శాంతిః శాంతిః శాంతిః

యజుర్వేదంలోని బృహదారణ్యక, ఈశావాస్య, తైత్తిరీయ తదితర ఉపనిషత్తుల లోని శాంతి మంత్రాలను పఠించి, చివరలో ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని శాంతి పదాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తాం. అందులో- మొదటి ‘శాంతి’ పదం మనం మనచుట్టూ ఉన్నవారు, పరిసరాలు బాగుండాలని కోరడం.

Published : 04 Jan 2024 00:13 IST

జుర్వేదంలోని బృహదారణ్యక, ఈశావాస్య, తైత్తిరీయ తదితర ఉపనిషత్తుల లోని శాంతి మంత్రాలను పఠించి, చివరలో ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని శాంతి పదాన్ని మూడుసార్లు ఉచ్చరిస్తాం. అందులో- మొదటి ‘శాంతి’ పదం మనం మనచుట్టూ ఉన్నవారు, పరిసరాలు బాగుండాలని కోరడం. అంటే శారీరక, మానసిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందేందుకు దేవుడి అనుగ్రహం, ఆశీస్సులు ఉండాలని ప్రార్థించడం. దీన్నే ‘ఆధిదైవిక’ అంటారు. రెండో ‘శాంతి’ పదం పశుపక్ష్యాదులు, ఇతర జీవరాశుల నుంచి ఏ విధమైన ఆపదలు, ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండాలనే ప్రార్థన. దీన్ని ‘ఆధిభౌతికం’ అంటారు. మూడో ‘శాంతి’ పదం ప్రకృతి పరంగా సంభవించే భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, తుపానులు మొదలైన ఉపద్రవాల వల్ల మనకు ఎలాంటి ఆపదలూ కలగకుండా ఉండాలనే ప్రార్థన. దీన్ని ‘ఆధ్యాత్మికం’ అంటారు. ఈ మూడు రకాలైన ఆపదల నుంచీ రక్షించమని వేడుకుంటాం అన్నమాట. మన ఆలోచనలు, మనం పలికే పదాలు, విశ్వంలోకి వెళ్తాయని వేదాలు చెబుతున్నాయి. ఈ విధంగా నిత్యం లక్షలాదిమంది శాంతి మంత్రం చదివితే.. విశ్వశాంతి తప్పక చేకూరుతుంది.

డా.టేకుమళ్ల వెంకటప్పయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని