నిజమైన నేస్తం

అనగనగా ఓ చిన్న అడవి. అందులో ఓ మర్రిచెట్టు కిందున్న పుట్టలో ఒక గుడ్డి పాము నివసించేది. దానికి దగ్గరగా ఒక చెరువు ఉండేది. దానిలో చేపలు, కప్పలు, ఓ తాబేలు ఉండేవి. ఆ పుట్టకు కొద్ది దూరంలోనే కలుగులో ఒక ఎలుక ఉండేది.

Updated : 24 Sep 2021 00:31 IST

నగనగా ఓ చిన్న అడవి. అందులో ఓ మర్రిచెట్టు కిందున్న పుట్టలో ఒక గుడ్డి పాము నివసించేది. దానికి దగ్గరగా ఒక చెరువు ఉండేది. దానిలో చేపలు, కప్పలు, ఓ తాబేలు ఉండేవి. ఆ పుట్టకు కొద్ది దూరంలోనే కలుగులో ఒక ఎలుక ఉండేది.

ఒకసారి ఆ పాము ఎలుకతో ‘మిత్రమా! నాకు నీతో స్నేహం చేయాలని ఉంది’ అని అంది. అప్పుడు ఎలుక ‘నీకు, నాకు స్నేహం ఎలా కుదురుతుంది? మనం ఇద్దరం బద్ధశత్రువులం కదా!’ అని అంది. అప్పుడు పాము ‘స్నేహానికి ఇవేవీ అడ్డురావు. నీకు నేను హాని చేయను. నా మాట నమ్ము. నేను గుడ్డిదాన్ని కనుక నాకు ఆహారం సంపాదించుకోవడం చాలా కష్టంగా ఉంది. అందుకే నువ్వు చెరువులోని కప్పలతో మాటామాటా కలిపి రోజుకు ఒక కప్ప చొప్పున ఆహారంగా నా కోసం తీసుకొనిరా. మిత్రుడికి ఈ మాత్రం సహాయం చేయలేవా?’ అంది.
ఆ మాటలకు కరిగిపోయిన ఎలుక ‘సరే నువ్వన్నట్లే చేస్తా. మిత్రుడు ఆకలితో ఉండగా నేను మాత్రం ఎలా ఉంటాను? ఆ కప్పలను తెచ్చి నీకు అప్పగిస్తాను’ అంది. వెంటనే అది చెరువులోని కప్పలతో మాట కలిపి స్నేహితునిగా నమ్మించింది. అది రోజుకు ఒక కప్పను తన కలుగు దగ్గరకు రమ్మని చెప్పి దాన్ని పట్టుకొని పాముకు అప్పగించేది. కొన్ని రోజులకు చెరువులో కప్పల సంఖ్య తగ్గడం గమనించిన తాబేలు మిగతా కప్పలతో ‘మీ సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. నాకు ఎందుకో ఎలుక మీద అనుమానంగా ఉంది. అది పిలిస్తే మీరు వెళ్లకండి’ అంది. కప్పలన్నీ సరేనన్నాయి.

మరుసటి రోజు ఎప్పటిలానే ఎలుక వచ్చి కప్పలను పిలిచింది. ఒక్క కప్ప కూడా చెరువు బయటకు రాలేదు. అప్పుడు ఎలుక పాము దగ్గరకు వెళ్లి ‘మిత్రమా! ఈ రోజు ఎందుకో కప్పలకు నా పైన అనుమానం వచ్చింది. ఒక్కటి కూడా నా వెంట రాలేదు’ అంది. అప్పుడు పాము తనకు ఏమీ వినబడనట్టు నటించి ‘మిత్రమా! ఏమో అంటున్నావు. కాస్త దగ్గరకు వచ్చి నా చెవిలో చెప్పు’ అంది. దాని మాటలు నమ్మి ఎలుక పాము దగ్గరకు వెళ్లింది. వెంటనే పాము ఆ ఎలుకను తినడానికి పట్టుకుంది.

ఇంతలో ఆ చెట్టు పైన ఉన్న ఒక చిలుక ‘మిత్రమా.. ముంగిసా! ఎప్పుడొచ్చావు! ఇలా రా!’ అని గట్టిగా పాముకు వినబడేటట్లు అంది. ‘ముంగిసా.. ఎక్కడా?’ అని పాము కంగారుగా నోరు తెరిచింది. వెంటనే దాని నోట్లో నుంచి బయటకు దూకిన ఎలుక ‘బతుకు జీవుడా!’ అనుకుంటూ తన కలుగులోకి పారిపోయింది. పాము ముంగిస భయంతో పుట్టలోకి దూరింది.

కాసేపటికి ఆ చిలుక ఎలుక దగ్గరకు వచ్చి ‘ఓ మిత్రమా! నువ్వు చెడ్డవాళ్లతో స్నేహం చేసి ఆపదను కొనితెచ్చుకున్నావు. అప్పట్లో నాతో స్నేహం చేయమంటే చేయనని అన్నావు. పామును నమ్మవద్దని నేను చెప్పినా.. నువ్వు వినలేదు. నేను ముంగిస పేరు గట్టిగా చెప్పకుంటే నీ గతి ఏమై ఉండేది? ఆ పాము ఇప్పటికే నిన్ను తినేసి ఉండేది. అందుకే మంచి వారితో స్నేహం చేయాలి. అది చెప్పినట్లు విని దాని మాటలు నమ్మి అమాయక కప్పలను దానికి బలిచేశావు. అవి నీకు ఏం అపకారం చేశాయి. నమ్మిన వారిని మోసం చేయవచ్చా! నువ్వు నాతో స్నేహాన్ని కాదన్నా.. నేను నువ్వు ఆపదలో ఉన్నావని సహాయం చేశాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో’ అంది.

ఆ మాటలు విని ఎలుక, చిలుకతో ‘ఓ చిలుకా! నువ్వే నిజమైన నేస్తానివి. నీతో స్నేహాన్ని నేను కాదన్నా నువ్వు నాకు ప్రాణదానం చేశావు. అలాగే నాకు ఈ పాము పీడ పూర్తిగా విరగడయ్యేలా చూడు’ అని వేడుకుంది. అలాగేనని చిలుక పాము పుట్ట దగ్గరకు వెళ్లి దానికి వినబడేటట్టు గట్టిగా.. ‘ముంగిసా! నువ్వు ఈ ఎలుక మిత్రుడి దగ్గరకు కూడా రోజూ వచ్చి వెళ్లు’ అని అంది. పాము ఈ మాటలు విని ముంగిస వల్ల తనకు ఇక్కడ రక్షణ లేదని దూరంగా వెళ్లిపోయింది. మళ్లీ అటువైపే రాలేదు.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని