పాతరోజులను మర్చిపోకూడదు!

ముహమ్మద్‌ ప్రవక్త ప్రాణమిత్రుల్లో ఖలీఫా ఉమర్‌ (రజి) రెండోవారు. ఆయన విశాలమైన అరబ్బు సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అరబ్బీలో చక్రవర్తిని ఖలీఫాగా పిలుస్తారు. ఆయన ఒకరోజు మస్జిదులో ఉపన్యసిస్తున్నారు

Updated : 14 Dec 2023 03:59 IST

ఇస్లాం సందేశం

ముహమ్మద్‌ ప్రవక్త ప్రాణమిత్రుల్లో ఖలీఫా ఉమర్‌ (రజి) రెండోవారు. ఆయన విశాలమైన అరబ్బు సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అరబ్బీలో చక్రవర్తిని ఖలీఫాగా పిలుస్తారు. ఆయన ఒకరోజు మస్జిదులో ఉపన్యసిస్తున్నారు. మధ్యలో తాను చెబుతున్న అంశానికి సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించారు. ‘సోదరులారా! ఒకప్పుడు నేను ప్రజలకు నీళ్లు సరఫరా చేసేవాణ్ణి. దానికి ప్రతిఫలంగా వారు నాకు కొన్ని ఖర్జూర పండ్లు కూలిగా ఇచ్చేవారు’ అన్నారు. అంతలో ఓ వ్యక్తి లేచి ‘ఖలీఫా! మీరిప్పుడు ఆ విషయాన్ని చెప్ప వలసిన అవసరం ఏముంది?’ అనడిగాడు. దానికి ఖలీఫా ఉమర్‌ (రజి) ‘నా హృదయంలో ఒక విధమైన గర్వం తొంగిచూసింది. దానికి విరుగుడుగా నేనలా చెప్పవలసి వచ్చింది’ అంటూ చెప్పారు. గర్వం, అహంకారం ప్రదర్శించేవారు ఎన్నటికీ అల్లాహ్‌ మెప్పు పొందలేరు. ‘రవ్వంత గర్వమున్నా స్వర్గ సువాసనలు ఆఘ్రాణించలేరు’- అన్నది ముహమ్మద్‌ ప్రవక్త బోధన. ‘నువ్వెప్పుడూ ఎందుకంత చల్లగా ఉంటావు?’ అని మంచును అడిగితే.. ‘నా గతమూ నీళ్లే, నా భవిష్యత్తూ నీళ్లే.. ఇక తాపమెందుకు?’ అని బదులిచ్చిందట మంచు. అలాగే.. ‘మనిషి పుట్టింది మట్టిలోంచే. చివరికి కలిసిపోవాల్సిందీ మట్టిలోనే. మరి గర్వం దేనికీ?’ అని ఉలమాలు ఉద్బోధిస్తుంటారు.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని