అసలైన దేశభక్తి

జెండా పండగ దగ్గరికి వచ్చేసినా ఇంకా బళ్లు తెరవడం కుదరలేదు. దాంతో సీతంపేట ఊరిలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ బడిలో రాజా, శ్రీను, మోహన్‌, సత్యా, ఈశ్వర్లు ఎప్పుడూ కలిసికట్టుగా ఉండేవారు. అన్ని కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొనేవారు. జెండా పండగ గత కొన్ని సంవత్సరాలుగా ఎంత బాగా చేసేవారో తలచుకుని ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకుని చెప్పుకున్నారు. ఈ జెండా పండగ కూడా బాగా చేసుకోవాలంటే ఏదైనా ఉపాయం ఉందా అని ఆలోచించారు.

Published : 15 Aug 2020 00:27 IST

 

జెండా పండగ దగ్గరికి వచ్చేసినా ఇంకా బళ్లు తెరవడం కుదరలేదు. దాంతో సీతంపేట ఊరిలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ బడిలో రాజా, శ్రీను, మోహన్‌, సత్యా, ఈశ్వర్లు ఎప్పుడూ కలిసికట్టుగా ఉండేవారు. అన్ని కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొనేవారు. జెండా పండగ గత కొన్ని సంవత్సరాలుగా ఎంత బాగా చేసేవారో తలచుకుని ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకుని చెప్పుకున్నారు. ఈ జెండా పండగ కూడా బాగా చేసుకోవాలంటే ఏదైనా ఉపాయం ఉందా అని ఆలోచించారు.

ఒక్కొక్కరూ ఇంట్లో వాళ్ల అమ్మానాన్నలతో, పెద్దవాళ్లతో మాట్లాడారు. అందరిదీ ఒకటే మాట.. కరోనా కదా, ఇక బడిలో ఈ ఏడాది జెండా పండగ కుదరదు అని. పిల్లలందరూ డీలాపడిపోయారు. రాజా ఎప్పుడూ పరుగు పందెంలో ఫస్ట్‌ వచ్చేవాడు. ఈసారి పరుగే లేదని మోహన్‌తో ఫోన్‌లో చెప్పాడు. మోహన్‌ కబడ్డీ బాగా ఆడతాడు.. ఈ సారి ఆ ఆట లేదని వాపోయాడు. డ్రాయింగ్‌ పోటీ లేదని సత్య, సైకిల్‌ రేస్‌ లేదని శ్రీను నీరసపడిపోయారు.

ఇంకో నాలుగు రోజుల్లో జెండా పండగ.. ఇక చేసేది లేక ఎవరి పనుల్లో వాళ్లు పడ్డారు. అంతలో రాజా వాళ్ల మావయ్య రాజాకి ఒక మాట చెప్పారు. పిల్లలందరికీ ఆన్‌లైన్‌లోనే పాఠాలు చెబుతున్నారు కదా... జెండా కూడా అలాగే బడిలో మాస్టర్లు ఎగరేస్తూ ఉంటారు. మీరు వీడియోలో చూడొచ్ఛు ఇదే విషయం మీ బడి మాస్టర్లు చెబుతారేమో అన్నారు.

రాజా వెంటనే వాళ్ల మాస్టారికి ఫోన్‌ చేశాడు. మాస్టారు అదే చేస్తారని చెప్పారు. రాజా ఈ సంగతి మిగతా మిత్రులతో చెప్పాడు. అందరూ ఆనందించారు, కనీసం బడిలో జెండా అయినా చూడొచ్చు అని. శ్రీను వాళ్ల మాస్టారుకి ఫోన్‌ చేసి వాట్సప్‌లో పాటలు, చిత్రలేఖనం వ్యాసరచన, వక్తృత్వ పోటీలు పెట్టాలని చెబితే ఆయన సరే అన్నారు. ఇక అందరూ ఆ సందడిలో పడిపోయారు.

అందరూ అన్ని విషయాలూ ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉన్నారు.. ఒక్క ఈశ్వర్‌తో తప్ఫ ఈశ్వర్‌ వాళ్లది పేద కుటుంబం. అతని ఇంట్లో మామూలు ఫోన్‌ ఉంది. అందువల్ల ఈశ్వర్‌కి వాట్సప్‌లో వస్తున్న బడిలో సంగతులు తెలియలేదు. అసలు వీడియో పాఠాలే వినలేకపోయాడు.

రాజా, సత్య, మోహన్‌, శ్రీను అందరూ అన్ని పోటీల్లో చక్కగా పాల్గొన్నారు. బహుమతులు గెల్చుకున్నారు. మాస్టారు ఈశ్వర్‌ గురించి అడిగితే ఎవరికి వారు తెలియదని చెప్పి ఊరుకున్నారు. ఈశ్వర్‌ చక్కగా పాటలు పాడతాడు. అన్నింటిలోనూ ముందుంటాడు. కానీ ఈసారి వేడుకలకు అవకాశమే లేదు.

ఆగస్టు 15 వచ్చేసింది. ఉదయం బడి మిత్రులందరూ శుభ్రంగా ముస్తాబై ఫోన్లు పట్టుకుని కూర్చున్నారు. వీడియో యాప్‌లో అందరూ కలుసుకుని, ప్రధానోపాధ్యాయులు జెండా ఎగరేయడం చూశారు. జాతీయ గీతం పాడారు, దేశభక్తి గీతాలు ఆలపించారు. వేడుక అంతా ముగిశాక రాజా వాళ్ల మాస్టారు ఉపన్యాసం మొదలుపెట్టారు.

పిల్లలూ... మీలాంటి పిల్లాడి గురించి ఈ రోజు ఒక వీడియో చూశాను. రాత్రి ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అయింది. ఆ పిల్లాడు తన దేశభక్తిని పాటకట్టడం ఎవరో వీడియో తీసి అంతర్జాలంలో పెట్టారు. పత్రికలవాళ్లు, టీవీ వాళ్లు ఇప్పుడు ఆ పిల్లాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయి పాడిన పాట మీరూ వినండి.. అంటూ ఆ వీడియోని బడి సమావేశ మందిరంలో తెర మీద వేశారు.

అంతా నిశ్శబ్దం! ఆ అబ్బాయి ఎవరో కాదు. ఈశ్వర్‌!! పాట పూర్తయ్యాక అందరూ చప్పట్లు కొట్టారు. దేశభక్తి అంటే బహుమతులు తీసుకోవడం, ఆడుకోవడం కాదు. ఎక్కడున్నా, ఎలా ఉన్నా అది గుండెల్లో ఉండాలి... మన ఈశ్వర్‌లాగా అన్నారు. ప్రధానోపాధ్యాయులు వచ్చి ఈశ్వర్‌ పాఠశాలకు పేరు తెచ్చినందుకు అభినందిస్తూ ఆ ఏడాది ఉత్తమ విద్యార్థి పురస్కారం పేరిట నగదు బహుమతి ప్రకటించారు. పిల్లలందరూ మరోసారి చప్పట్లు కొట్టారు.

- కుప్పిలి సుదర్శన్‌,

పాలకొండ, శ్రీకాకుళం జిల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని