కోతి చేతిలో కొడవలి

ఒక అడవిలో ఓ కోతి ఉండేది. ఓ రోజు దానికి ఏ పనీ తోచక గొయ్యిని తీసింది. అందులో ఒక కొడవలి కనిపించింది. కోతి దాన్ని నెమ్మదిగా బయటకు తీసి అటూ ఇటూ తిప్పింది. ఆ కొడవలి ధగధగ మెరుస్తూ.. ‘మిత్రమా ఏమి నీ కోరిక?’ అని అడిగింది.

Updated : 18 Sep 2020 00:56 IST

ఒక అడవిలో ఓ కోతి ఉండేది. ఓ రోజు దానికి ఏ పనీ తోచక గొయ్యిని తీసింది. అందులో ఒక కొడవలి కనిపించింది.

కోతి దాన్ని నెమ్మదిగా బయటకు తీసి అటూ ఇటూ తిప్పింది. ఆ కొడవలి ధగధగ మెరుస్తూ.. ‘మిత్రమా ఏమి నీ కోరిక?’ అని అడిగింది.

కొడవలి మాట్లాడేసరికి కోతి కంగారు పడిపోయింది. భయంతో వణికిపోతూ... ‘నువ్వు దెయ్యానివో.. భూతానివో కాదు కదా!’ అని అడిగింది.

‘నేను దెయ్యాన్నీ కాదు, భూతాన్ని అంతకంటే కాదు. నేను మట్టి దేవత పుత్రుడను.. నీ అదృష్టం బాగుండి నీకు దొరికాను.. నువ్వు కోరిన కోరికను తీర్చగలను’ అని పలికింది.

కోతి సంభ్రమాశ్చర్యాలతో ‘అయితే నా కోరికలన్నీ తీర్చగలవా?’ అంది.

‘లేదు.. లేదు.. కేవలం ఒక్కసారి మాత్రమే నీకు వరం ఇవ్వగలను. నువ్వు రెండోసారి ఏం కోరినా నేను తీర్చలేను. అందుకే నీ జీవితాశయం ఏదైనా ఉంటే.. అది తీరాలని కోరుకో. తర్వాత నన్ను ఒక పేద రైతుకు అందించు. లోకవినాశనం మాత్రం కోరుకోవద్దు’ అని షరతు పెట్టింది కొడవలి.

ఏమి అడగాలో నిర్ణయించుకోలేక, కోతి ఆ దారిన పోతున్న ఒక నక్కను పిలిచింది. జరిగిన అద్భుతాన్ని వివరించి.. ‘మహిమగల ఈ కొడవలిని ఏ వరం అడగాలో కాస్త సలహా ఇవ్వు’ అని అంది.

‘ఇదే మంచి అవకాశం, మీకూ మాకూ ఉమ్మడి శత్రువులైన సింహాలు, పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, దున్నలు, మొసళ్లు, గద్దలు, కొండచిలువల జాతి మొత్తం అంతరించిపోవాలని కోరుకో’ అని దుష్ట సలహా ఇచ్చింది. తర్వాత తనదారిన తాను వెళ్లిపోతూ.. కోతి ఏమి చేస్తుందో చూద్దామని పక్కనున్న తుప్పల్లో నక్కింది నక్క.

‘నక్క సలహా పాటించాలా.. వద్దా?’ అని తర్జన భర్జన పడుతూ కొడవలిని కాసేపు పక్కనపెట్టి కళ్లు మూసుకుని దీర్ఘ ఆలోచనలోకి జారిపోయింది కోతి.

ఇదే మంచి అవకాశమనుకొని, నక్క మెరుపువేగంతో వచ్చి కోతి పక్కనున్న కొడవలిని తీసుకుని కొంతదూరం పోయి.. ‘ఓ మహిమ గల కొడవలీ.. మా నక్కల జాతి తప్ప ఈ లోకంలో ఏ జీవీ బతకరాదు. ఇదే నా కోరిక.. తీర్ఛు.’ అని గట్టిగా అరిచింది. మహిమ గల కొడవలిని కోతి నుంచి అతి సులభంగా దొంగిలించాననే ఆనందంలో గెంతులు వేసింది.

కొడవలి గాల్లో ఎగురుతూ ‘మూర్ఖ నక్కా లోక వినాశనం కావాలని కోరతావా’ అంటూ దాన్ని గాయపరిచింది. కుయ్యో.. మొర్రో అంటూ ప్రాణభయంతో అది పరుగులు పెట్టింది. అయినా వదలకుండా కొడవలి దాన్ని తరుముతోంది. పరుగు పరుగున కోతి వచ్చి ‘ఓ మట్టిపుత్రా శాంతించు.. ఈ నక్కను క్షమించు’ అని దండం పెట్టింది.

కొడవలి శాంతించి కోతి చేతిలోకి వచ్చింది. అది మరో ఆలోచన లేకుండా.. ‘మహిమ గల ఓ మట్టి పుత్రుడా ఈ లోకంలో అందరూ ప్రకృతి ధర్మాల ప్రకారమే నడుచుకోవాలి. న్యాయం, ధర్మం వర్ధిల్లాలి. సమస్త ప్రపంచం సుభిక్షంగా ఉండాలి. ఏ జీవికీ కరవుకాటకాలు ఉండరాదు. ఇదే నా కోరిక’ అంది.

కొడవలి ‘తథాస్తు.. తప్పక నెరవేరుతుంది’ అని చెప్పింది. వెంటనే కోతి అడవి పక్కనున్న ఊరికి వెళ్లింది. అక్కడ పేదరాశి పెద్దమ్మను కలిసింది. ఆమె సాయంతో అతి పేద రైతుకు కొడవలిని అందించి వెళ్లిపోయింది.

- మీగడ వీరభద్రస్వామి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని