ఊర్మిళ నిరసనతో నిద్రపోయిందా?

భర్త లక్ష్మణుడు సీతారాములతో కలిసి అడవులకు వెళ్లినప్పుడు ఊర్మిళ నిరసనతో నిద్రపోయిందనేది కొందరి అపోహ. నిజానికి ఆ సాధ్వి స్థితప్రజ్ఞ, యోగిని. కార్యకారణ సంబంధాలు తెలిసిన జ్ఞానసంపన్న.

Published : 01 Feb 2024 00:13 IST

ర్త లక్ష్మణుడు సీతారాములతో కలిసి అడవులకు వెళ్లినప్పుడు ఊర్మిళ నిరసనతో నిద్రపోయిందనేది కొందరి అపోహ. నిజానికి ఆ సాధ్వి స్థితప్రజ్ఞ, యోగిని. కార్యకారణ సంబంధాలు తెలిసిన జ్ఞానసంపన్న. ఏ పరిస్థితినైనా ఆనందంగా స్వీకరించి, ప్రశాంతంగా జీవించగలిగే ఆధ్యాత్మిక శక్తి స్వరూపిణి ఆ మానని. పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు, పరమపావని సీతాదేవి గుణ విశేషాలకు పరివార జనులంతా ప్రభావితులయ్యారు. వారిని ఆదర్శంగా తీసుకున్నారు. అందులో ఊర్మిళ ఒకరు. సోదరుడైన శ్రీరాముడి వనవాసం విషయం తెలియగానే లక్ష్మణుడు తానూ వెంట వెళ్లాలని నిర్ణయించు కున్నాడు. ఆ సంగతి అర్ధాంగికి చెప్పాడు. అప్పుడు ఊర్మిళ కన్నీళ్లతో అలా స్థాణువైపోయింది. భర్త తనను రమ్మనలేదు, తాను కూడా సీతమ్మవారిలా వెంటవస్తానని అనలేదు. పట్టుబట్టి వెళ్లి అతనికి తాను అదనపు భారం కాకూడదనుకుంది. పైగా ‘మీ అన్నావదినల సేవలో తరించండి. కానీ నా ప్రార్థన ఒక్కటే! వనవాస కాలంలో మీరు నా గురించి ఒక్క క్షణం ఆలోచించినా మనసు చలించిపోతుంది. మీ సేవకు ఆటంకం కలుగుతుంది’ అంటూ హితవు పలికింది. భర్తతో అరణ్యవాసమైనా అయోధ్యలా భావించి అనుసరించింది జానకీమాత అయితే.. భర్త చేసిన త్యాగాన్ని సమర్థించి అయోధ్యలో కూడా అరణ్యవాసంలా కఠోర జీవితాన్ని గడిపిన ధన్యవనిత ఊర్మిళాదేవి. గోస్వామి తులసీదాస్‌ తన ‘రామచరిత మానస్‌’లో ‘అమ్మా! ఊర్మిళాదేవీ! నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి నాకు లేదు. నీకు వందనం మాత్రం చేయగలను’ అని తన గౌరవాన్ని చాటుకున్నాడు. కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్యశాస్త్రి ఊర్మిళకు పద్య నీరాజనాలు అర్పిస్తూ ‘అమ్మా! త్యాగానికే మారుపేరైన నీ కన్నీళ్లు ఎంతో విలువైనవి. అవి అగ్నికణాలతో సమానం. వాటిలో ఒక్క బొట్టును కూడా భూమిపై పడనీయకు. మహా సాధ్వివైన నీ బాష్పములు భూమి భరించలేదు సోదరీ!’ అంటూ రాశారు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని