రావణకాష్ఠం అంటే..

చితిపై సుగంధ చందన కట్టెలు, పద్మకములు, వట్టివేళ్లు పేర్చి, దానిపై జింకచర్మం పరిచి రావణుడి పార్థివదేహాన్నుంచారు.

Published : 24 Nov 2022 00:25 IST

చితిపై సుగంధ చందన కట్టెలు, పద్మకములు, వట్టివేళ్లు పేర్చి, దానిపై జింకచర్మం పరిచి రావణుడి పార్థివదేహాన్నుంచారు. పెరుగు, నెయ్యి కలిపిన పాత్ర పెట్టారు. సోమలతను తెచ్చిన బండిని కాళ్ల వైపు, తొడల మధ్య సోమలతను దంచిన కర్రరోలు ఉంచారు. ఇక అరణులు, చెక్క పాత్రలు, రోకలి తదితర యజ్ఞ సంబంధ వస్తువులను సముచిత ప్రదేశాల్లో ఉంచి మంత్రపూరితంగా మేకను బలి ఇచ్చారు. ఆపైన నేతితో తడిపిన దర్భలుంచారు. శరీరంపై పుష్ప మాలలు, వస్త్రాలుంచిన తర్వాత విభీషణుడు చితికి నిప్పు అంటించాడు. ఇవన్నీ ఎందుకంటే.. రావణుడు బ్రహ్మ మనవడు, అనేక యజ్ఞాలు చేసినవాడు. సోమలత తేవడానికి కొత్తబండిని, దాన్ని దంచడానికి రోళ్లు తయారుచేస్తారు. నేతిని అగ్నిలో ఆహుతి చేసేందుకు సృక్కులు, సృవాలు ఉంటాయి. అగ్నిని మథించే అరణులుంటాయి. ఇలా యజ్ఞానికి వలసినవన్నీ కర్ర రూపంలో ఉండేవే. ఒకసారి వాడినవి మరో యజ్ఞానికి వాడకూడదు. యజ్ఞం చేసినవారు, గతంలో ఉపయోగించిన సామగ్రినంతా భద్రపరచాలి. అలా దాచినవన్నీ మరణానంతరం పార్థివ శరీరంతోపాటు కాష్ఠం మీద వేసి తగలేస్తారు. అందుకే రావణుడి యజ్ఞ సామాగ్రి అంతా చితి మీద పేర్చారు. నిత్యకర్మలో ఉపయోగించివాటినీ అంతే. ఎవరైనా వస్తువులను దాచుకుంటే ‘వాటిని నీ మీదేసి తగలేస్తారా?’ అని, కోపమొస్తే ‘నీకు నల్ల మేకపోతును బలిస్తారా?’ తరహాలో పరుషంగా అనడం తెలిసిందే. కేవలం కట్టెలు కాకుండా అన్నన్ని వస్తువులున్నందున రావణకాష్ఠం చాలా ఎక్కువ కాలం తగలబడింది. అందుకే ఎంతకూ తెగని తగవులను, దీర్ఘకాలం సాగే కోర్టుకేసులను రావణకాష్ఠంతో పోలుస్తారు.

- పద్మజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని