రాహుకాలం మంచిదేనా?

నేటి పంచాంగాలు, గోడ క్యాలెండర్లలో జనాన్ని అనవసరంగా భయపెడుతున్న ఒక మాట రాహుకాలం. నిజానికది అన్ని సందర్భాల్లో చెడు చేయదు. జాతకంలో రాహువు శుభగ్రహంగా ఉన్నవారికి రాహుకాలం చాలా మంచిది. ఆ సమయంలో చేసే పని వారికి విజయాన్నిస్తుంది.

Published : 24 Mar 2022 01:22 IST

నేటి పంచాంగాలు, గోడ క్యాలెండర్లలో జనాన్ని అనవసరంగా భయపెడుతున్న ఒక మాట రాహుకాలం. నిజానికది అన్ని సందర్భాల్లో చెడు చేయదు. జాతకంలో రాహువు శుభగ్రహంగా ఉన్నవారికి రాహుకాలం చాలా మంచిది. ఆ సమయంలో చేసే పని వారికి విజయాన్నిస్తుంది.

రాహుకాల గణన చూస్తే, నవ గ్రహాలలో 7 గ్రహాలకి ఒకరోజు లేదా 24 గంటలు కేటాయించగా, ఛాయాగ్రహాలైన రాహు, కేతువులకి రోజులు లేకుండా పోయాయి. అందువల్ల వాటికోసం, ఒక్కో గ్రహం రోజు నుంచి 3 గంటలు చొప్పున తీసుకున్నారు. అలా 7 రోజుల నుంచి 3 గంటలు తీసుకుంటే 7×3 = 21 గంటలు వచ్చాయి. మిగిలిన 7 గ్రహాలు తమ తమ 24 గంటలు నుంచి 3 గంటలు కోల్పోగా.. వాటికి 21 గంటలు మిగిలాయి. అలా 7 గ్రహాలకి 21 గంటలు, రాహు కేతువులు రెండింటికీ కలిపి 21 గంటలు వచ్చాయి. అవి తమకి రోజుకి వచ్చిన 3 గంటలను చెరిసగం పంచుకుంటే, ఒక్కోదానికీ గంటన్నర వచ్చింది.

పురాణాల ప్రకారం ఒకరోజులో ఒకటిన్నర గంట రాహువు, ఒకటిన్నర గంట కేతువు అంబికను పూజిస్తాయి. అలా రాహువు అమ్మవారిని పూజించే సమయాన్ని రాహుకాలంగా, కేతువు అమ్మవారిని పూజించే సమయాన్ని యమగండంగా పిలుస్తారు. రాహుకాలంలో ఇతర గ్రహాల ప్రభావం తగ్గి ఉంటుందనే కారణంగా ఆ సమయంలో శుభకార్యాలు చేయకూడదనేది ఒక నమ్మకం. క్యాలెండర్‌లో రాహుకాలం సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు అన్న ప్రాతిపదికన నిర్ణయిస్తారు. కానీ సూర్యోదయ సూర్యాస్తమయాలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు. కనుక ఆయా ప్రాంతాలలో ఉదయాస్తమయాలను లెక్కించి, ఎనిమిది భాగాలు చేసి ఆదివారం 8వ భాగం, సోమవారం 2, మంగళవారం 7, బుధవారం 5, గురువారం 6, శుక్రవారం 4, శనివారం 3వ భాగం రాహుకాలంగా పరిగణించాల్సి ఉంది. రాహుకాలాన్ని తమిళనాట ఎక్కువగా పాటిస్తారు. రెండు మూడు దశాబ్దాలుగా తెలుగువారూ పాటిస్తున్నారు. రాహుకాలం పూజకు మంచిదనేది తమిళ, కన్నడిగుల నమ్మకం. మన ప్రాంతంలో వర్జ్యం, దుర్ముహూర్తం పాటిస్తే సరిపోతుందంటారు.

- డాక్టర్‌ టేకుమళ్ల వెంకటప్పయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు