సకల గుణాభిరాముడు శ్రీరాముడు

ఒకరోజు నారదమహర్షి నారాయణ గానం చేసుకుంటూ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. పరమానందం పొందిన వాల్మీకి భక్తిశ్రద్ధలతో నమస్కరించి.. ‘నారదమహర్షీ! ఎంతోకాలంగా నా మనసులో ఓ సందేహం ఉంది. దాన్ని తమరే తీర్చాలి’ అన్నాడు.

Published : 01 Feb 2024 00:14 IST

కరోజు నారదమహర్షి నారాయణ గానం చేసుకుంటూ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. పరమానందం పొందిన వాల్మీకి భక్తిశ్రద్ధలతో నమస్కరించి.. ‘నారదమహర్షీ! ఎంతోకాలంగా నా మనసులో ఓ సందేహం ఉంది. దాన్ని తమరే తీర్చాలి’ అన్నాడు. అదేమిటో చెప్పమన్నాడు నారదుడు. ‘ఈ లోకంలో గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, తనకు సాయం చేసినవారిని మరవనివాడు, సత్యాన్నే పలికేవాడు, దృఢచిత్తుడు, మంచి నడవడి గలవాడు, సర్వ ప్రాణుల హితాన్నీ కోరేవాడు, విద్వాంసుడు, సమర్థుడు, అందరికీ ప్రియం కలిగించేలా దర్శనం ఇచ్చేవాడు, ఆత్మజ్ఞానసంపన్నుడు, క్రోధాన్ని జయించినవాడు, కాంతిమంతుడు, అసూయ లేనివాడు, యుద్ధంలో ఆగ్రహిస్తే దేవతలను సైతం భయపడేట్లు చేయగలిగిన వాడు.. ఈ పదహారు సద్గుణాలూ ఉన్నవారెవరు? నేను తమరిని ఈ ప్రశ్న అడుగుతున్న ఈ సమయంలో ఆయన ఈ లోకంలో ఉండాలి. అలాంటివాడున్నాడా లేదా- అనేదే నా సందేహం. ఒకవేళ ఉంటే అతడెవరో తెలియజేయండి’ అన్నాడు.

అది విన్న నారదుడు ‘నాయనా! నువ్వడిగిన లక్షణాల్లో ఒకటో రెండో ఉండటమే అసంభవం. కానీ ప్రజల అదృష్టం కొద్దీ నువ్వు పేర్కొన్న పదహారు సుగుణాలు గల మానవోత్తముడు ఉన్నాడు. అతడే శ్రీరామచంద్రుడు’ అన్నాడు. ఆ వెంటనే శ్రీరాముని చరితాన్ని వంద శ్లోకాల్లో సంగ్రహంగా వివరించి దేవలోకానికి వెళ్లాడు. అలా వాల్మీకి మహర్షికి రామతత్వాన్ని ఉపదేశించి, ఆయన ద్వారా లోకానికి శ్రీమద్రామాయణాన్ని అందజేసిన సదాచార్యుడు నారదుడు.

గోవిందం ఉమామహేశ్వర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని