పరబ్రహ్మ స్వరూపం

దేవతలూ, రాక్షసులకు ఎప్పుడూ వైరమే. ఎప్పట్లాగే ఓసారి యుద్ధానికి దిగారు. దేవతలు విజయం సాధించి విజయగర్వంతో తమకంటే గొప్పవారు లేరనుకున్నారు. ఆ గర్వాన్ని గమనించిన పరమేశ్వరుడు వారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు....

Updated : 28 Apr 2022 05:06 IST

దేవతలూ, రాక్షసులకు ఎప్పుడూ వైరమే. ఎప్పట్లాగే ఓసారి యుద్ధానికి దిగారు. దేవతలు విజయం సాధించి విజయగర్వంతో తమకంటే గొప్పవారు లేరనుకున్నారు. ఆ గర్వాన్ని గమనించిన పరమేశ్వరుడు వారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు.
ఒకరోజు అమరావతి పట్టణంలో ఇంద్రుని దర్బారు జరుగుతోంది. దేవతలకు పాఠం నేర్పడానికి ఇదే సమయమనుకుని యక్షుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు  పరమేశ్వరుడు. ఆ తేజోవంత రూపం చూసి ఆశ్చర్యపోయిన దేవతలు వివరం తెలుసుకోమని అగ్నిని పంపారు. అగ్నిని చూసి, ‘నీ శక్తి సామర్థ్యాలు ఏమిటి?’ అనడిగాడు యక్షుడు.

‘తేజస్వీ! నా పరాక్రమం మీకు తెలియదా? భూమిపై కనిపించే వస్తువులన్నింటినీ భస్మీపటలం చేస్తాను’ అన్నాడు అగ్ని. వెంటనే ఓ గడ్డిపోచను చూపి భస్మం చేయమన్నాడు యక్షుడు. తన శక్తినంతా ఉపయోగించినా ఆ గడ్డిపరకను దహించలేకపోయాడు అగ్ని. సిగ్గుతో వెనుతిరిగి యక్షుని తత్వాన్ని తెలుసుకునే సామర్థ్యం తనకు లేదని చెప్పాడు. దేవతలు ఈసారి వాయువుని పంపారు. ‘భూమి మీద ఉన్న దేన్నయినా ఎగరగొడతాను. ఒక్క క్షణంలో భూమ్యాకాశాలను కలిపేస్తాను’ అన్న వాయుదేవునితో, ‘ఈ గడ్డిపోచను ఎగరగొట్టు’ అన్నాడు యక్షుడు. వాయువు తన శక్తినంతా ఉపయోగించినా దానిని కదిలించలేక పోయాడు. తల వంచుకుని తిరిగివెళ్లి యక్షుని తత్వం తనకు బోధపడలేదని చెప్పాడు. తర్వాత పంపిన ఇంద్రుడు వెళ్లేసరికి యక్షుడు లేడక్కడ. ఇంద్రుడు అతడి కోసం వెతుకుతుండగా పార్వతీదేవి ప్రత్యక్షమైంది. ఇంద్రుడు నమస్కరించి విషయం చెప్పాడు.

‘ఇంద్రా! నువ్వడిగిన యక్ష రూపం సాక్షాత్తు అపరబ్రహ్మస్వరూపం. సకాలంలో మీలో ఉన్న బ్రహ్మమే దేవాసుర యుద్ధంలో మీ గెలుపుకు కారణం. ఆ నిజాన్ని తెలుసుకోలేక స్వయంశక్తితోనే గెలిచామని గర్విస్తున్నారు మీరు. అది పోగొట్టడానికి ఆ బ్రహ్మమే యక్ష రూపంలో మీ ముందుకు వచ్చింది. మీ శక్తికి కారణం పరబ్రహ్మమే. ఆ మహాశక్తి సహకారం లేకపోయేసరికి గడ్డిపోచను కూడా కదల్చలేక పోయారు. పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్నవాళ్లు అజ్ఞానాన్ని వదిలి సర్వ శ్రేష్టమైన బ్రహ్మంలో నివసిస్తారు’ అంటూ చెప్పి అంర్థానమైంది పార్వతీదేవి.

- అమృతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని