రెట్టింపు ఫలం

ధర్మరాజు ధార్మిక నడవడి కారణంగా.. బొందితో స్వర్గానికి బయల్దేరాడు. నరకలోకం మీదుగా వెళ్తుండగా.. చల్లని గాలులు వీచి.. అక్కడి పాపుల దేహ తాపాన్ని తగ్గించాయి.

Published : 09 Nov 2023 00:41 IST

ర్మరాజు ధార్మిక నడవడి కారణంగా.. బొందితో స్వర్గానికి బయల్దేరాడు. నరకలోకం మీదుగా వెళ్తుండగా.. చల్లని గాలులు వీచి.. అక్కడి పాపుల దేహ తాపాన్ని తగ్గించాయి. అది ధర్మజుని పుణ్యఫలమని తెలుసుకొని.. మరికాసేపు అక్కడ ఉండమని ప్రార్థించారు. దయామయుడైన ధర్మజుడు అందుకు సమ్మతించేలోగానే స్వర్గం నుంచి దేవదూతలు వచ్చి ‘తమరు నరకంలో క్షణ కాలం ఉన్నారు కనుక ఆపద సమయంలో ‘అశ్వత్థామ హతః కుంజరః’ అనడం, ద్రౌపదిని ఆమె అనుమతి లేకుండా జూదంలో పణంగా ఒడ్డిన పాపం, పుణ్యాత్ములను సదా కాపాడే శ్రీకృష్ణుడి దయాగుణాన్ని శంకించిన పాపం- అన్నీ నశించాయి. కనుక తమరు ఇక మా వెంట స్వర్గానికి రావాలి’ అన్నారు. అది విన్న ధర్మజుడు ‘నా పుణ్యఫలాన్ని ఈ నరకలోక పాపుల దేహ ఉపశమనం కోసం ధారపోయదలచాను. కనుక నాకు స్వర్గార్హత లేదు, మీరు వెళ్లిపోవచ్చు’ అన్నాడు. దానికి వారు ‘ధర్మరాజా! తమరు సంకల్పమాత్రంతో మీ పుణ్యాన్ని వీరికి ధారపోద్దామనుకున్నారు. ఈ త్యాగగుణం వల్ల పుణ్యం రెట్టింపు అయ్యింది. ఇక మీకు స్వర్గార్హత మాత్రమే ఉంది, నరకం కాదు’ అని ధర్మజుని తీసుకొని వెళ్లారు. వేదవ్యాసుడు చెప్పిన ఈ కథలో సూక్ష్మ నీతి దాగి ఉంది. కష్టతరమైనప్పటికీ మనల్ని రెచ్చగొట్టే ఇంద్రియ సుఖాలను త్యాగం చేయగలిగితే పుణ్యఫలమూ, ఆత్మానందమూ లభిస్తాయి. త్యాగ ఫలితం ఎన్నటికీ నశించకపోగా ద్విగుణీకృతమౌతుంది.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని