స్వాతంత్య్ర పరిమళం!

అనగనగా ఒక అడవి. దాన్ని మృగరాజు కఠిన నిబంధనలతో పాలిస్తుంది. ఒక రోజు మృగరాజు దగ్గరకు అడవి జంతువులన్నీ వెళ్లాయి. ‘ఎన్నాళ్ల నుంచో మా గుండెల్లో ఓ కోరిక గూడు కట్టుకుని ఉంది. ఆ కోరిక మీరు తీర్చాలి’ అని మృగరాజును అడిగాయి. సింహం నివ్వెర పోయింది. అంతలోనే తేరుకుని ‘తప్పక తీరుస్తాను. రాజుగా అది నా బాధ్యత’ అంది మృగరాజు. మనసులో మాత్రం ఇవి ఏ

Updated : 15 Aug 2021 02:18 IST

నగనగా ఒక అడవి. దాన్ని మృగరాజు కఠిన నిబంధనలతో పాలిస్తుంది. ఒక రోజు మృగరాజు దగ్గరకు అడవి జంతువులన్నీ వెళ్లాయి. ‘ఎన్నాళ్ల నుంచో మా గుండెల్లో ఓ కోరిక గూడు కట్టుకుని ఉంది. ఆ కోరిక మీరు తీర్చాలి’ అని మృగరాజును అడిగాయి. సింహం నివ్వెర పోయింది. అంతలోనే తేరుకుని ‘తప్పక తీరుస్తాను. రాజుగా అది నా బాధ్యత’ అంది మృగరాజు. మనసులో మాత్రం ఇవి ఏ గొంతెమ్మ కోరిక కోరతాయో అని కాస్త సందేహించింది.

అక్కడ జంతువుల్లో ఉన్న ఏనుగు ‘మృగరాజా! మా కోరిక నెరవేర్చలేనిది కాదు. మీరనుకుంటే అదేమంత కష్టమైంది కూడా కాదు. పదిరోజులు మీరీ అడవిలో ఉండొద్దు. మీ పరివారమైన పులులు, తోడేళ్లు, నక్కలను కూడా మీతో తీసుకు వెళ్లాలి. ఆ పది రోజులు స్వేచ్ఛగా మాకు నచ్చిన రీతిలో బతకాలని మాకు ఉంది. స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవించాలని మా కోరిక’ అని విన్నవించుకున్నాయి.

మృగరాజు పరివారం గతుక్కుమంది. సింహాన్ని ఆపడానికి చూశాయి. మృగరాజు వాటికి అవకాశం ఇవ్వకుండా ఎదురుగా ఉన్న జంతువులతో ‘స్వేచ్ఛా స్వాతంత్రాలు పదునైన కత్తిలాంటివి. సద్వినియోగం చేసుకుంటే ఫర్వాలేదు. అలా కాకపోతే బతుకులు గల్లంతవుతాయి. సరే, మీరు కోరారు కాబట్టి, ఆ కోరిక తీర్చుతాను’ అని వెంటనే తన పరివారంతో అడవి పక్కనే ఉన్న లోయలోకి వెళ్లిపోయింది.

ఇక అడవిలోని జంతువులకు పండగే పండగ! ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఆ రోజంతా సంబరం చేసుకుని అలసిపోయి చీకటి పడే వేళ కంటే కాస్త ముందుగానే నిద్రలోకి జారుకున్నాయి. పూర్తిగా ఇంకా తెల్లారలేదు. అడవిలో ఏదో అలికిడి వినిపించింది. జంతువులు తుళ్లిపడి లేచి చూశాయి. ఏనుగులు సరస్సులోని నీటిని తొండాలతో తెచ్చి నీరందని చెట్లకు పోస్తుంటే, ఎలుగుబంట్లు ఆ వాటి చుట్టూ బోదెలు కడుతున్నాయి. మిగతా జంతువులు అది చూసి ముచ్చట పడ్డాయి. వాటికి కూడా అడవి బాగుకు ఏదో చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే చేతనైన పనులు చేయడంలో నిమగ్నమయ్యాయి. కోతులు అడవిలో పేరుకు పోయిన చెత్తను తీసి అడవి పందులు తీసిన గోతుల్లో పాతిపెట్టాయి. ఉడుతలేమో చెట్లు లేని ప్రాంతాల్లో గింజలు తెచ్చి నాటాయి. లేళ్ల సాయంతో కుందేళ్లు పొదలను అందంగా తీర్చిదిద్దాయి. వేటగాళ్లు చొరబడే దారుల్లో ముళ్లపందులు.. ముళ్లకంపలను తెచ్చి పరిచాయి. ఆటపాటలతో జంతువులన్నీ కలిసి అడవిని చక్కదిద్దాయి. అంతలోనే పదిరోజుల గడువు పూర్తైంది.

లోయలో ఉన్న మృగరాజు పదకొండో రోజున అడవికి బయలుదేరింది. ‘కోతులు అడవిని చిందరవందర చేసుంటాయి’ అంది పరివారంలోని నక్క. ‘ఏనుగులు.. చెట్ల కొమ్మలు, రెమ్మలను విరిచేసుంటాయి’ అంది చిరుతపులి. ‘వేటగాళ్లు అడవిలోకి వచ్చి జంతువులను బంధించి తీసుకుపోయారేమో’ అని సందేహం వ్యక్తం చేసింది చిరుతపులి.

‘తినబోతూ రుచులెందుకు? ఎలాగూ వెళ్తున్నాం కదా! ఒక వేళ అవి అడవిని పాడు చేసి ఉంటే మనందరం కలిసి బాగు చేసుకుంటే సరి’ అంది. మాటల్లోనే అవన్నీ అడవికి చేరుకున్నాయి. అడవి ప్రారంభంలో స్వాగత తోరణాల్లా జిరాఫీలు ఏర్పాటు చేసిన పూలతీగలను చూసి నివ్వెరపోయాయి. అక్కడ ఎదురు చూస్తున్న జంతువులు మృగరాజు పరివారాన్ని ఆహ్వానించాయి. సింహం అడవంతా చూసి ముచ్చటపడింది. జంతువులన్నింటిలో ఆనందం పరవళ్లు తొక్కింది. ‘స్వేచ్ఛా స్వాతంత్య్రాలంటే ఏంటో మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఆచరించి కూడా చూపారు. అందరికీ నా అభినందనలు’ అని మృగరాజు జంతువులన్నింటినీ ఎంతో మెచ్చుకుంది. అప్పటి నుంచి అవి ఆ అడవిని మరింత చక్కగా చూసుకున్నాయి.

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని