శునకానికి ఆలయం

ఉత్తరప్రదేశ్‌లోని సికందరాబాద్‌ పట్టణంలో ఒక  ప్రత్యేక ఆలయం ఉంది. అందులో రాముడిదో కృష్ణుడిదో కాదు.. ప్రధాన విగ్రహం శునకానిది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు.

Published : 07 Dec 2023 00:04 IST

త్తరప్రదేశ్‌లోని సికందరాబాద్‌ పట్టణంలో ఒక  ప్రత్యేక ఆలయం ఉంది. అందులో రాముడిదో కృష్ణుడిదో కాదు.. ప్రధాన విగ్రహం శునకానిది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. దేవీ నవరాత్రులు, దీపావళి, హోలీ.. ఇలా పండుగల సందర్భాల్లో శునకాల గౌరవార్థం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ఎలా ఉద్భవించిందని అడిగితే.. ఎన్నో తరాలుగా తాము వింటున్న కథను స్థానికులు చెబుతారు- పూర్వం ఊళ్లో పూజ్యనీయుడైన బాబా లాతూరియా- ఒక కుక్కను పెంచేవాడు. దాంతో అతడిది విడదీయలేని అనుబంధం. కొన్నాళ్లకు ఆయన చనిపోయాడు. బాబా మరణాన్ని ఆ కుక్క తట్టుకోలేక.. ఆయన సమాధి మీదికి దూకింది. జనం తోసినా, మళ్లీ సమాధి మీదే చేరుతూ.. కొద్దిసేపటికే అది ప్రాణాలు వదిలింది. వాళ్ల అనుబంధానికి గుర్తుగా.. గ్రామస్థులు బాబా సమాధి పక్కన దానికి కూడా సమాధి కట్టించారు. ఇందరు భక్తులు ఇక్కడ ప్రార్థిస్తున్నారంటే.. అది కేవలం స్మరణ కాదు. విపత్తుల నుంచి రక్షించే శక్తి కుక్కలకు ఉంటుందని, ఈ ఆలయం ప్రతికూల శక్తుల నుంచి తమను రక్షిస్తుందని, ఇక్కడికి వచ్చి నల్లతాడు కట్టించుకుంటే కోర్కెలు నెరవేరతాయని బలంగా నమ్ముతారు. ‘ఇది కేవలం మందిరం కాదు, విధేయతకు, ఆత్మీయతకు చిహ్నం. ఆశలు కల్పిస్తూ, ఆత్మబంధువుతో గడుపుతున్న  భావన కలిగించే సౌఖ్యమైన ప్రదేశం’ అంటారు చుట్టుపక్కల వారు.

శునకాలయం ఇదొక్కటే కాదండోయ్‌.. గాజియాబాద్‌ దగ్గర్లోని చిపియానా గ్రామంలో భైరవ గుడి, కర్నాటక రాష్ట్రం రామనగర జిల్లా చన్నపట్నలో ఒకటి, ఝాన్సీకి దగ్గర్లోని మవురానీపూర్‌లో డాగ్‌ క్వీన్‌ టెంపుల్‌, చత్తీస్‌గఢ్‌ దగ్గర్లోని ఖాప్రిలో కుకుర్‌దేవ్‌ ఆలయం.. ఇలా దేశ వ్యాప్తంగా ఐదు శునకాలయాలు ఉన్నాయి. ప్రేమ, స్నేహం, కృతజ్ఞతలకు చిహ్నమైన కుక్కకు గుడి కట్టడం బాగుంది కదూ!

ఎన్నార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని