స్థైర్యం.. సాధకుల లక్షణం!

ఒక రైతు వ్యవసాయంతో జీవనం గడుపుతూనే.. ఆధ్యాత్మిక చింతనతో తరించేవాడు. స్థితప్రజ్ఞతకు మారుపేరు అతడు. ఓ రోజు అతను పొలం దున్నుతుండగా, తన ఆరేళ్ల పుత్రుణ్ణి పాము కరిచిందన్న వార్త తెలిసింది. వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అయినప్పటికీ కొడుకు దక్కలేదు.

Published : 16 Nov 2023 00:16 IST

పరమహంస కథలు

క రైతు వ్యవసాయంతో జీవనం గడుపుతూనే.. ఆధ్యాత్మిక చింతనతో తరించేవాడు. స్థితప్రజ్ఞతకు మారుపేరు అతడు. ఓ రోజు అతను పొలం దున్నుతుండగా, తన ఆరేళ్ల పుత్రుణ్ణి పాము కరిచిందన్న వార్త తెలిసింది. వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అయినప్పటికీ కొడుకు దక్కలేదు. అతడి భార్య దుఃఖానికి అంతు లేకుండా పోయింది. రైతు మాత్రం గుండె దిటవు చేసుకొని గంభీరంగా అలా కూర్చున్నాడు. బంధువులు ఖనన కార్యక్రమాల్లో మునిగారు. భర్త వైఖరి గమనించిన భార్య ఆక్రోశిస్తూ ‘నీది ఎంత రాతిగుండె! కన్నబిడ్డ చనిపోయాడన్న బాధ కాస్తయినా నీలో లేదు. కనీసం నీ కళ్ల నుంచి కన్నీరైనా రాలేదు’ అని విలపించసాగింది. అప్పుడు ఆ రైతు ‘నాకు నిన్న రాత్రి ఓ కల వచ్చింది. ఆ కలలో నేనొక రాజును. నాకు ఏడుగురు కుమారులు. శత్రురాజు యుద్ధానికి కాలు దువ్వగా.. వారందరూ చనిపోయారు. వెంటనే నాకు మెలకువ వచ్చింది. ఆ ఏడుగురు కొడుకుల కోసం విలపించాలా? ఇప్పుడు ఈ ఒక్క కొడుకు కోసం ఏడ్వాలా?’ అనడిగాడు. ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంస భక్తులకు ఈ కథ చెప్పి.. ‘సుఖదుఃఖాలను సాక్షీభావంతో వీక్షించాలి. స్థితప్రజ్ఞతతో ఉండటం అంటే ఏమీ పట్టనట్లుగా బాధ్యతారహితంగా వ్యవహించటం కాదు. ఆ రైతు.. కొడుకు విషయంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. రక్షించుకోవటానికి అన్ని ప్రయత్నాలూ చేశాడు. కానీ ఫలితం ఎలాంటిదైనా స్వీకరించాలనే స్థైర్యం అతడిది. అందుకే ఆ విషాదం అతణ్ణి ప్రభావితం చేయలేదు. అదే ఆధ్యాత్మిక సాధకుల లక్షణం’ అంటూ హితవు పలికారు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని