నిజమా... అబద్ధమా!

గొప్ప ధర్మవేత్తలు కూడా కొన్ని సందర్భాల్లో ధర్మసూక్ష్మం గురించి తెలుసుకోలేరు. ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమని రుజువు చేసే కథ ఒకటుంది. పూర్వం దండకారణ్యంలో ధర్మాత్ముడు, సత్యవాది అయిన ఒక రుషి ఉండేవాడు. ఆయన ఆశ్రమం ఎదుట

Updated : 02 Jun 2022 05:46 IST

గొప్ప ధర్మవేత్తలు కూడా కొన్ని సందర్భాల్లో ధర్మసూక్ష్మం గురించి తెలుసుకోలేరు. ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమని రుజువు చేసే కథ ఒకటుంది. పూర్వం దండకారణ్యంలో ధర్మాత్ముడు, సత్యవాది అయిన ఒక రుషి ఉండేవాడు. ఆయన ఆశ్రమం ఎదుట రెండు పెద్ద అరుగులున్నాయి. రుషి ఒకరోజు కుడివైపునున్న అరుగుమీద శిష్యులకు పాఠాలు చెబుతుండగా ఒక ఆవు భయంకర ఆర్తనాదాలు చేస్తూ ఆశ్రమం ముందు నుంచీ పరుగులు తీసింది. వేటగాడు ఆవును తరుముతూ వస్తున్నాడని గ్రహించిన రుషి కుడి అరుగు మీదనుంచీ లేచి ఎడమ అరుగుమీద కూర్చున్నాడు. శిష్యులను ఏమీ మాట్లాడవద్దని సైగ చేశాడు. వాళ్లకేమీ అర్థంకాక ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. కొద్ది క్షణాలకు వేటగాడు వచ్చి ‘స్వామీ! ఆవు ఎటు వెళ్లింది?’ అనడిగాడు. రుషి సత్యవాది. కానీ నిజం చెబితే గోహత్యకు కారణమవుతాడు. ‘నాయనా నేనీ అరుగుమీద కూర్చుని పాఠం చెబుతున్నప్పుడు ఇటు ఏ ఆవూ వెళ్లలేదు’ అన్నాడు. వేటగాడు ముని సమాధానంతో వెనుతిరిగి వెళ్లిపోయాడు. రుషి కుడివైపు అరుగు మీద ఉన్నప్పుడు ఆవు వెళ్లింది. అది సత్యం! అందుకే ఆయన అరుగు మారి కూర్చున్నాడు. అప్పుడు ఏ ఆవూ అటు వెళ్లలేదు అదీ నిజమే! గురువుగారు అబద్ధం చెప్పకుండా ఆవును కాపాడిన పద్ధతికి శిష్యులకు ధర్మ సూక్ష్మం అంటే ఏమిటో తెలిసింది. అంటే రెండు ధర్మాల మధ్య ఘర్షణ వస్తే ఉత్తమ మార్గాన్ని ఎంచుకోవడమే ధర్మసూక్ష్మం.

- డాక్టర్‌ టేకుమళ్ల వెంకటప్పయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని