మధురం స్నేహానుబంధం

కోపం, ద్వేషం, అయిష్టం, అసూయ లాంటివి మనసులో అశాంతిని రేకెత్తించి ఆందోళనకు దారితీస్తాయి. అందుకు భిన్నంగా తోటివారి మీద ప్రేమ, వాత్సల్యం చూపితే.. ప్రశాంతత, ఆనందం చేకూరతాయి. వేదోపనిషత్తుల నుంచి ఆధ్యాత్మిక గురువుల వరకూ అదే ఉపదేశించారు. రామాయణ భారతాల్లోనే కాదు పారమార్థిక మార్గంలో మార్గదర్శులుగా నిలిచిన ఆధునిక గురువులు కూడా స్నేహానికి అత్యున్నత స్థానమిచ్చారు.

Updated : 27 Jul 2023 04:09 IST

కోపం, ద్వేషం, అయిష్టం, అసూయ లాంటివి మనసులో అశాంతిని రేకెత్తించి ఆందోళనకు దారితీస్తాయి. అందుకు భిన్నంగా తోటివారి మీద ప్రేమ, వాత్సల్యం చూపితే.. ప్రశాంతత, ఆనందం చేకూరతాయి. వేదోపనిషత్తుల నుంచి ఆధ్యాత్మిక గురువుల వరకూ అదే ఉపదేశించారు.

రామాయణ భారతాల్లోనే కాదు పారమార్థిక మార్గంలో మార్గదర్శులుగా నిలిచిన ఆధునిక గురువులు కూడా స్నేహానికి అత్యున్నత స్థానమిచ్చారు. అందులోని మాధుర్యాన్ని చవిచూశారు. బంధుత్వం కన్నా మైత్రి అపురూపమైందని నిరూపించారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తర్వాత స్వామి వివేకానంద ఓ రోజు కోల్‌కతాలో రామకృష్ణ పరమహంస గృహస్థ శిష్యుడైన బలరాం బోస్‌ ఇంటికి వెళ్లారు. గానంలో విశేష ప్రావీణ్యం ఉన్న స్వామీజీని అక్కడివారు ఓ పాట పాడమని బలవంతపెట్టారు. ఇంతలో ఆయనకు జగన్నాథ టాగోర్‌ గుర్తుకు రాగా ‘నా చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్‌ ఈ పక్క వీధిలోనే ఉంటాడు. అతడు మృదంగం చక్కగా వాయిస్తాడు. నరేన్‌ పిలుస్తున్నాడని చెప్పి అతన్ని తీసుకురండి’ అన్నారు. ఆ మాటలు విన్న జగన్నాథ్‌ విస్మయానందాలకు లోనయ్యాడు. ‘నరేన్‌కి ఇంకా నేను గుర్తున్నానా?’ అనుకుంటూ శరవేగంగా వచ్చాడు. అతణ్ణి చూడగానే స్వామీజీ బాల నరేన్‌గా మారిపోయారు. గతస్మృతులను తలచుకుంటూ పాతరోజుల్లోకి వెళ్లిపోయారు. అయినా అతడు స్వామీజీకి దగ్గరగా కూర్చునేందుకు సంశయిస్తున్నాడు. అది గమనించి వివేకానంద ‘జగన్నాథ్‌! ఎందుకు బిడియం? నేను అప్పటి నరేన్‌నే! రా! పక్కన కూర్చో!’ అంటూ ఆత్మీయంగా పిలిచారు. స్వామి వివేకానంద విశ్వవిఖ్యాతి గాంచినా, ఎలాంటి భేషజాలు లేకుండా, భుజకీర్తుల ఊసులేకుండా బాల్యమిత్రులతో కలసిపోయే వారు.

మహర్షి మనసులో ముస్లిం మిత్రుడు

రమణ మహర్షి కాలంలో తమిళనాట అబ్దుల్‌ వాహబ్‌ అనే పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఉండేవారు. ఒక దుకాణంలో కౌపీనంలో ఉన్న ఓ వ్యక్తి ఫొటోని చూసి- ‘ఎవరితను? పూలూ, కుంకుమలతో ఈ చిత్రపటాన్ని ఎందుకు పూజిస్తున్నారు?’ అనడిగారు. ‘ఆయన అరుణాచలంలో వెలసిన భగవాన్‌ రమణ మహర్షి. మీకు తెలియదా?’ అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు దుకాణ యజమాని. ఆ మాటలకు అబ్దుల్‌ వాహబ్‌ తెల్లబోయారు. తనతో చిన్నప్పుడు కలసిమెలసి ఆడుకున్న ప్రాణస్నేహితుడు వెంకటరామన్‌ ఇంతటి మహాత్ముడు ఎలా అయ్యాడనుకుని అబ్బురపడ్డారు. అంత ఉన్నత స్థితిలో ఉన్న ఈ బాల్యమిత్రుడు తాను వెళ్తే గుర్తుపడతాడా! అని ఆలోచించారు. అయినా చూద్దామనుకొని తిరువణ్ణామలై వెళ్లారు. బిడియంగా, బెరుగ్గా మహర్షి ఆశ్రమంలో అడుగుపెట్టారు. రమణులు ఎదురుపడగానే ‘నేను..’ అంటూ పరిచయం చేసుకోబోయారు. ఆ మౌనర్షి ఎంతో ప్రేమగా అతని చేయి పట్టుకొని తీసుకెళ్లి, పక్కన కూర్చోబెట్టుకొని ‘వాహబ్‌ బాగున్నావా? ఎప్పుడొచ్చావు? ఎన్నాళ్లయింది నిన్ను చూసి!’ అంటూ కుశలప్రశ్నలు వేశారు. ఇద్దరూ చిన్ననాటి విషయాలెన్నో మాట్లాడుకున్నారు. మహర్షి చెంతన కూర్చున్న అబ్దుల్‌ వాహబ్‌ భాగ్యానికి భక్తులు అచ్చెరువొందారు. ఆ ముస్లిం మిత్రుడు రమణులతో ‘నువ్వు బాగా పైకి వచ్చావు, సంతోషం’ అన్నాడు. మహర్షి వెంటనే ‘లేదు వాహబ్‌, నేను బాగా లోపలికి వెళ్లాను. నువ్వు బాగా పైకి వచ్చావు’ అన్నారు. గంభీరమైన ఆ మాటల్ని అర్థం చేసుకున్న వారందరికీ ఆనాడు ఓ ఆధ్యాత్మిక సందేశం అందినట్లయింది. ఆ తర్వాత అబ్దుల్‌ రమణాశ్రమానికి అంకితమైపోయారు.

కృష్ణకుచేలురులను తలపించేలా..

రమణులకు బాల్యంలో విలచ్చేరి రంగనాథయ్యర్‌ అనే బాల్యమిత్రుడు ఉండేవాడు. చిన్నతనంలో సాయంత్రం కాగానే వెంకటరామన్‌ ఆయనతో కలసి ఫుట్‌బాల్‌ ఆడటానికి వెళ్తుండేవారు. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని అతడోసారి అరుణాచలానికి వచ్చాడు. మహర్షి తనను మరచిపోయి ఉంటారన్న సందేహంతో ఎదురుగా వెళ్లి కాస్త దూరంలో నిలబడ్డారు. రమణులు చిన్నప్పటిలానే ‘రంగన్‌’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. తర్వాత మహర్షి ఆ మిత్రుణ్ణి, అతని కుటుంబాన్ని ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కించి, వారి జీవితాల్నే మార్చేశారు.

రమణుల ఆశ్రమంలో ఈ ఉదంతాలను చూసిన ప్రత్యక్ష సాక్షులు.. కుచేలుడు తన సౌధానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు స్పందించిన తీరే గుర్తొచ్చిందని అనుభూతి చెందారు. ఆ సందర్భంలో బాల్యమిత్రుణ్ణి చూసి కృష్ణుడు ఆనందించిన వైనానికి రుక్మిణీదేవి సహా అంతఃపుర కాంతలందరూ ఆశ్చర్యపోయారట. కుచేలుణ్ణి ఆంతరంగిక మందిరంలోకి తీసుకువెళ్లి, ఆ నందనందనుడు స్వయంగా తానే అతిథి మర్యాదలు చేశాడట. బాల్యంలో మునకలేస్తూ ‘మిత్రమా! అన్యోన్య స్నేహవాత్సల్యాలతో మెలిగిన సందర్భాలను నువ్వు మర్చిపోలేదు కదా!’ అంటూ ఆనాటి అనుభూతులను నెమరువేసుకున్నాడట.

పరమహంస ప్రియమిత్రులు

రామకృష్ణ పరమహంస ఆయా సందర్భాల్లో బాల్యస్నేహితులైన గంగావిష్ణు లాహా, శ్రీరామ్‌మల్లిక్‌, ఛిను శంఖారీలతో గడిపిన మధురస్మృతులను తలచుకొని మురిసిపోయేవారు. ‘ఆనాటి రోజులు మరువలేనివి. ఆనందంగా విహరించే పావురంలా ఉండేవాణ్ణి. నాతో సన్నిహితంగా మెలిగిన కొందరు ఇంకా గుర్తున్నారు’ అంటూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకునేవారు. ఒకసారి శ్రీరామ్‌మల్లిక్‌ కోల్‌కతా దక్షిణేశ్వరంలో రామకృష్ణులను చూసి ‘గదాధర్‌ బడిలో ఎలా ఉండేవాడో ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు’ అంటూ సంబరపడిపోయాడు. పరమహంస కూడా ఆ మిత్రుడితో బాల్యంలో ఉన్నట్లే ఆత్మీయంగా దగ్గర కూర్చుని మాట్లాడారు. అలా ఆ మహనీయులంతా మిత్రుల ప్రాధాన్యాన్ని మరవని మానవీయ కోణం- పారమార్థికోన్నతికి నిదర్శనమని నిరూపించారు.

బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు