అన్నదానం.. మహా దానం!

దానాల్లో భూదాన, గోదాన, సువర్ణ, గృహ దానాదులు ఎన్ని ఉన్నా... అన్నదానంతో సమానమైనవి కావు. ఏదిచ్చినా ఇంకాస్త కావాలనిపిస్తుంది. అన్నదానం ఒక్కటే పూర్తిగా సంతృప్తినిస్తుంది.

Published : 22 Feb 2024 00:09 IST

దానాల్లో భూదాన, గోదాన, సువర్ణ, గృహ దానాదులు ఎన్ని ఉన్నా... అన్నదానంతో సమానమైనవి కావు. ఏదిచ్చినా ఇంకాస్త కావాలనిపిస్తుంది. అన్నదానం ఒక్కటే పూర్తిగా సంతృప్తినిస్తుంది. ఒకసారి వ్యాస మహర్షి కాశీనగరానికి వెళ్లాడు. అక్కడ మైత్రేయుడనే మహర్షి ఆతిథ్యమిచ్చి ఆదరించాడు. వ్యాసుడు మైత్రేయుడు పెట్టిన భోజనం ఆరగించి సంతుష్టినొందాడు. అప్పుడు మైత్రేయ మహర్షి వ్యాసుణ్ణి ‘ఎవరికైనా అపరిమితమైన సంతోషం ఎప్పుడు కలుగుతుంది?’ అనడిగాడు. అప్పుడు వ్యాసుడు ‘తపస్సు, విద్య తదితర ధర్మాలన్నింటిలోకి దానమే గొప్పధర్మం. వాటిలో అన్నదానం మరింత శ్రేష్ఠం. అదే సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. దాతకు ఆధ్యాత్మికోన్నతినీ ప్రసాదిస్తుంది’ అని వివరించాడు. అయితే నిస్సహాయులే కాకుండా అన్నీ బాగున్న వాళ్లు కూడా అన్నసంతర్పణల్లో బారులు తీరుతుంటారని గేలిచేయడం చూస్తుంటాం. ఓ భక్తుడు కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతితో ‘స్వామీ! ఆశ్రమంలో అన్నదానానికి ధనికులు కూడా వస్తున్నారు ఎలా?’ అన్నాడు. పరమాచార్యులు... ‘నాయనా! ఒక్క అన్నార్తుడి ఆకలి తీర్చేందుకు 99 మంది అనర్హులకు కూడా అన్నం పెట్టవలసిందే. ఇది ధర్మం’ అని బదులిచ్చాడు. మనం మనస్ఫూర్తిగా అన్నదానం చేస్తే.. అపాత్రదానం కూడా సపాత్రదానం అవుతుంది. ఒకరు ఆకలితో మన ఎదుట నిలుచున్నారు అంటే.. వారు నూటికి నూరు శాతం అన్నదానానికి అర్హులేనని అర్థం. పైగా ఆకలిగొన్నవారు అన్నదానంతో సంతృప్తినొందితే అది ఆ పరమాత్మకు పరమప్రీతికరం. నోరు ఉండి అడగగలిగిన మనుషుల ఆకలి తీర్చడం ఘనమైన సంగతి. ఇక నోరు లేని మూగజీవాల ఆకలిని అర్థం చేసుకొని తీర్చడం మరింత పుణ్యప్రదమని పురాణేతిహాసాలు ప్రబోధిస్తున్నాయి.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని