స్వధర్మమే మేలు

ఒక వ్యాపారి ఎడ్లబళ్లమీద నల్లరేగడి మట్టి విక్రయించేందుకు హస్తినకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలోనే కొంత మట్టిని కొనేశారు. మిగిలిన బస్తాలు సమతుల్యత లేక కింద పడతాయని వ్యాపారి ఖాళీ సంచుల్లో ఇసుక నింపి పొలిమేర దాటాడు.

Published : 10 Aug 2023 00:14 IST

క వ్యాపారి ఎడ్లబళ్లమీద నల్లరేగడి మట్టి విక్రయించేందుకు హస్తినకు వెళ్తున్నాడు. మార్గమధ్యంలోనే కొంత మట్టిని కొనేశారు. మిగిలిన బస్తాలు సమతుల్యత లేక కింద పడతాయని వ్యాపారి ఖాళీ సంచుల్లో ఇసుక నింపి పొలిమేర దాటాడు. అక్కడ ఎదురైన ఓ వ్యక్తి అవస్థపడుతున్న ఎడ్లను చూసి విషయం ఏమిటని అడిగాడు. అంతా విని ‘ఇసుక నింపడం కంటే నిండు బస్తాల్లో మట్టి తీసి ఖాళీ సంచుల్లో సర్దితే బాగుండేది. మూగజీవాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు?’ అంటూ సలహా ఇచ్చాడు. తమరెవరని అడిగితే ‘నేను కూడా వ్యాపారినే! చర్మవ్యాధి వల్ల హస్తినలో వాతావరణం అనుకూలించక ఆరోగ్యం పాడయ్యింది. వ్యాపారం సాగక తిరిగి వెళ్తున్నాను’ అని బదులిచ్చాడు. ఆ సమాధానంలో వ్యాపార రహస్యం బోధపడింది మొదటి వ్యాపారికి. అతడి మాటలకు చిరునవ్వుతో తల పంకించి, ముందుకు సాగాడు. హస్తిన చేరి మట్టి అంతా అమ్మేశాడు. ఈలోపు ‘నగర రాజుకు అనారోగ్యం కలిగింది.. కొన్ని రోజులు ఇసుకలో నడిస్తే స్వస్థత చేకూరుతుంది’ అని వైద్యులు చెప్పారు. వ్యాపారి వద్ద ఇసుక ఉందని తెలిసి రాజోద్యోగులు వ్యాపారి చెప్పిన అధిక ధరను లక్ష్యపెట్టక ఇసుక కొనేశారు. స్వధర్మాన్ని అనుసరించిన వ్యాపారికి లబ్ధి కలిగింది. పరిపూర్ణులైన గురువుల ఉపదేశాలైతే పాటించాలి. వేరెవరో చేసే సూచనలు అనుకూలమో కాదో స్వయంగా ఆలోచించి అనుసరించాలి. గీతలో శ్రీకృష్ణుడు పరధర్మం కన్నా స్వధర్మమే మేలు అనడంలో గల అంతరార్థం ఏమిటన్న శిష్యుడి సందేహాన్ని కథ రూపంలో వివరించారు జగద్గురువు ఆదిశంకరులు.  

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని