‘అమ్మ’ ప్రేమ అమృతమయం!

ఉపదేశాలతోనే కాదు తన ఉనికితోనే పారమార్థిక పరిమళాలను ప్రసరింపచేస్తున్న ప్రేమమయి మాతా అమృతానందమయి. ప్రముఖుల నుంచి పామరుల వరకు ‘అమ్మ’ అనుగ్రహానికి పాత్రులైనవారే!

Updated : 28 Sep 2023 06:05 IST

అక్టోబరు 3న కేరళ అమృతపురిలో అమ్మ 70వ జన్మదిన వేడుకలు

‘అమ్మ’గా ప్రసిద్ధమై ప్రపంచ భక్తజనావళికి ప్రేమామృతాన్ని పంచుతున్న ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి. సరళ ఉపదేశాలతో, సామాజిక సేవాకార్యకలాపాలతో దేశవిదేశాల్లో అసంఖ్యాక పారమార్థిక అన్వేషకులకు దీపగోపురంగా నిలుస్తున్న దివ్యమూర్తి ఆమె. భక్తికి సేవ తోడైనప్పుడే సంపూర్ణంగా ఫలిస్తాయని చెప్పడమే కాదు, ఆచరణలో చూపుతున్న ధన్యాత్మురాలు.

పదేశాలతోనే కాదు తన ఉనికితోనే పారమార్థిక పరిమళాలను ప్రసరింపచేస్తున్న ప్రేమమయి మాతా అమృతానందమయి. ప్రముఖుల నుంచి పామరుల వరకు ‘అమ్మ’ అనుగ్రహానికి పాత్రులైనవారే! కేరళలో సుగుణానందన్‌, దయమంతి దంపతులకు 1953 సెప్టెంబరు 27న జన్మించారు. ప్రేమమూర్తిగా, సద్గురువుగా, సంఘసేవికగా, విద్యాదాతగా ప్రఖ్యాతిగాంచారు. ‘అమృత విశ్వవిద్యాలయం’గా పిలుచుకునే ‘అమృత విశ్వవిద్యాపీఠం’ స్థాపకురాలిగా విద్యారంగానికి విశేష సేవలు చేస్తున్నారు.
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు అమృతానందమయి బాల్యంలోనే ఆధ్యాత్మిక శోభ ప్రకాశించింది. అసలు పేరు సుధామణి. తోటి పిల్లల కన్నా భిన్నంగా ప్రవర్తించేవారని, ఆమె ఆత్మీయులు గుర్తుచేసుకుంటారు. ఆరు నెలలకే మాతృభాషలో మాట్లాడేవారట. భాష లౌకిక సంభాషణలకు కాదు, ఆ లోకేశ్వరుణ్ణి స్తుతించేందుకేనని నిరూపిస్తూ.. శ్రీకృష్ణ గేయాలు ఆలపించేవారట. ఆ సంగతులు ‘నాకు పుట్టుకతోనే దేవుడంటే గాఢానురక్తి ఏర్పడింది. నిరంతరం దైవనామాన్ని జపించేదాన్ని. తాను ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మనసులో నిరంతరం పరమాత్ముడి ఆలోచనలే మెదులుతుండేవి’ అంటూ శిష్యులతో పంచుకున్నారు. భక్తితో పాటు ప్రేమ, దయ, అణకువ తొణకిసలాడేవట.
అయిదారేళ్ల వయసులోనే సుధామణి కృష్ణుడి పటాన్ని వెంటపెట్టుకొని, తనే పాటలు రాసి పాడేవారు.. ధ్యానం చేసేవారు. ఆ కృష్ణభక్తికి, ధ్యాననిష్ఠకు ఆశ్చర్యచకితులైన చుట్టుపక్కలవారు ఆమెని ఆరాధించేవారు. పారమార్థిక విషయాల్లోనే కాదు, పాఠశాల విద్యలోనూ తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. సగటు ఆడపిల్లలా ఇంటి పనులన్నీ చేస్తూ తల్లికి చేదోడుగా ఉండేవారు. తన ఆంతరంగిక ఆధ్యాత్మిక అనుభూతుల ప్రభావం నిత్యజీవిత వ్యవహారాల్లో పడకుండా సరళంగా జీవించటం ఆమె ప్రత్యేకత. తాను ఎదుర్కొన్న కష్టాలు, కఠోర పరిస్థితుల ఫలితంగా.. అనిత్యత్వాన్నీ, స్వార్థ పరత్వాన్నీ అర్థం చేసుకున్నారు. మేడిపండులాంటి ప్రాపంచిక బంధాలకు అతీతంగా ఉన్నారు. విలువైన కృష్ణపరమాత్మ ప్రేమామృతం ముందు ఇవన్నీ వెలవెలబోయేవని నిర్ధారించు కున్నారు. ఈ బంధాల నుంచి బయటపడేయమని ఆ వయసులోనే భగవంతుణ్ణి వేడుకునేవారు.

అపర మీరాబాయిలా మారి..

యుక్తవయసులోనే సుధామణికి శ్రీకృష్ణుడి దర్శన భాగ్యం కలిగింది. ఆ మురళీకృష్ణుడు తన పక్కనే నడవటం గమనించే వారు. ‘ప్రకృతిలో ప్రతిదీ కృష్ణుడిగానే భావించసాగాను. ఓ పువ్వు కూడా కోయలేకపోయేదాన్ని. అదీ ఆ మోహనకృష్ణుడే అనిపించేది. పిల్లగాలి నా మేను తాకినప్పుడు కృష్ణుడే లాలిస్తున్నట్లుండేది’ అని పరవశించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే సుధామణి అపర మీరాబాయిలా మారిపోయారు. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై సేవాకార్యక్రమాలు విస్తరింపచేయటానికి ‘ప్రకృతి పరమాత్మకు ప్రతిరూపం’ అన్న ఆ భావనే ప్రాతిపదిక అయ్యుంటుంది. అలా బాల్యంలోనే శుద్ధచైతన్య ఆనందసాగరంలో ఓలలాడుతూ పరిపూర్ణ మనశ్శాంతి పొందినా.. బంధుమిత్రుల నుంచి ప్రతిఘటనలు, పరాభవాలు ఎదురయ్యాయి. పారమార్థిక ప్రయాణంలో ఇలాంటి పరీక్షలు తప్పవనుకున్నారు. జగన్నాథుడే దిక్కని వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. కొద్ది కాలంలోనే ఆమె ఎందరికో ఆరాధ్యులయ్యారు. సుధామణి కాస్తా అమృతానందమయి అమ్మగా పరిణమించారు.

  అందరికీ ‘అమ్మ’గా..

తనను అనుమానించిన, అవమానించిన వారిని కూడా ‘అమ్మ’ అమిత ప్రేమతో ఆదరించేవారు. ఎవరికే కష్టమొచ్చినా ఆమె సన్నిధిలో సాంత్వన పొందేవారు. ‘తన కొమ్మలు నరుకుతున్న వ్యక్తికి కూడా చెట్టు నీడనిచ్చినట్లు.. ఆధ్యాత్మిక అన్వేషులు తనను హింసించేవారి మేలు కోసం కూడా ప్రార్థించాలి. మన ఆయుధాలు ప్రేమ, క్షమలే’ అని ప్రబోధించారు మాతా అమృతానందమయి. 1978 నుంచి ‘అమ్మ’ దర్శనం కోసం.. దేశదేశాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు రావటం ఆరంభమైంది. ఆమె ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలు విస్తృతమయ్యాయి. ఆమె భక్తి, ప్రేమల ముందు ప్రత్యర్థులు కూడా తలవంచక తప్పలేదు. ఆ ఆధ్యాత్మికవేత్త ఆదర్శాలనూ, బోధనలనూ ప్రచారం చేయటానికి 1981 మే 6న కేరళ కొళ్లం జిల్లాలో మాతా అమృతానందమయి మఠం, మిషన్‌లు స్థాపించారు. అమ్మకు ‘మాతా అమృతానందమయి’ పేరు సుస్థిరమైంది. శిష్యబృందమూ విస్తరించింది. ఆశ్రమవాసులకు వేదాంతాన్నీ, సంస్కృత భాషనూ బోధించేందుకు 1982 ఆగష్టు 27న వేదాంత విద్యాలయం వెలసింది. ‘మానవసేవే మాధవసేవ’ అన్న మన సనాతన ధర్మ నినాదాన్ని తమ సేవాకార్యక్రమాల ద్వారా చాటుతున్నారు. విద్య, వైద్యం, పర్యావరణం, వ్యవసాయం, గ్రామీణ, స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమం- తదితర విభాగాల్లో విస్తృత సేవలు అందిస్తున్నారు. ‘అమృత విద్యాలయం’ పేరిట దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు నిర్వహించటం విశేషం. అమృతానందమయి పేరిట, మన సనాతన ధర్మ దార్శనికతతో నెలకొల్పిన విశ్వవిద్యాలయాలు వేలాది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నాయి.

‘అమ్మ’ అపురూప భాషణలు

అమ్మ ఆధ్యాత్మిక ప్రసంగాలే కాదు ఆమె సంక్షిప్త సంభాషణలూ ఎంతో స్ఫూర్తిమంతం. ఓ యువజన సదస్సులో ‘మరణం కాదు, మనలో అంతర్గతంగా ఉన్న సామర్థ్యాలు మరుగున పడి తుప్పుపట్టి నష్టపోవటమే అసలైన విషాదం’ అన్నారు. అలాగే ‘దయాహృదయం కొరవడటం దారిద్య్రం కన్నా హీనం’ అంటారు. సాటివారికి సాయపడినప్పుడే ఆ సర్వేశ్వరుడు ప్రసన్నుడవుతాడని ప్రబోధిస్తూ.. ‘ఈనాడు లోకంలో రెండు విధాలైన దారిద్య్రాల్ని అనుభవిస్తున్నాం. కనీసావసరాలు తీరని దురవస్థ మొదటిది. దయ లేకపోవడం రెండోది. రెండోది పాప సమానం’ అన్నారు.

  అమృతవర్షంగా సప్తతి జన్మదినోత్సవ వేడుకలు

ఈ లోకానికి ఆ మాతృదేవి పరిచయమై 70 వసంతాలు పూర్తయ్యాయి. ఆధ్యాత్మిక గురువు, అపురూప ప్రేమమూర్తి మాతా అమృతానందమయి ఏడు పదుల జన్మదినోత్సవాన్ని భక్తులు, శిష్యులు భక్తిప్రపత్తులతో ఘనంగా నిర్వహించనున్నారు. కేరళలోని అమృత విశ్వవిద్యాపీఠం ప్రాంగణంలో అక్టోబరు 3న ఏర్పాటు చేసిన ఈ ఉత్సవానికి అశేషజనవాహిని హాజరై అమ్మ ఆశీస్సులను అందుకోనుంది.

బి.సైదులు


లోకంలో మూడింటిని ఎక్కువ కాలం కప్పి ఉంచలేరు- అవి.. సూర్యుడు, చంద్రుడు, నిజం

గౌతమ బుద్ధ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు