వేడన్నం.. చద్దన్నం

‘ఆహారపరంగా చద్దన్నం ఆరోగ్యకరమే. కానీ ఆధ్యాత్మికపరంగా అది సోమరితనాన్ని పెంచుతుంది’ అంటూ మలయాళ స్వామి ఒక కథ చెప్పారు.. పూర్వం ఓ సోమరికి పెళ్లయ్యింది.

Published : 22 Feb 2024 00:07 IST

‘ఆహారపరంగా చద్దన్నం ఆరోగ్యకరమే. కానీ ఆధ్యాత్మికపరంగా అది సోమరితనాన్ని పెంచుతుంది’ అంటూ మలయాళ స్వామి ఒక కథ చెప్పారు.. పూర్వం ఓ సోమరికి పెళ్లయ్యింది. భార్య కాపురానికి వచ్చినా బాధ్యత లేకుండా.. ఇంకా తండ్రి సంపాదనతోనే బతుకుతున్నాడు. అతడి తల్లి అన్నం వడ్డించినప్పుడల్లా వేడన్నమే అయినా.. ‘నాయనా ఈ చద్దన్నం తిను’ అంటుండేది పుత్రుడితో. తల్లి ఎందుకలా అంటుందో కొడుక్కు అర్థమయ్యేది కాదు. కోడలికీ అలాగే తర్ఫీదిచ్చిందామె. ఒకరోజు భార్యమీద విరుచుకుపడ్డాడు. ఆమె మౌనం వహించడంతో తల్లి వైపు తిరిగి ‘వేడన్నం వడ్డిస్తూ చద్దన్నం తినమనడంలో నీ ఉద్దేశం ఏమిటి?’ అన్నాడు కోపంగా. ‘అర్థం కాలేదా నాయనా? కష్టార్జితంతో తినేది వేడన్నం. తండ్రి సొమ్ముతో తినేది చద్ది. నువ్వు ఏ పనీ చేయకుండా సోమరివయ్యావు. ఇది చద్ది గాక మరేంటి?!’ అంది. దాంతో అతడికి జ్ఞానోదయమైంది. ప్రతి ఒక్కరూ కష్టార్జితంతో బతకాలన్నదే ఇందులో హితవు. కుటుంబాన్ని పోషించి, రక్షించగలిగినవారే వివాహం చేసుకోవడానికి అర్హులన్నది రుషి వాక్యం. వేరొకరి మీద ఆధారపడేవారిని సంఘమే కాదు, సొంతవాళ్లూ ఆదరించరన్నారు. ఎందరో పురాణపురుషులు ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, ఎవరి మీదా ఏ విషయానికీ ఆధారపడలేదు. స్వశక్తితో జీవించి, కీర్తి సాధించారు.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు