వినదగు నెవ్వరు చెప్పిన..

రాముడు పితృవాక్య పరిపాలకుడు. తండ్రి మాటకు విలువిచ్చి అడవులకు వెళ్లాడు. ఆదర్శప్రాయుడిగా నిలిచిపోయాడు. రాముడి నిర్ణయం అతన్ని బాధించిందే కానీ.. ఇతరులకు ప్రమాదకారి కాలేదు. పరశురాముడూ పితృవాక్యపరిపాలకుడే.

Published : 26 Oct 2023 00:04 IST

రాముడు పితృవాక్య పరిపాలకుడు. తండ్రి మాటకు విలువిచ్చి అడవులకు వెళ్లాడు. ఆదర్శప్రాయుడిగా నిలిచిపోయాడు. రాముడి నిర్ణయం అతన్ని బాధించిందే కానీ.. ఇతరులకు ప్రమాదకారి కాలేదు. పరశురాముడూ పితృవాక్యపరిపాలకుడే. తండ్రి జమదగ్ని మాటకు కట్టుబడి తల్లి రేణుకాదేవిని, తన సోదరులను గండ్రగొడ్డలితో నరికాడు. తండ్రిమాట పాటించినందుకు ఆయన ప్రసన్నుడై వాళ్లను తిరిగి బతికిస్తాడనే విశ్వాసంతోనే పరశురాముడు ఆ పనికి పూనుకున్నాడు. అతడు ఊహించినట్టు తల్లి, సోదరులను తండ్రి జమదగ్ని బతికించకపోతే ఫలితం ఘోరంగా ఉండేది. కనుక పురాణాల్లో ఉన్నవన్నీ అనుసరణీయం ఏమీ కాదు. అది పరశురాముడికి, జమదగ్నికే చెల్లింది. మనమలా కాదు, ఏది విన్నా.. ఆచితూచి నిర్వర్తించాలి.

తనకు హరితో  ఘోర వైరం ఉన్నందున ఆ పేరునెవరూ తలచకూడదని హిరణ్యకశిపుడి శాసనం. కానీ ఐదేళ్ల ప్రహ్లాదుడు రాజాజ్ఞను నిర్భయంగా వ్యతిరేకించాడు. హరి ఉన్నాడని ప్రగాఢంగా విశ్వసించాడు. హరి లేడని తండ్రి ఎంత వాదించినా.. వినలేదు. హరినావెూచ్చరణ తగదని గురువులూ ఆదేశించారు. గురు ఆజ్ఞను పాటించడం శిష్యుడి కర్తవ్యం అన్నది శాస్త్రవచనం. అయినా ప్రహ్లాదుడు వినలేదు. అంతటా తానే అయిన హరిని తపోబలంతో, యోగ దీక్షతో దర్శించామన్న మహానుభావుల మీదే గురి కుదిరింది. హిరణ్యకశిపుడు ఎంత బలంగా చెప్పాడో ప్రహ్లాదుడు అంతగా వ్యతిరేకించాడు. తండ్రిది అధికార బలం. పుత్రుడిది విశ్వాసబలం. అందుకే వారెంతగా హింసించినా భరించాడు.

అవతలివారు ఎంతటి వారైనా.. చెప్పిన అంశం నిజం కాదు, అది అక్రమం అని నమ్మితే.. ఆ మాటలు పాటించనవసరం లేదని ప్రహ్లాదుని ఇతివృత్తం బోధిస్తుంది. హిరణ్యకశిపుణ్ణి అధర్మ మూర్తిగా, ప్రహ్లాదుని భాగవతోత్తముడిగా కీర్తిస్తున్నాం. అందుకే ఎవరేం చెప్పినా వినాలి. విన్నంతలో తొందరపడక ఆలోచించి నిజానిజాలు తెలుసుకోవాలి- అన్నాడు బద్దెన.

నూతి శివానందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని