అల్లాహ్‌ నియమించిన ప్రవక్త!

పుట్టకముందే తండ్రిని కోల్పోయారు. ఏడేళ్ల వయసులో తల్లి కూడా కన్నుమూసింది. తాతయ్య అబ్దుల్‌ ముత్తలిబ్‌ బాలుడి బాధ్యత స్వీకరించారు.

Published : 28 Sep 2023 00:16 IST

నేడు మిలాద్‌-ఉన్‌-నబి

పుట్టకముందే తండ్రిని కోల్పోయారు. ఏడేళ్ల వయసులో తల్లి కూడా కన్నుమూసింది. తాతయ్య అబ్దుల్‌ ముత్తలిబ్‌ బాలుడి బాధ్యత స్వీకరించారు. ఏడాది గడిచిందో లేదో ఆయన మంచాన పడ్డారు. తల్లిదండ్రుల్లేని తన మనవణ్ణి ఎవరు ఆదరిస్తారని అబ్దుల్‌ ఆందోళన చెందుతుండగానే.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మరణించారు.
‘తాతయ్యా! చివరికి నువ్వు కూడా నన్నొదిలి వెళ్లిపోయావా?’ అంటూ దుఃఖిస్తున్న చిన్నారి విలాపం హృదయవిదారకంగా ఉంది. కాబా ధర్మకర్త, ఖురైష్‌ తెగ అగ్రనాయకుడైన అబ్దుల్‌ మరణంతో మక్కాలో విషాధ చాయలు అలముకున్నాయి. ‘అల్లారుముద్దుగా పెంచుతున్న తాతయ్య కూడా లేకపోతే ఇక ఈ పిల్లాడికి దిక్కెవరు?’ అంటూ అంతా జాలిపడుతున్న తరుణంలో.. బాలుడి బాధ్యత తీసుకునేందుకు పెదనాన్న అబూ తాలిబ్‌ ముందుకొచ్చారు. వారివద్ద పెరిగిన మహనీయుడే ముహమ్మద్‌ (స).
రెండు పదులు నిండిన యువ ముహమ్మద్‌ హృదయంలో ఆధ్యాత్మిక భావాలు వెల్లివిరిశాయి. సిరియాలోని ఉకాజ్‌ మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకునేవారు. ఆయన గొప్ప నిజాయితీపరుడుగా (అమీన్‌) పేరు గడించారు. ప్రవక్త నిజాయతీ నచ్చి, ఖదీజా (రజి) అనే శ్రీమంతురాలు తన వ్యాపారంలో భాగస్వామ్యం ఇచ్చారు. ఆ ఏడాది లాభాలు విపరీతంగా వచ్చాయి. వితంతువయిన ఖదీజా (ర) కు నిజాయితీ పరుడైన ముహమ్మద్‌ను వివాహమాడా లనిపించింది. అది విన్న ఆమె సన్నిహితురాలు మంచి నిర్ణయమేనంది. ముహమ్మద్‌ (స) పెదనాన్న, ఇతర బంధువులూ ఆమోదించి పెళ్లి తేదీ నిర్ణయించారు. 40 ఏళ్ల ఖదీజా, పాతికేళ్ల ముహమ్మద్‌లకు నలుగురు ఆడపిల్లలు, ఒక కొడుకు పుట్టారు. కానీ ఆ కొడుకు అతి చిన్న వయసులోనే చనిపోయాడు.


తొలి దైవవాణి..

ముహమ్మద్‌ ప్రవక్త (స) హిరా గుహలో రోజుల తరబడి దైవచింతనలో గడిపేవారు. రంజాన్‌ నెలలో ఒక రాత్రి అల్లాహ్‌ తరఫు నుంచి దైవదూత జిబ్రీల్‌ (అలై) ఖురాన్‌ వినిపించి, కంఠస్తం చేయించారు. ఈ వింతానుభూతితో ముహమ్మద్‌ ఆందోళన చెందారు. ఆ సంగతి ఖదీజాతో పంచుకున్నారు. ఆమె ముహమ్మద్‌ను ఓదార్చి, ధైర్యం చెప్పారు. శుభ ఘడియ వచ్చిందని నచ్చచెప్పారామె. అర్ధాంగి మాటలతో ముహమ్మద్‌లో ధైర్యం వచ్చింది. గతంలో దైవ ప్రవక్తల దగ్గరకు వచ్చిన దైవదూతే ఇప్పుడు వచ్చారని, ముహమ్మద్‌ను అల్లాహ్‌ ప్రవక్తగా నియమించాడన్న శుభవార్త పండితులు తెలియజేశారు.


కొండపై నుంచి పిలుపు

అల్లాహ్‌ సందేశాన్ని ముహమ్మద్‌ కొన్నాళ్లు తన బంధువర్గంలో, తన సన్నిహితులకు అందించారు. తర్వాత కొన్నాళ్లకు అల్లాహ్‌ సందేశాన్ని మక్కా ప్రజలందరికీ చేరవేయాలను కున్నారు. అందుకోసం అక్కడే ఉన్న సఫా కొండపైకి ఎక్కారు. ‘ఖురైషీయులారా!’ అంటూ బిగ్గరగా పిలిచారు. ఆ కేకతో జనం ఉలిక్కిపడ్డారు. ఏదో ఆపద ముంచుకొస్తోందని అంతా సఫాకొండ వద్దకు చేరుకున్నారు. ‘ఈ కొండ వెనుక నుంచి శత్రు సైన్యం మక్కాపై దాడి చేసేందుకు వస్తోందంటే నమ్ముతారా?’ అన్నారు ముహమ్మద్‌. నమ్ముతామంటూ ముక్త కంఠంతో జవాబిచ్చారు ప్రజలు. ‘సోదరులారా! మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ కొండకు ఆవల ఉన్నది, రాబోయే విపత్తు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆపద ముంచుకొస్తోంది. ఆ నరకాగ్ని నుంచి తప్పించుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నన్ను అల్లాహ్‌ ప్రవక్తగా విశ్వసించండి’ అని హితోపదేశం చేశారు. ఈ మాటలతో ఇస్లామ్‌ సందేశానికి ముహమ్మద్‌ ప్రవక్త శ్రీకారం చుట్టారు. ఆయన సందేశాలు ఎందరెందరినో ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి,  స్ఫూర్తినిస్తూ ఉన్నాయి.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని