దుఃఖం దేనికి?!

ఏడవటం వలన ఏదైనా ప్రయోజనం ఉందా అంటూ ఒక శిష్యుడు విద్యాప్రకాశనంద గిరిని అడిగారు. దానికాయన ‘నేనో చిన్న కథ చెబుతాను, వినండి.. ఒక రాకుమారుడు మహా అల్లరివాడు. అతడోరోజున దారిన పోయే గొల్లపడుచుల పాల కుండలను పగలకొడుతున్నాడు. వారు విలపిస్తుంటే.. అతడు ఆనందిస్తున్నాడు. తక్కిన స్త్రీలు ఏడుస్తుంటే.. ఒకామె మాత్రం అతణ్ణి చూసి నవ్వసాగింది.

Published : 16 Nov 2023 00:16 IST

తత్వదీపిక

డవటం వలన ఏదైనా ప్రయోజనం ఉందా అంటూ ఒక శిష్యుడు విద్యాప్రకాశనంద గిరిని అడిగారు. దానికాయన ‘నేనో చిన్న కథ చెబుతాను, వినండి.. ఒక రాకుమారుడు మహా అల్లరివాడు. అతడోరోజున దారిన పోయే గొల్లపడుచుల పాల కుండలను పగలకొడుతున్నాడు. వారు విలపిస్తుంటే.. అతడు ఆనందిస్తున్నాడు. తక్కిన స్త్రీలు ఏడుస్తుంటే.. ఒకామె మాత్రం అతణ్ణి చూసి నవ్వసాగింది. ‘ఎందుకు అంతగా నవ్వుతున్నావు? నీ కుండలు కూడా పగిలాయి కదా! నువ్వూ ఏడువు’ అన్నాడు రాజకుమారుడు. దానికామె ‘అయ్యో రామా.. కుండ పగిలినంతలోనే ఏడవాలా?! ఇది చాలాË చిన్న సంగతి. ఇంతకంటే భయంకరమైన సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నప్పుడే నాకు ఏడుపు రాలేదు. నా కష్టాలు వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. చెబుతాను విను.. నాకు భర్త దూరం అయ్యాడు, కొడుకు దక్కలేదు, నా సంపదలన్నీ పోయాయి. పొట్ట కూటి కోసం నానా కష్టాలూ పడ్డాను. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే.. ఆ దైవం కరుణ చూపక.. బతికే ఉన్నాను. మొత్తానికి ఈ గ్రామానికి చేరాను. సుడిగాలి వల్ల ఎండుటాకులన్నీ ఒక దరికి చేరతాయి. అదే గాలి వల్ల వియోగాన్ని పొందుతాయి. ఇలాంటి నా కష్టాల ఖజానా ముందు పాలకుండ నలుసుతో సమానం. దీని కోసం ఏడవమంటున్నావే.. అది వివేకం అనిపించుకుంటుందా? ఈ రోజు నువ్వు రాచరికపు హోదాను అనుభవిస్తున్నావు! కాలం కలసి రాకుంటే నువ్వు కూడా మా వలెనే సాధారణ పౌరుడివే కదా! జీవితంలో ఎన్నింటినో భరించాల్సి వస్తుంది. ఎలాంటి బాధలైనా.. చలించకుండా ముందుకు సాగాలి. సమస్యకు పరిష్కారం కనుక్కోవాలే కానీ.. దుఃఖిస్తూ కూర్చోకూడదు’ అంది. రాకుమారుడు క్షమాపణ చెప్పి, అక్కణ్ణించి వెళ్లిపోయాడు’ అంటూ సందేహం తీర్చారు.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు