మా నాన్న కూడా ఉంటే..

మహాప్రవక్త (స) కాలంలో ఒక వ్యక్తి వచ్చి ‘గత మూడు రోజులుగా నా పుత్రుడి ఆచూకీ తెలియకుండా పోయింది. నా భార్య బెంగతో అన్నపానీయాలు మానేసింది.

Published : 07 Dec 2023 00:10 IST

హాప్రవక్త (స) కాలంలో ఒక వ్యక్తి వచ్చి ‘గత మూడు రోజులుగా నా పుత్రుడి ఆచూకీ తెలియకుండా పోయింది. నా భార్య బెంగతో అన్నపానీయాలు మానేసింది. మా అబ్బాయి క్షేమంగా ఇంటికి చేరాలని అల్లాహ్‌ను ప్రార్థించండి’ అని ప్రవక్తకు మొరపెట్టుకున్నాడు. ప్రవక్త మనసు కరిగి.. చేతులెత్తి అల్లాహ్‌ను వేడుకోసాగారు. అంతలోనే ఓ వ్యక్తి పరుగున వచ్చి.. ‘తప్పిపోయిన మీ అబ్బాయి తోటలో పిల్లలతో ఆడుకుంటున్నాడు’ అని చెప్పాడు.

ఆ మాట విన్న తండ్రి సంతోషంగా తోట వద్దకు పరుగుతీయబోతే.. ప్రవక్త (స) అతన్ని ఆపి.. ‘తొందరలో ఉన్నావు కదూ! కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ తోటలో పిల్లాణ్ణి గుర్తించాక.. పేరుతో మాత్రమే పిలువు. ‘నాన్నా, కుమారా!’ అంటూ ప్రేమకొద్దీ ముద్దుపేర్లతో మాత్రం పిలవకు. అలా పిలిచావంటే అక్కడున్న చిన్నారుల్లో తాము అనాథలమన్న భావన కలిగి, వారి మనసు నొచ్చుకుంటుంది. చనిపోయిన అమ్మానాన్నలు గుర్తుకొస్తారు. ‘మా నాన్న ఉంటే మమ్మల్ని కూడా ఇలానే పిలిచేవాడు’ అనుకుంటారు. అలా ఆ పసి మనసులు గాయపడతాయి. అందుకే మీ అబ్బాయిని పేరుతో పిలిచి.. ఇంటికి తీసుకెళ్లు’ అని సలహా ఇచ్చారు. అంటే తల్లిదండ్రుల్లేని చిన్నారులు దుఃఖించకుండా చూసుకోవాలన్నది ప్రవక్త ప్రబోధ.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని