రుషి రుణం తీర్చుకునే తరుణం

మనం నెరవేర్చాల్సిన నాలుగు ప్రధాన రుణాల గురించి సనాతన ధర్మం ప్రస్తావించింది. అవే మాతృ రుణం, పితృ రుణం, దేవ రుణం, రుషి రుణం. జన్మను ప్రసాదించినందుకు భగవంతుడికి రుణపడి ఉంటే, ఆ జన్మకు కారకులైన తల్లిదండ్రులకు మరో రూపంలో రుణపడి ఉన్నాం.

Updated : 14 Sep 2023 06:43 IST

సెప్టెంబరు 19 రుషి పంచమి

మనం నెరవేర్చాల్సిన నాలుగు ప్రధాన రుణాల గురించి సనాతన ధర్మం ప్రస్తావించింది. అవే మాతృ రుణం, పితృ రుణం, దేవ రుణం, రుషి రుణం. జన్మను ప్రసాదించినందుకు భగవంతుడికి రుణపడి ఉంటే, ఆ జన్మకు కారకులైన తల్లిదండ్రులకు మరో రూపంలో రుణపడి ఉన్నాం. జీవితాలకు అర్థం, పరమార్థం తెలియజేసినందుకు, మనకు మార్గదర్శకులుగా నిలిచి నందుకు మహర్షులకూ రుణపడి ఉన్నాం. వారి విశిష్టతను గుర్తుచేసుకునే పర్వదినమే ‘రుషిపంచమి’. ఆరాధించటం, అర్చించటం ద్వారా అంతర్యామి రుణాన్ని తీర్చుకుంటాం. ఆజన్మాంతం అణకువతో సేవలు చేస్తూ, వారి అవసరాలు తీరుస్తూ అమ్మానాన్నల రుణం తీర్చుకుంటాం. జపతపాలు, యజ్ఞయాగాదులతో, దివ్యమైన దార్శనికతతో మంత్రద్రష్టలై.. ఆవిష్కరించిన పురాణేతిహాసాలను అధ్యయనం చేయటం, వాటి ఔన్నత్యాన్ని రాబోయే తరాలకు తెలియజెప్పటమే రుషిరుణం తీర్చుకోవటం. అంతేకాకుండా ఆ మహానుభావులు నిర్దేశించిన ధర్మమార్గంలో పయనిస్తూ పారమార్థికోన్నతిని సాధించటం కూడా అందులో భాగమే! మనం మిగతా జీవుల కన్నా భిన్నంగా, మహోన్నతంగా జీవించటానికి వ్యక్తిత్వ వ్యాకరణాన్ని నిర్దేశించిన మహాత్ములు రుషులు. పారమార్థిక సత్యాలనూ, విజ్ఞాన రహస్యాలనూ ఆవిష్కరించిన మహాజ్ఞానులు. ఆ సాధుపుంగవులు సర్వసంగపరిత్యాగులైన శాస్త్రవేత్తలు.

సప్తర్షులను స్మరించుకుంటూ..

రుషి పంచమి నాడు వ్రతాన్ని ఆచరించటం అనాదిగా ఉన్న సంప్రదాయం. భాద్రపద శుద్ధ పంచమినాడు అంటే వినాయక చవితి మరుసటి రోజున మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఈ వ్రతాన్ని చేయటం పుణ్యప్రదమని విశ్వసిస్తారు. సప్తరుషులైన కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్టులను ఆరాధిస్తూ వారి ఆశీస్సులను అర్థించటం దీని ఉద్దేశం. అభ్యుదయం వైపు పయనించాల్సిన సమాజానికి, ఆరోగ్యవంతమైన సంతానం అవసరం. అలాంటి సార్థక సంతానాన్ని కాంక్షిస్తూ.. ఎలాంటి గ్రహ, నక్షత్ర దోషాలు అంటకుండా మహిళలు మహర్షులను పూజిస్తారు. అయితే ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటే పొరపాటు. ఇది యావత్‌ కుటుంబ జీవనానికి పునాది వేసే తొలినోము- అని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. గృహస్థులుగా ఉంటూ, కుటుంబ సౌకర్యాలు సమకూర్చి, సాధనలు కొనసాగించారు మహర్షులు. ఏళ్లకు ఏళ్లు తపస్సులు చేసి, సమున్నత జ్ఞానాన్ని ఆర్జించి, సమాజాభివృద్ధికి తోడ్పడ్డారు. ఈ సాధనలకు భార్యాబిడ్డలు సంపూర్ణంగా సహకరించారు. వారూ ఆ మునివరేణ్యుల నిరాడంబర తత్వాన్ని, నిస్వార్థ నడవడికను అనుసరించారు. ఆ సమష్టి కృషిని ఆదర్శంగా తీసుకొని, వారి అడుగు జాడల్లో నడవాలని ‘రుషి పంచమి’ పర్వదినం పరోక్షంగా ప్రబోధిస్తుంది.

ఒక్కో ప్రాంతం ఒక్కో రీతి...

రుషి పంచమి తిథిని వివిధ రాష్ట్రాల్లో వివిధ రీతుల్లో ఆచరించటం ఆనవాయితీ. కేరళలో ఈ పంచమినాడు దేవ శిల్పి అయిన విశ్వకర్మను ఆరాధించటం మన సంప్రదాయం. గుజరాత్‌లో రుషి పంచమిని ‘సామ పంచమి’ పేరిట రైతుల పండుగగా వేడుక చేస్తారు. కర్షకులు ఈ రోజున ప్రకృతి ఆరాధకులై ఉపవాసం ఉంటారు. మహారాష్ట్రలో ఈ రోజున వ్రతం ఆచరించి, ‘రుషి పంచమి భాజీ’ అనే ఆరోగ్యకరమైన శాకాహార వంటకాన్ని వండి, ప్రసాదంగా పంచుతారు. రాజస్థాన్‌లో కొన్ని వర్గాల వారు ‘రుషి పంచమి’ని రక్షాబంధన వేడుకగా కూడా నిర్వహిస్తారు. ఈ పర్వదినం రోజున విఘ్నేశ్వరుడు, నవగ్రహాలతో పాటు వశిష్టుడి ధర్మపత్ని అరుంధతిని పూజిస్తారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని