ఎంటెక్‌లో ఏ బ్రాంచి మేలు?

బీటెక్‌ (మెకానికల్‌) ఇటీవలే పూర్తయింది. గేట్‌కు సిద్ధమవుతున్నాను. ఎంటెక్‌లో ఏ బ్రాంచి ఎంచుకుంటే మేలు?...

Updated : 05 Apr 2020 00:16 IST

బీటెక్‌ (మెకానికల్‌) ఇటీవలే పూర్తయింది. గేట్‌కు సిద్ధమవుతున్నాను. ఎంటెక్‌లో ఏ బ్రాంచి ఎంచుకుంటే మేలు?

- నాగసురేష్‌

దవాల్సిన రంగం లేదా తీసుకోవాల్సిన బ్రాంచిపై నిర్ణయం అనేది మన ఆసక్తిని బట్టి ఉంటుంది. ప్రస్తుతం బీటెక్‌ మెకానికల్‌ చేసిన విద్యార్థులకు ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌ ఇంజినీరింగ్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌, మెటీరియల్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, నానోటెక్నాలజీ, ఆటో మొబైల్‌ ఇంజినీరింగ్‌, క్యాడ్‌- క్యామ్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌, ఎనర్జీ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌ లాంటి బ్రాంచీల్లో అవకాశాలున్నాయి. ఒకవేళ భారీ పరిశ్రమల్లో పనిచేయాలనే ఆసక్తి ఉంటే ప్రొడక్షన్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లను తీసుకోవడం మంచిది. డిజైన్‌ పరమైన అంశాలపై అభిరుచి లేదా నైపుణ్యం ఉందని భావిస్తే డిజైనింగ్‌ తీసుకోవడం ఎంతో ఉత్తమం. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగంలో డిజైన్‌ ఇంజినీరింగ్‌ చేసినవారికి డిమాండ్‌ ఉంది. రోబోటిక్స్‌ లాంటి బ్రాంచిలోనూ విద్యార్థులకు చక్కని అవకాశాలు లభిస్తున్నాయి. ఇవి కాకుండా కొన్ని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు జియో థర్మల్‌ ఇంజినీరింగ్‌, పేపర్‌ టెక్నాలజీ, రైల్వే ఇంజినీరింగ్‌, న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌ లాంటి మల్టీ డిసిప్లినరీ రంగాల్లోనూ ఎంటెక్‌ని అందిస్తున్నాయి.

జర్నలిస్టు కావాలంటే..?

మా అమ్మాయి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. జర్నలిస్టు కావాలనుకుంటోంది. డిగ్రీ తరువాత జర్నలిజం కోర్సులు చేయవచ్చా? అందుబాటులో ఉన్న కోర్సులు, అందించే సంస్థలేవి? ప్రవేశప్రక్రియలేమిటి?

- లోకేశ్వర్‌ రెడ్డి

టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జర్నలిజం చదివినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మల్టీమీడియా, అంతర్జాల ప్రభావంతో ఈ వృత్తి మరింత ప్రత్యేకంగా మారింది. ప్రముఖ మీడియా సంస్థలు రాతపరీక్ష, బృంద చర్చ, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుని, జర్నలిజం కోర్సుల్లో చేర్చుకుంటున్నాయి. డిగ్రీ తరువాత జర్నలిజం కోర్సును చేయవచ్ఛు ఒక సంవత్సరం డిప్లొమా కోర్సు కానీ రెండు సంవత్సరాల పీజీ కోర్సు కానీ చేయవచ్ఛు దూరవిద్యలోనూ ఈ రెండు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెండు సంవత్సరాల జర్నలిజం కోర్సును దాదాపుగా అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలు, తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. మొదటితరం సెంట్రల్‌ యూనివర్సిటీలైన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, జామియా మిలియా, తేజ్‌పూర్‌ లాంటివి ప్రత్యేక ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్లు జరుపుతున్నాయి. కొత్త సెంట్రల్‌ యూనివర్సిటీలు అన్నీ కలిసి ఉమ్మడి సీయూ సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇక ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఎస్‌ఆర్‌ఎం, అమిటీ, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, క్రైస్ట్‌ యూనివర్సిటీ, జేవియర్స్‌, మణిపాల్‌ యూనివర్సిటీ లాంటివి ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటన్నిటికీ మొదట రాత పరీక్ష/ లేదా గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో జనరల్‌ నాలెడ్జ్‌, కరంట్‌ అఫైర్స్‌లనూ, ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానాన్నీ పరీక్షిస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌ లేదా ఇంటర్వ్యూ రౌండ్లలో విద్యార్థుల భావ వ్యక్తీకరణ, జనరల్‌ అవేర్‌నెస్‌, భాషా సామర్థ్యాలను పరీక్షిస్తారు. వీటన్నిటితో పాటు విద్యార్థి వ్యక్తిత్వం, ఆలోచనా విధానాలనూ పరిశీలిస్తారు.

కోర్‌లో కొలువు సాధించడం ఎలా?

బీటెక్‌ (ఈసీఈ) చదువుతున్నాను. త్వరలో మాకు ప్రాంగణ నియామకాలు ఉన్నాయి. మా స్నేహితులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించడం సులువు అంటున్నారు. నాకేమో కోర్‌ విభాగంలో ఆసక్తి ఉంది. నా బ్రాంచి ఆధారంగా నాకున్న ఉద్యోగావకాశాలేంటో తెలపండి.

- రమ్య శ్రీనివాసరావు

ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు ఏ బ్రాంచి వారైనప్పటికీ ప్రాంగణ నియామకాల్లో ఐటీ రంగం లేదా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం సాధించుకునే వీలుంది. కానీ కోర్సు పూర్తయిన తర్వాత ఆ రంగంలోనే ఏదైనా ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులు కోర్‌కు సంబంధించిన ఉద్యోగాన్ని ఎంచుకోవడం, దాని కోసం ప్రయత్నించడం మంచిది. ఏ బ్రాంచి అయినప్పటికీ ఏ రంగం అయినప్పటికీ మనకు ఆ రంగంలో మంచి పట్టు, నైపుణ్యం ఉన్నట్లయితే ఉద్యోగం సంపాదించటం పెద్ద కష్టం కాదు. ఇక మీ కోర్‌ బ్రాంచి విషయానికొస్తే ఈసీఈలో ఇంజినీరింగ్‌ చేసిన విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీర్‌, ఎలక్ట్రానిక్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ ఇంజినీర్‌, సపోర్ట్‌ ఇంజినీర్‌, సిస్టమ్స్‌ కంట్రోల్‌ ఇంజినీర్‌ లాంటి ఉద్యోగావకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు మిగతా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల మీరు కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీ బ్రాంచికి ప్రైవేటు రంగాల్లో మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు ఎక్కువే. చాలా ప్రభుత్వరంగ సంస్థలు గేట్‌ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అందుకని గేట్‌ రాసి ప్రభుత్వ ఉద్యోగాల కోసమూ ప్రయత్నించవచ్చు.

- ప్రొఫెసర్‌ బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని