వేదవ్యాసుని ప్రార్థిస్తే...

ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాసపూర్ణిమ. ఆరోజు సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం

Published : 07 Jul 2022 00:55 IST

జులై 13 వ్యాస పూర్ణిమ

షాఢ శుద్ధ పౌర్ణమి వ్యాసపూర్ణిమ. ఆరోజు
సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం

అంటూ గురు పరంపరను స్మరించుకోవాలి. బ్రహ్మ విద్యాసారం, మహాభారతం, అష్టాదశ పురాణాలు- ఇలా సకల వేదసారాన్ని మనకందించిన వ్యాసుడు అగ్రగురువు. భగవంతుడికీ భక్తుడికీ మధ్య సంధానకర్త గురువు.

నారాయణ నమస్కృత్వ నరంచైవ నరోత్తమం దేవీం
సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్‌

అంటే నారాయణుడికి, నరశ్రేష్టుడికి, సరస్వతీదేవికి, వేదవ్యాసునికి నమస్కరించాలని దీని భావం.
విష్ణు సహస్రనామ సంకీర్తనలో ‘వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే’ అన్నారు. విష్ణు స్వరూపుడే వ్యాసుడన్నమాట.

గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్‌ పరంబ్రహ్మ తస్మైః శ్రీ గురవేనమః

గురువే సర్వదేవతామూలం. గురువును పూజిస్తే సర్వదేవతలనూ పూజించినట్టే. వ్యాసపౌర్ణమినాడు గురువులను పూజించడం వెనుక బ్రహ్మాండపురాణంలో ఓ కథ ఉంది. ఈ గాథను నారదుడు వైశంపాయనుడికి చెప్పాడు. పూర్వం వారణాసిలో వేదనిధి, వేదవతి అనే దంపతులుండేవారు. వారికి సంతానం లేనందున వేదవ్యాసుని ప్రసన్నం చేసుకుని, తమకా భాగ్యాన్ని ప్రసాదించమన్నారు. వారికి త్వరలోనే సంతానం కలుగుతుందని ఆశీర్వదించాడాయన. ‘మేం కోరుకున్నప్పుడ్లలా మిమ్మల్ని దర్శించు కునేదెలా?’ అనడిగాడు వేదనిధి. ‘వస్త్ర, ఆభరణ, గోదానాలతో, అర్ఘ్య పాద్యాలతో పూజిస్తే నేను ప్రత్యక్షమౌతాను. జ్ఞానాన్ని ఉపదేశించేవారిలో ఉంటాను. జ్ఞానవాసువులైన గురువులను వ్యాస పౌర్ణమి నాడు పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయి’ అన్నాడు వ్యాసుడు. అప్పటి నుంచి వ్యాసపౌర్ణమినాడు గురువులను వ్యాసభగవానుని స్వరూపంగా తలచి కొలుచుకునే ఆచారం వస్తోంది. ఈ రోజే సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించి దక్షిణాయనం ప్రారంభమౌతుంది. కనుక విష్ణుపూజ, విష్ణు సహస్రనామ పారాయణం, వ్యాసుని గ్రంథాలు చదవడం, దానధర్మాలతో సుఖసంతోషాలు కలుగుతాయి. త్రికరణ శుద్ధిగా వేదవ్యాసుని ప్రార్థిస్తే సర్వ సంపదలూ అనుభూతికొస్తాయి.

- డా.టేకుమళ్ల వెంకటప్పయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని