కలసి ఉంటే కలదు సుఖం!

అనగనగా దండకారణ్యంలో సింహపురి అనే ఒక చిన్న జంతు రాజ్యం ఉండేది. దాన్ని ఒక సింహం పరిపాలించేది. అది తన రాజ్యంలో ఉన్న అన్ని రకాల జంతువుల్ని ప్రేమగా చూసుకునేది. బాగా ఆకలి వేస్తే తప్ప వేటకు వెళ్లేది కాదు. మిగతా క్రూర జంతువులు కూడా అనవసరంగా సాధు జంతువులను చంపకూడదని షరతు విధించింది. రాజు ఆజ్ఞను సింహపురిలోని అన్ని జంతువులు తు.చ. తప్పక పాటించేవి...

Published : 18 Jul 2021 02:17 IST

నగనగా దండకారణ్యంలో సింహపురి అనే ఒక చిన్న జంతు రాజ్యం ఉండేది. దాన్ని ఒక సింహం పరిపాలించేది. అది తన రాజ్యంలో ఉన్న అన్ని రకాల జంతువుల్ని ప్రేమగా చూసుకునేది. బాగా ఆకలి వేస్తే తప్ప వేటకు వెళ్లేది కాదు. మిగతా క్రూర జంతువులు కూడా అనవసరంగా సాధు జంతువులను చంపకూడదని షరతు విధించింది. రాజు ఆజ్ఞను సింహపురిలోని అన్ని జంతువులు తు.చ. తప్పక పాటించేవి.

సింహం తన రాజ్యానికి సేనాధిపతిగా ఏనుగును, కోశాధికారిగా కోతిని, గూఢచారిగా పావురాన్ని, మంత్రిగా నక్కను నియమించింది. శత్రువులు దాడి చేయకుండా కండబలం గల ఏనుగు కాపలా కాసేది. కోతి అడవిలోని చెట్లపై తిరుగుతూ పండ్లు, కూరగాయలు, గింజల్ని సేకరించి బలహీనంగా ఉన్న జంతువులకు అందించేది. పావురం అడవి సరిహద్దుల్లో విహరిస్తూ చుట్టుపక్కల అడవుల్లోని శత్రువుల కదలికలపై నిఘా వేసి ఉంచేది. ఎవరైనా శత్రువులు లోపలికి చొరబడితే వెంటనే సేనాధిపతి ఏనుగును అప్రమత్తం చేసేది.

ఇక సింహపురి రాజ్యంలో పనీపాటా లేకుండా తిరిగేది మంత్రి నక్క మాత్రమే. రాజుకు ఉచిత సలహాలివ్వడమే దాని పని. నక్క రోజూ చిన్న జంతువుల్ని వేటాడి కడుపు నింపుకున్న తర్వాత ఏదో ఒక చెట్టు నీడలో పడుకొని హాయిగా నిద్రపోయేది. ఓ సారి అలా పడుకున్నప్పుడు దానికి చెట్టు పైన ఒక తేనెతుట్టె కనిపించింది. అది చూసి దానికి నోరూరింది. తేనె రుచి చూడాలనుకుని ఒక రాయిని తేనెతుట్టె పైకి విసిరింది. రాయి తగలగానే తేనెటీగలు ఝుమ్మంటూ ఎగిరివచ్చి నక్కను చుట్టుముట్టి కుట్టాయి.

అది.. కుయ్యో మొర్రో అనుకుంటూ.. పరిగెత్తుకుంటూ రాజు దగ్గరకు వెళ్లింది. తన ఒంటి మీద దద్దుర్లు చూపిస్తూ.. ‘ప్రభూ, ఈ తేనెటీగలకు బాగా పొగరెక్కింది. చెట్టు కింద నేను పడుకుంటే మంత్రిని అని కూడా చూడకుండా నన్ను ఎడాపెడా కుట్టాయి. ఇప్పుడు నన్ను కుట్టాయి రేపు మిమ్మల్నీ కుట్టవచ్చు. కాబట్టి వీటిని మన రాజ్యం నుంచి బహిష్కరించాలి’ అంటూ ఫిర్యాదు చేసింది.

తేనెటీగలు జరిగిన వాస్తవం చెప్పినా.. సింహం వాటి మాటల్ని వినలేదు. అడవిలో ఉన్న తేనెటీగలన్నింటికీ రాజ్య బహిష్కరణ శిక్ష విధించింది. అప్పుడు పావురం ‘తేనెటీగలు అనవసరంగా ఎవరినీ కుట్టవు ప్రభూ..! వాటిని అడవిలోంచి తరిమెయ్యడం మంచిది కాదు. మన రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే అన్ని రకాల జంతువులు, పక్షులు, కీటకాలు ఇక్కడ ఉండటం అవసరం’ అంటూ హితబోధ చేసినా సింహం పట్టించుకోలేదు.

చేసేదిలేక తేనెటీగలన్నీ సింహపురి సరిహద్దు దాటి అవతలి వైపు ఉన్న చెట్లపైకి వెళ్లిపోయాయి. తన పంతం నెగ్గించుకున్న నక్క విజయగర్వంతో నవ్వుకుంది.

కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు ఏనుగు జబ్బు పడటంతో అడవిని కాపలా కాయలేకపోయింది. ఈ సంగతి పసిగట్టిన పొరుగు రాజ్యంలోని క్రూర జంతువులు హఠాత్తుగా సింహపురిపై దాడి చేశాయి. సాధు జంతువుల్ని చంపి తినసాగాయి. ఏనుగు లేకపోవడంతో స్వయంగా సింహమే శత్రువుల్ని తరిమెయ్యడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు.

అప్పుడు పావురానికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే తేనెటీగలు వలసవెళ్లిన చెట్ల దగ్గరకెళ్లి జరిగినదంతా చెప్పి వాటి సాయం కోరింది. వెంటనే వేలాది తేనెటీగలు ఝుమ్మంటూ బయల్దేరి దాడి చేస్తున్న శత్రు రాజ్యపు జంతువులపై విరుచుకుపడ్డాయి. వాటిని కసిదీరా కుట్టసాగాయి. బాధ భరించలేక ఆ జంతువులు పలాయనం చిత్తగించాయి. మళ్లీ వెనుదిరిగి చూడలేదు.

అప్పుడు సింహానికి జ్ఞానోదయమైంది. తేనెటీగలు అల్పజీవులైనా ప్రకృతి వాటికి గొప్ప శక్తిని ఇచ్చిందని గ్రహించింది. పైగా వాటి వల్లనే పువ్వుల్లో పరపరాగ సంపర్కం జరిగి చెట్లకు ఫలాలు, విత్తనాలు ఏర్పడతాయని కోతి, మృగరాజుకు వివరించింది.

దాంతో సింహం తేనెటీగలకు క్షమాపణలు చెప్పి వాటిని మళ్లీ తన రాజ్యంలోకి ఆహ్వానించింది. తనను తప్పుదారి పట్టించిన మంత్రి నక్కను పదవి నుంచి తొలగించి రాజ్య బహిష్కరణ శిక్ష విధించింది. చేసిన తప్పునకు తనను తాను నిందించుకుంటూ నక్క పక్క అడవిలోకి వెళ్లిపోయింది.

- మహబూబ్‌ బాషా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని