పంచబేరాలు.. ఉత్సవ మూర్తులు

తిరుమలలో స్వయంభుగా వెలసిన శ్రీనివాసునికి వైఖానస ఆగమం ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలోని మూలవిరాట్టు స్థిరంగా ఉన్న నేపథ్యంలో ఊరేగింపు, శయన కార్యక్రమాలు నిర్వహించేందుకు

Published : 07 Nov 2021 15:18 IST

 ఈనాడు-తిరుపతి: తిరుమలలో స్వయంభుగా వెలసిన శ్రీనివాసునికి వైఖానస ఆగమం ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలోని మూలవిరాట్టు స్థిరంగా ఉన్న నేపథ్యంలో ఊరేగింపు, శయన కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఉండదు. అందువల్ల ఆగమశాస్త్రాల ప్రకారం ధ్రువబేరం, కౌతుకబేరం, స్నపనబేరం, బలిబేరం, ఉత్సవబేరం వంటి ఐదు మూర్తులకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తిరుమలలో శ్రీవారిని అర్చించేందుకు ఐదుగురు మూర్తులను కొలువుదీర్చారు. ఇందులో భాగంగా  కొన్ని మూలవిరాట్టుకు మరికొన్ని ఉత్సవమూర్తులకు సేవలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 

ధ్రువబేరం
ఈ మూర్తిని మూలవిరాట్టు, ధ్రువమూర్తి, మూలబేరం అని పిలుస్తారు. తిరుమలలోని ఆనంద నిలయ గర్భాలయంలో శంఖుచక్రాలతో సాలగ్రామ శిలామూర్తిగా శ్రీవారు వెలిశారు. స్వామి విగ్రహం ఎత్తు సుమారు 8 అడుగులు ఉంటుందని అర్చకులు చెబుతున్నారు. మూలమూర్తికి నిత్యం రెండుసార్లు తోమాలసేవ, మూడుసార్లు అర్చన, నైవేద్యాలు నిర్వహిస్తారు. వక్షస్థల శ్రీమహాలక్ష్మితో ఉన్న శ్రీవారి మూలవిరాట్టుకు ప్రతి మంగళవారం రెండో అర్చనగా 108 బంగారు కమలాలతో అష్టదళపాద పద్మారాధన సేవ నిర్వహిస్తారు. ప్రతి గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, నేత్రదర్శనం, సాయంత్రం పూలంగిసేవ నిర్వహిస్తారు. శుక్రవారం తెల్లవారుజామున మూలవిరాట్టుకు అభిషేకం కనువిందుగా సాగుతుంది.

కౌతుకబేరం
ఈ మూర్తిని భోగ శ్రీనివాసమూర్తి, మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తుంటారు. శంఖుచక్రధారియై చతుర్ముఖుడైన భోగమూర్తి మూలవిరాట్టుకు ప్రతిరూపంగా ఉంటుంది. ఒకటిన్నర అడుగుల ఎత్తులో ఉండే వెండి విగ్రహాన్ని క్రీ.శ. 614లో పల్లవరాణి బహూకరించినట్లు చెబుతున్నారు. ఎప్పుడూ శ్రీవారి మూలవిరాట్టు పాదాల ముందు ఉండే ఈ భోగశ్రీనివాసమూర్తికి ప్రతిరోజు ఉదయం ఆకాశగంగ తీర్థంతో అభిషేకిస్తారు. ప్రతి బుధవారం ఉదయం బంగారు వాకిలి ముందు సహస్రకలశాభిషేకం, ప్రతి రోజు రాత్రి ఏకాంతసేవ/ పవళింపుసేవ జరుగుతాయి.

బలిబేరం
బలిబేరమూర్తిని కొలువు శ్రీనివాసమూర్తి, లేఖన శ్రీనివాసమూర్తి అని పిలుస్తారు. వెండి భోగ శ్రీనివాసమూర్తి తరహాలోనే పంచలోహాలతో విగ్రహం ఉంటుంది. నిత్యం ఆలయంలో తోమాలసేవ తర్వాత అర్చనకు ముందు స్నపన మండపంలో బంగారు సింహాసనంపై కొలువు జరుగుతుంది. ఈ కొలువులో కొలువు శ్రీనివాసమూర్తికి ఛత్రచామర మర్యాదపూర్వకంగా సత్కారాలతో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆ రోజు తిథి, వార, నక్షత్రాలతో పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ముందు రోజు ఆదాయ వ్యయాలతోపాటు మొత్తం రాబడి వివరాలను స్వామికి తెలియజేస్తారు. దేవస్థానం ఆదాయ వ్యయాల లెక్కలను పర్యవేక్షించే అధికారమూర్తిగా కొలువు శ్రీనివాసమూర్తి ప్రతీతి. 

స్నపనబేరం
 స్వామిని ఉగ్ర శ్రీనివాసమూర్తి, వేంకటత్తురైవార్‌, స్నపనమూర్తిగా పిలుస్తుంటారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఉగ్రశ్రీనివాసుని పంచలోహ విగ్రహాలు గతంలో ఉత్సవాల్లో ఉంచేవారు.14వ శతాబ్దంలో బ్రహ్మోత్సవాల సమయంలో కొన్ని ఘటనలు చోటు చేసుకోవడంతో ఉగ్ర శ్రీనివాసమూర్తి విగ్రహాల ఊరేగింపు నిలిపివేసినట్లు పండితులు చెబుతున్నారు. కార్తికమాసంలో కైశిక ద్వాదశి రోజున తెల్లవారుజామున ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుగా సూర్యోదయం కాకముందే బయటకు తీసుకువచ్చి మళ్లీ ఆలయంలోకి తీసుకెళ్తారు. 

ఉత్సవబేరం
ఉత్సవబేరాన్ని మలయప్పస్వామి, ఉత్సవ శ్రీనివాసమూర్తి అనే పేర్లు ఉన్నాయి. క్రీ.శ. 1339లో ఈ మూర్తుల ప్రస్తావన ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆలయం వెలుపల కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాల వంటి నిత్య, వార, మాస, వార్షికోత్సవాల్లో భక్తులకు శ్రీమలయప్పస్వామి వారు దర్శనమిస్తారు. ఉగ్ర శ్రీనివాసమూర్తి తర్వాత తితిదే నిర్వహించే ఉత్సవాల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి భక్తులకు సాక్షాత్కరిస్తారు. తిరుమలలోని మలయప్పకోనలో దొరికినందున ఈ మూర్తికి ఆ పేరు వచ్చిందంటారు. 

శ్రీవారి మూలమూర్తికి జరిగే నివేదనలే కాకుండా శ్రీ మలయప్పస్వామికి జరిగే నివేదనల్లో వార నివేదనలు ముఖ్యమైనవి. ఆదివారం స్వామికి అమృతకలశం అనే ప్రసాదాన్ని బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ ప్రసాదం ఆరోగ్యప్రాప్తి, సంతానప్రాప్తిని కలిగిస్తుందని విశ్వాసం. అయితే ఇది భక్తులకు అందుబాటులో ఉండదు. మంగళవారం అష్టదళపాదపద్మారాధన తరువాత ప్రత్యేకంగా సీరా, వడపప్పు, పానకం నివేదిస్తారు. గురువారం తిరుప్పావడలో పులిహోర రాశితో పాటు జిలేబి, మురుకులను నైవేద్యంగా పెడతారు. శుక్రవారం అభిషేకం తరువాత బెల్లం, పాయసం, పోళి నివేదిస్తారు. ఇవికాకుండా చాలా ప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని