కల్యాణం కమనీయం

కల్యాణం అంటే శుభం. సర్వ జనులకూ సకల శుభాలనూ చేకూర్చేవాడు కల్యాణరాముడు. జగత్కల్యాణం కోసం అవతరించిన ఆ దశరథ నందనుడు, నీలమేఘ శ్యాముడు భక్తులకు సదా శుభాలు చేకూరుస్తూ.. తన పేరు సార్థకం చేసుకున్నాడు.

Published : 22 Feb 2024 00:08 IST

ల్యాణం అంటే శుభం. సర్వ జనులకూ సకల శుభాలనూ చేకూర్చేవాడు కల్యాణరాముడు. జగత్కల్యాణం కోసం అవతరించిన ఆ దశరథ నందనుడు, నీలమేఘ శ్యాముడు భక్తులకు సదా శుభాలు చేకూరుస్తూ.. తన పేరు సార్థకం చేసుకున్నాడు. కష్టాలు ఎదురైనప్పుడు ‘అయ్యా రామా!’ అని ప్రార్థిస్తాం. ఆ స్వామి పేరు తలచుకుంటే చాలు కష్టాలు గట్టెక్కుతాయి. ‘అన్నమో రామచంద్రా’ అంటే అన్నం దొరుకుతుంది. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకు వెళ్తున్నప్పుడు అడ్డగించి, అతడి చేతిలో దెబ్బతిన్న జటాయువు- కొన ఊపిరితో అవస్థపడుతూ కూడా శ్రీరాముణ్ణే స్మరించాడు. ఆయనకు సీతాపహరణం గురించి చెప్పి తుది శ్వాస వదిలాడు. రామనామం జపించి, రామానుగ్రహంతో ముక్తి పొందింది శబరి. భక్తులూ, విరోధులూ కూడా రామ నామంతో ముక్తి పొందారు. మాయామృగంగా మారిన మారీచుడు- రామబాణంతో ‘హా.. రామా..’ అంటూ ప్రాణం వదిలాడు. ఆదికవి వాల్మీకి రామకథను రామాయణంగా మలిచాడు. సత్యం, ధర్మం సమాజంలో అంతరించి పోకుండా కాపాడటానికి యుగధర్మాన్ని బట్టి ఆ భగవానుడే శ్రీరాముడిగా జన్మించాడు. భగవంతుడి సన్నిధిలోనే ప్రకృతి చైతన్యం పొందుతుంది. రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కల్యాణం నిర్వహించడం తెలిసిందే. రాముడు ఆదినాయణుడి అవతారమూర్తి అయినందువల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా కల్యాణం జరపవచ్చు. పుష్య శుద్ధ త్రయోదశినాడు అంటే ఫిబ్రవరి 22న రామతీర్థంలో శ్రీరాములవారి వార్షిక కల్యాణోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామచంద్రుడు కామితార్థ ప్రదాత. సీతారామకల్యాణం లోకానికే శుభప్రదం.

ఉప్పు రాఘవేంద్రరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని