యకాలం. మేలుకో! సత్కార్యాల సామగ్రిని కూడ బెట్టుకో! దైవభీతి మూటను తోడు తీసుకో! నువ్వో బాటసారివి. ఇహలోకం కేవలం విశ్రాంతి స్థలం. నువ్విక్కడే ఆగితే ఎలా?! మధ్యలో వచ్చే మజిలీలను గమ్యమని భ్రమిస్తే నష్టపోయేదీ, కష్టపడేదీ నువ్వే’ రంజాన్‌ నెలవంక దర్శనమివ్వగానే ఓ దైవదూత ఇలా చాటింపు వేస్తాడని ప్రవక్త (స) చెప్పారు. ఇస్లామిక్‌ నెలల్లో రంజాన్‌ తొమ్మిదోది. ఈ నెలంతా ఉపవాసాలు పాటించాలన్న అల్లాహ్‌ ఆదేశానుసారం ముస్లిములు ఉపవాసదీక్ష పాటిస్తారు.  వెలుగు రేఖలు రాకముందే (సహరీ వేళ) భుజించి సాయంత్రం ఇఫ్తార్‌ వరకూ సుమారు పదిహేను గంటలపాటు ఉపవాసం ఉంటారు. దైవభీతి, చెడు పనుల పట్ల ఏవగింపు, మంచి పనులపై ఆసక్తి కలిగేలా ప్రేరేపిస్తాయి ఉపవాసాలు. అన్నపానీయాలకు దూరంగా ఉన్నట్లే దుష్క్రియలకు దూరంగా ఉండాలన్నది రోజా ఉద్దేశం. పూర్వీకులు రంజాన్‌ మాసం ముగియగానే, మరుసటి సంవత్సరం రంజాన్‌ నెల చూస్తామో లేదోననుకుంటూ నెలల తరబడి బాధపడేవారు. ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హన్బల్‌ (ర) రంజాన్‌ నెలలో ఎక్కువ సమయం మస్జీదులోనే గడిపే వారు. అల్లాహ్‌ నామస్మరణ, ఖురాన్‌ పఠనంతో గడిపేవారు. ‘దేహంలో రక్త మాంసాల పాత్ర లాంటివి విశ్వాసి జీవితంలో నమాజ్‌, ఉపవాసం’ అన్నారు సాబిత్‌ అల్‌ బన్నానీ (ర.అ). ఖతాదా బిన్‌ దఅమా (ర.అ) వారానికోసారి ఖురాన్‌ పూర్తిచేసేవారు. రంజాన్‌ రాత్రుల్లో దైవ దూతల నాయకులు జిబ్రీల్‌ (అ) స్వయంగా దివి నుంచి భువికి దిగివచ్చి ప్రవక్తతో (స) కలిసి ఖురాన్‌ పారాయణ చేసేవారట. అందుకే ఈ నెలలో రాత్రుళ్లు ఖురాన్‌ చదువుతారు.  - తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని