నిశ్చల వటవృక్షంలా..

‘ద్వేషంతో ద్వేషాన్ని ఎన్నటికీ రూపుమాపలేం, అది ప్రేమతోనే సాధ్యం’ అన్నాడు గౌతమ బుద్ధుడు. ఈ ధర్మపథం అమరం, అమూల్యం, విశ్వజనీనం.

Published : 02 Nov 2023 00:42 IST

న హి వేరేన వేరాని, సమ్మంతీధ కదాచనమ్‌
అవేరేన చ సమ్మంతి ఎస ధమ్మో సనాతనో

ద్వేషంతో ద్వేషాన్ని ఎన్నటికీ రూపుమాపలేం, అది ప్రేమతోనే సాధ్యం’ అన్నాడు గౌతమ బుద్ధుడు. ఈ ధర్మపథం అమరం, అమూల్యం, విశ్వజనీనం. సత్యంతో, ధమ్మంతో ప్రశాంతత సిద్ధిస్తుందన్నది బుద్ధ ప్రబోధ. అసత్యం, అవినీతి, హింసా ద్వేషాలు చెలరేగిపోతున్న నేటి పరిస్థితుల్లో ఆ శాక్యముని మాటలు అమృత సదృశాలు. సూక్ష్మ విత్తనం వృక్షమై.. పూలూ, పండ్లను ఇవ్వడం ప్రకృతి ధర్మం. బుద్ధుడు ప్రవచించిన ధమ్మం అలాంటిదే. భక్తి మార్గాలకు సంబంధించి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవ్వొచ్చు. కానీ ధర్మం మాత్రం కులమతాలకు అతీతం. అందరికీ వర్తించే సమున్నత సూత్రం. ‘మీరొక పువ్వును ఇష్టపడితే దాన్ని తెంచుకుంటారు. కానీ.. ఆ పువ్వునే ప్రేమిస్తే.. దానికి నీళ్లు పోసి పోషిస్తారు’ అంటూ వాంఛకు, ప్రేమకు మధ్యనున్న భేదాన్ని చెప్పాడు. లోకం పట్ల అవధులు లేని ప్రేమను చూపమన్నాడు. మృతప్రాయమైన గతంలోనో, ఇంకా అస్తిత్వంలోకి రాని భవిష్యత్తులోనో జీవించక ప్రస్తుతాన్ని ఆలింగనం చేసుకోమన్నాడు. లాభనష్టాలు, మోద ఖేదాలు, పొగడ్తలు, తెగడ్తలు- గాలిలా వచ్చి పోతుంటాయి. నిజమైన ఆనందం అనుభవించాలి అంటే.. ఆ గాలిలో నిశ్చలంగా నిలబడే వటవృక్షంలా ఉండాలన్నాడు తథాగతుడు.

ఎన్‌.ఎమ్‌.ముకరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని