క్షమ.. మహా ఆయుధం

క్షమతో శాంతి నెలకొంటుంది. క్షమతో చిరునవ్వు వెలుస్తుంది. క్షమాగుణం ఎన్ని ప్రయోజనాలు కలిగిస్తుందో.. దానికి విరుద్ధంగా ప్రతీకారం కనుక రగిలితే.. అన్ని అనర్థాలు తెచ్చిపెడుతుంది. క్షమకు బదులు కక్ష ఏర్పడితే.. పర్యవసానం విషాదమేనని రామాయణ, భారత, భాగవత కథలు నిరూపించాయి.

Published : 30 Nov 2023 00:49 IST

క్షమతో శాంతి నెలకొంటుంది. క్షమతో చిరునవ్వు వెలుస్తుంది. క్షమాగుణం ఎన్ని ప్రయోజనాలు కలిగిస్తుందో.. దానికి విరుద్ధంగా ప్రతీకారం కనుక రగిలితే.. అన్ని అనర్థాలు తెచ్చిపెడుతుంది. క్షమకు బదులు కక్ష ఏర్పడితే.. పర్యవసానం విషాదమేనని రామాయణ, భారత, భాగవత కథలు నిరూపించాయి.

పరాధం లేదా అన్యాయం చేసిన వ్యక్తిని దయతోనో, కృతజ్ఞతతోనో, ధర్మాచరణతోనో, సత్యభాషణతోనో, ఆత్మీయతతోనో, సహజగుణంతోనో.. మొత్తానికి క్షమించాలి. అదే ఔన్నత్యం. ఎదుటివారు అనుచితంగా ప్రవర్తించినప్పటికీ, వారిని దండించగలిగిన సామర్థ్యం ఉండి కూడా- దండించకపోవడం అసలైన క్షమాగుణం. మన్నించటం అనేది చేతగానితనమో, అసమర్థతో కాదు. అది బలవంతుల లక్షణం. తన అర్ధాంగిని మారువేషంలో అపహరించి, తనకు సాయం చేయబోయిన వానరసేనను సంహరించి, ప్రాణసమానుడైన లక్ష్మణుడిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు రావణాసురుడు. అంతటి దుష్టుడు యుద్ధంలో అలసి, ఆయుధం విరిగి, రథం ఒరిగి నేల కూలితే.. చంపే అవకాశం ఉండి కూడా చంపకుండా..

గచ్ఛ అనుజానామి రాత్రించర రాజా లంకాం
ప్రవిశ్య ఆస్వాస్య నిర్యాహి రథీచ ధన్వీ

అన్నాడు శ్రీరామచంద్రుడు. ‘రాక్షసరాజా పో! లంకకు వెళ్లి విశ్రాంతి తీసుకుని కొత్త ఆయుధాలు, కొత్త రథం, కొత్త ఉత్సాహంతో మళ్లీ రా పో!’ అన్న వీరుడు రాముడు. అంతటి ఉదాత్తత గల రామచంద్రమూర్తిది అబ్బురపరిచే క్షమాగుణం. రాముడి వీరత్వ, క్షమత్వాల గురించి చెబుతూ వాల్మీకి మహర్షి- ‘తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః’ అన్నాడు. శ్రీరాముడు తేజస్సులో సూర్యభగ వానుడితో, సహనంలో భూదేవితో సమానమైనవాడని భావం.

కృతజ్ఞత చూపిన ధర్మరాజు

అశోకవనంలో తనను పది నెలలు పీడించి, రాచిరంపాన పెట్టారు రాక్షస వనితలు. రావణ వధానంతరం వారిని శిక్షించే అవకాశమున్నప్పటికీ.. మన్నించిన సహజ క్షమాగుణం ధరిత్రీ పుత్రిక సీతమ్మది. వాల్మీకి మహర్షి ఒక సందర్భంలో సీతమ్మను గురించి చెబుతూ ధరణితో పోల్చాడు.

ఇచ్చిన మాటను అనుసరించి మేనత్త కొడుకైన శిశుపాలుణ్ణి- వంద తప్పుల వరకూ క్షమించిన సత్యభాషణ క్షమాగుణం శ్రీకృష్ణుడిది. మాయాజూదంలో ధర్మవర్తనులైన పాండవుల సర్వస్వాన్నీ అన్యాయంగా అపహరించి అరణ్యాలకు పంపారు కౌరవులు. అక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వక మట్టుపెట్టాలని చూశారు. అలాంటి దుర్యోధనాదులు గంధర్వుల చేతిలో ఓడి, ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. వారిని రక్షించడమే కాక తనవాళ్లన్న ఆత్మీయతతో క్షమించినవాడు ధర్మరాజు. దక్షిణ గోగ్రహణంలో (విరాట రాజు పాలించే మత్స్య రాజ్యం ఉత్తర, దక్షిణ దిక్కుల్లో గోవులు విస్తారంగా ఉన్నాయి. ఆ దిక్కులో ఉన్న గోవులను గ్రహించడం అనే మిష మీద అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను బయటకు రప్పించేందుకు దుర్యోధనుడు పన్నిన పన్నాగం. అప్పుడు విరాటుడికి భీమ, ధర్మరాజులు సహకరించారు) విరాట మహారాజుకు ప్రాణభిక్ష పెట్టాడు ధర్మజుడు. అయినప్పటికీ ఉత్తర గోగ్రహణానంతరం తనను పాచికతో కొట్టిన విరాటుడికి అజ్ఞాతవాసంలో తమకు ఆశ్రయం ఇచ్చాడన్న కృతజ్ఞతతో మన్నించిన క్షమాగుణం ధర్మజునిది.

సోదరి వరసైన ద్రౌపది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు సైంధవుడు. చెల్లెలు దుస్సల సౌభాగ్యాన్ని కోల్పోకూడదన్న ధర్మరాజు మాటను గౌరవించి నీచుడైన సైంధవుణ్ణి వదిలేసిన ఆత్మీయ క్షమాగుణం భీముడిది. ఉత్తర గోగ్రహణ సమయంలో దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు తన అస్త్రానికి సమ్మోహితులై స్పృహతప్పి ఉన్న సమయంలో వారి తలలు కోయకుండా దయతో వదిలేసిన క్షమాగుణం అర్జునుడిది.

కుంతీదేవి ఉదాత్తత

అంధత్వం కారణంగా అర్హత లేకపోయినా అన్నగారన్న ఆత్మీయతతో సింహాసనాన్ని అందించాడు పాండురాజు. అందుకు కృతజ్ఞత లేకపోగా, సోదరుడి బిడ్డలపై హత్యాయత్నాలు చేస్తున్న తన పుత్రుల్ని వారించకుండా.. అడవుల పాలుచేసి అష్టకష్టాలు పెట్టాడు ధృతరాష్ట్రుడు. అలాంటి అవినీతిపరుణ్ణి సైతం క్షమించింది. అంత్యకాలంలో ఆశ్రమవాసంలో ఆ దంపతులకు చేయూతనందించేందుకు తనకు తానుగా సేవకురాలిగా మారిన కుంతీదేవి క్షమాగుణం క్షమకే పరాకాష్ఠ. ధృతరాష్ట్ర, విదురుల సంభాషణలో- ‘క్షమ అనేది చాలా పెద్ద భూషణం. దాన్ని ధరించినవారు గొప్ప సౌందర్యవంతులు’ అంటుంది భారతం. అందుకు నిదర్శనంగా ధృతరాష్ట్రుడి వంటి నీచుడు కూడా యుద్ధానంతరం ధర్మజుడు, కుంతీదేవి చేసిన సేవలు, వారు చూపిన క్షమాగుణాలకు చలించి మానసిక పరివర్తన పొందాడు.

భాగవతం క్షమాగుణంతోనే ఆరంభమవుతుంది. ఆదమరిచి నిద్రిస్తున్న అమాయకులైన ఉపపాండవుల్ని (ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవుల పుత్రులు) పాశవికంగా సంహరించిన వాడు అశ్వత్థామ. అలాంటి వాణ్ణి సంహరించే అవకాశం వచ్చినా- బిడ్డల్ని కోల్పోయి తాను పడుతున్న క్షోభ మరో తల్లికి కలగకూడదని పుత్ర హంతకుడైన అశ్వత్థామను సైతం మన్నించగల క్షమాగుణం ద్రౌపదిది.

శాంతి పొందాలంటే...

దాహార్తుడై విచక్షణ కోల్పోయిన పరీక్షిత్తు, తపోనిష్ఠలో ఉన్న తన మెడలో చచ్చిన పామును వేస్తే మన్నించగల క్షమాగుణం శమీకునిది. కానీ ఆ క్షమ లేని కారణంగానే తండ్రికి జరిగిన అవమానానికి సంయమనం కోల్పోయి, పరీక్షిత్తు మరణానికి కారణమయ్యాడు శమీకముని పుత్రుడు శృంగి. పురాణేతిహాసాలన్నీ క్షమాగుణ ఔన్నత్యాన్ని చాటిచెబుతున్నాయి. తనకు సిలువ వేసి చిత్రహింసలు పెడుతున్న వారిని చూసి ‘తండ్రీ! వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు.. దయచేసి క్షమించు’ అని ప్రార్థించాడు ఏసుప్రభువు. తాను కారాగారంలో ఉండగా దారుణంగా ప్రవర్తించిన అధికారి, తాను దేశాధ్యక్షుడయ్యాక ఎదురుపడితే ఆదరించాడు నెల్సన్‌ మండేలా. ఈ ఉదంతాలు క్షమాగుణానికి మచ్చుతునకలు.

క్షమ అనేది మనకు మనం ఇచ్చుకునే గొప్ప బహుమానం. అది తాత్కాలికంగా కొంత అసంతృప్తి, అలజడి కలిగించవచ్చు. కానీ దీర్ఘకాలం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. క్షమాగుణం సహజ సంస్కారంగా మారినప్పుడు- అది ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. దోషులు క్షమాపణకు అర్హులైనా, కాకపోయినా.. మనం శాంతి పొందాలంటే క్షమించటం నేర్చుకోవాలి. ప్రతీకారంతో ఎదుటివ్యక్తిని ఓడించగలం. కానీ క్షమతో ఎదుటి వ్యక్తిని గెలవ వచ్చు. అంత గొప్ప ఆయుధం క్షమ.

డా.కె.కరుణశ్రీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని