Parkinson: వణికించే.. జబ్బమ్మా!

తల, చేతులు, కాళ్లు, దవడ ఒకటే వణుకు. నడక నెమ్మది. మాట నిదానం. కండరాల బిగువు. ఇవి చాలవన్నట్టు క్రమంగా కుంగుబాటు, మతిమరుపు, నిద్ర సమస్యలు, నిస్సత్తువ! మొత్తగా జీవితమే మొద్దుబారిన భావన.

Updated : 11 Apr 2023 03:04 IST

నేడు వరల్డ్‌ పార్కిన్సన్స్‌ డే

తల, చేతులు, కాళ్లు, దవడ ఒకటే వణుకు. నడక నెమ్మది. మాట నిదానం. కండరాల బిగువు. ఇవి చాలవన్నట్టు క్రమంగా కుంగుబాటు, మతిమరుపు, నిద్ర సమస్యలు, నిస్సత్తువ! మొత్తగా జీవితమే మొద్దుబారిన భావన. నాడుల క్షీణతతో తలెత్తే పార్కిన్సన్స్‌ సరిగ్గా ఇలాగే వేధిస్తుంది. ఒకసారి వస్తే చాలు. జీవితాంతం వెంటాడుతుంది. దీన్ని పూర్తిగా నయం చేసే చికిత్సలేవీ లేవు మరి. ఊరట కలిగించే విషయం ఏంటంటే- మందులతో లక్షణాలను అదుపులో ఉంచుకోవటం. ఇప్పుడు ఆధునిక శస్త్రచికిత్సలూ కొంత భరోసా ఇస్తున్నాయి. కానీ ఎంతోమంది సరైన చికిత్సలకు నోచుకోవటం లేదు. వయసు మీద పడుతున్నకొద్దీ చురకుదనం, ఉత్సాహం తగ్గటం సహజమేననే ఆలోచనతో అసలు జబ్బును పోల్చుకోవటంలోనే పొరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘వరల్డ్‌ పార్కిన్సన్స్‌ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

నం చేసే పనులన్నింటినీ మెదడే ఆజమాయిషీ చేస్తుంది. నాడీ కణాల నుంచి అందే సంకేతాల కారణంగానే నడవటం, మాట్లాడటం వంటివన్నీ చేయగలుగుతున్నాం. ఇలాంటి కదలికలను నియంత్రించే నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యే పార్కిన్సన్స్‌ డిసీజ్‌. మెదడులో నాడీ కణాల మధ్య నిరంతరం సమాచారం మార్పిడి అవుతుంటుంది. ఇందుకు కొన్ని వాహకాలు (రసాయనాలు) తోడ్పడతాయి. వీటిల్లో డోపమిన్‌ ఒకటి. ఇది శరీర కదలికలను నియంత్రించే బేసల్‌ గాంగ్లియాలోని సబ్‌స్టాన్షియా నైగ్రా అనే భాగం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇది క్షీణించటమే పార్కిన్సన్స్‌ జబ్బుకు మూలం. నాడీ కణాలు క్షీణించినా, అవి సరిగా పనిచేయకపోయినా డోపమిన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా కదలికల సమస్యలు మొదలవుతాయి. తల, చేతుల వంటి భాగాలు వణకటం.. బిగుసుకు పోవటం, నడక వేగం తగ్గటం, సరిగా మాట్లాడలేకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది శారీరకంగానే కాదు, మానసికంగానూ దెబ్బతీస్తుంది. కుటుంబసభ్యులు, కనిపెట్టుకునేవారికీ చిక్కులు తెచ్చిపెడుతుంది. ముఖ కవళికలను సరిగా వ్యక్తం చేయలేకపోవటం, అర్థం చేసుకోలేకపోవటం వల్ల భావోద్వేగ సమస్యలూ తెచ్చిపెడుతుంది. నాడీ క్షీణతతో ముడిపడిన వాటిల్లో రెండో అతి పెద్ద సమస్య ఇదే. అయినా కూడా మనదేశంలో దీనిపై పెద్దగా అవగాహన లేదు. ఎంతమంది దీంతో బాధపడుతున్నారనే లెక్కలూ కచ్చితంగా లేవు. అరవై ఏళ్లు పైబడినవారిలో సుమారు 10 లక్షల మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. జబ్బు నిర్ధారణ కానివారి సంఖ్య ఇంతకన్నా ఎక్కువే అన్నా అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని లక్షణాలు చాలాసార్లు వృద్ధాప్యంతో ముడిపడి ఉంటుండటమే. నడక వేగం తగ్గటం, మాట తత్తరపోవటం, హుషారుగా లేకపోవటం వంటివన్నీ వృద్ధాప్య లక్షణాలని పొరపడేలా చేస్తుంటాయి. రోజురోజుకీ జీవనకాలం పెరుగుతుండటం, వృద్ధుల సంఖ్య ఎక్కువయ్యే అవకాశముండటం వల్ల మున్ముందు పార్కిన్సన్స్‌ రెట్టింపు కావొచ్చనీ అనుకుంటున్నారు. కాబట్టి దీనిపై సరైన అవగాహన కలిగుండటం ఎంతైనా అవసరం.


ఎవరికి, ఎందుకొస్తుంది?

పార్కిన్సన్స్‌ జబ్బు ఎవరికైనా రావొచ్చు. ఇది ఆడవారిలో కన్నా మగవారిలో ఎక్కువ. ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. అన్నింటికన్నా ముఖ్యమైన కారణం వయసు మీద పడటం. చాలామంది 60 ఏళ్లు దాటిన తర్వాతే దీని బారినపడుతుంటారు. అయితే సుమారు 5-10% మందిలో 50ల్లోపే మొదలవుతుంటుంది. దీనికి జన్యుపరమైన అంశాలూ దోహదం చేస్తుంటాయి. చిన్న వయసులో వచ్చినా, అప్పటికే కుటుంబంలో ఎవరైనా పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నా జన్యుపరమైన అంశాలు కారణమై ఉండొచ్చని భావించొచ్చు. పురుగు మందులు, కాలుష్య కారకాల వంటివీ దీనికి దోహదం చేస్తుండొచ్చు. విటమిన్‌ డి లోపమూ ఒక కారణమేనన్న భావన ఇటీవల బలపడుతోంది. జన్యుపరంగా పార్కిన్సన్స్‌ వచ్చే అవకాశం గలవారికి కాలుష్యం వంటి పర్యావరణ అంశాలూ తోడైతే ముప్పు మరింత పెరిగే ప్రమాదముంది.  


పార్కిన్సో నిజమ్‌లో భాగం

పార్కిన్సన్స్‌ ఒక్కటే కాదు. కదలికలు నెమ్మదించటానికి కారణమయ్యే నాడీ క్షీణత సమస్యలు చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి పార్కిన్సోనిజమ్‌ అంటారు. పార్కిన్సన్స్‌ జబ్బు వీటిల్లో ఒక భాగమే. కానీ పార్కిన్సోనిజమ్‌, పార్కిన్సన్స్‌ జబ్బు ఒకటి కావు. మల్టీసిస్టమ్‌ ఎట్రోఫీ, లీవీ బాడీ డిమెన్షియా, కార్టికోబేసల్‌ డీజనరేషన్‌, ప్రోగ్రెసివ్‌ సుప్రాన్యూక్లియర్‌ పాల్సీ వంటివి పార్కిన్సోనిజిమ్‌లో కొన్ని రకాలు. పార్కిన్సన్స్‌లో మాదిరిగా కాకుండా ఇలాంటి సమస్యల్లో లక్షణాలు చాలా త్వరగా మొదలవుతాయి. తీవ్రంగానూ ఉంటాయి. మెదడుకు దెబ్బలు తగలటమూ పార్కిన్సోజిమ్‌కు దారితీయొచ్చు. మెదడులో కణితులు, సబ్‌డ్యూరల్‌ హెమటోమా, పక్షవాతం వంటివీ పార్కిన్సోనిజిమ్‌ మాదిరిగా కనిపించొచ్చు. అల్జీమర్స్‌, హటింగ్టన్‌ డిసీజ్‌ వంటి మెదడు సమస్యల్లో సైతం పార్కిన్సోనిజిమ్‌ లక్షణాలు కలిసి ఉండొచ్చు. కారణమేదైనప్పటికీ ఇవన్నీ మెదడులో డోపమిన్‌ పనితీరును అస్తవ్యస్తం చేస్తాయి. మెటాక్లోప్రమైడ్‌, టెట్రాబెనజీన్‌, వాల్‌ప్రోయిక్‌ యాసిడ్‌, లివోసల్ఫోరైడ్‌ వంటి మందులూ డోపమిన్‌ గ్రాహకాల పనితీరును అస్తవ్యస్తం చేయొచ్చు. హెచ్‌ఐవీ వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతోనూ పార్కిన్సన్స్‌ మాదిరి లక్షణాలు పొడసూపొచ్చు. కాబట్టి పార్కిన్సన్స్‌ నిర్ధారణలో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.


లక్షణాలు  వణుకు, బిగువు నిదానం ప్రధానం

పార్కిన్సన్స్‌ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని లక్షణాలు కొందరిలో త్వరగా మొదలైతే, మరికొందరిలో నెమ్మదిగా మొదలవ్వచ్చు. కొన్నిసార్లు దీని లక్షణాలు స్వల్పంగా ఉండొచ్చు. నెలలు దాటినా పోల్చుకోలేక పోవచ్చు. కొందరికి లక్షణాలు శరీరంలో ఒకవైపుననే ఉంటే.. కొందరికి రెండు వైపులా ఉండొచ్చు. చాలావరుకు ముందు ఒక వైపున మొదలై.. క్రమంగా రెండో వైపున తీవ్రమవుతుంటాయి. అందరిలో అన్ని లక్షణాలూ ఉండాలనేమీ లేదు కూడా. ముఖ్యమైన లక్షణాలు ఇవీ..

* వణుకు: ప్రధాన లక్షణం ఇదే. పార్కిన్సన్స్‌ బాధితుల్లో సుమారు 75% మందిలో వణుకు కనిపిస్తుంది. చేతులు, కాళ్లు, దవడ, తల వంటి భాగాలు వణుకుతుంటాయి. సాధారణంగా చేతుల్లో వణుకు మొదలవుతుంది. కొన్నిసార్లు పాదం, దవడల్లోనూ ప్రారంభం కావొచ్చు. పనులు చేస్తున్నప్పుడు కాకుండా విశ్రాంతి తీసుకునేటప్పుడు వణకటం దీని ప్రత్యేకత. ఆరంభంలో ఇది శరీరంలో ఒకవైపున ఎక్కువగా కనిపిస్తుంటుంది. శారీరక, మానసిక ఒత్తిడితో వణుకు మరింత ఎక్కువవుతుంది.


* బిగువు: శరీర కదలికలు సాఫీగా సాగాలంటే అవతలి వైపు కండరాలూ వదులు కావటం, సంకోచించటం తప్పనిసరి. కానీ పార్కిన్సన్స్‌ బాధితుల్లు వీటి మధ్య సమన్వయం కొరవడుతుంది. చేతులు, మొండెం బిగుతుగా, సంకోచించినట్టు అవుతుంది. ఫలితంగా నొప్పి, బిగువు, బలహీనత, హఠాత్తుగా అదిరినట్టు కదలటం వంటివి తలెత్తుతాయి.


* నిదానం: ఇది బాగా చికాకు పెట్టే లక్షణం. అనూహ్యంగా కదలికలు నెమ్మదించటం వల్ల పనుల్లో వేగం తగ్గుతుంది. దుస్తులు వేసుకోవటం వంటి తేలికైన పనులకూ చాలా సమయం పడుతుంటుంది.


* సమన్వయం కొరవడటం: శరీర నియంత్రణ కొరవడటం, బ్యాలెన్స్‌ తప్పటం మరో లక్షణం. కొందరు ముందుకు వంగిపోయినట్టు కనిపిస్తారు. ఇవి క్రమంగా ఎక్కువవుతూ వస్తుంటాయి. ఫలితంగా నడవటం, మాట్లాడటం వంటి పనుల్లో ఇబ్బంది పడుతుంటారు. అప్పటివరకూ తేలికగా చేసిన పనులే కష్టమవుతాయి. బ్యాలెన్స్‌ తప్పటం వల్ల కొందరికి కింద పడిపోయే ముప్పూ పొంచి ఉంటుంది. చాలావరకిది జబ్బు ముదిరిన తర్వాతే కనిపిస్తుంది.


ఇతర లక్షణాలు

* కుంగుబాటు (డిప్రెషన్‌): జబ్బు ఆరంభమైన మొదట్లో భావోద్వేగ మార్పులు, కుంగుబాటు తరచూ కనిపిస్తుంటాయి.  
* మతిమరుపు: పార్కిన్సన్స్‌ బాధితుల్లో క్రమంగా జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. అయితే కొన్నిరకాల పార్కిన్సోనిజమ్‌లో (డీఎల్‌బీడీలో) త్వరగా మతిమరుపు వచ్చేస్తుంది.  
* మింగటంలో ఇబ్బంది: జబ్బు బాగా ముదిరినవారిలో గొంతు కండరాల సామర్థ్యం తగ్గుతుంది. దీంతో ఆహారం నమలటం, మింగటం కష్టమవుతుంది.  
* స్తంభించటం: తీవ్ర పార్కిన్సన్స్‌లో తాత్కాలికంగా ఉన్నట్టుండి కదలికలు పూర్తిగా ఆగిపోవచ్చు.  
* మాట మార్పు: మాట తడబడటం, వాడిన పదాలనే వాడటం, మాట్లాడటానికి ఇష్టం చూపకపోవటం, మృదువుగా లేదా పీలగా మాట్లాడటం వంటివి తలెత్తొచ్చు.
* వాసన తగ్గటం: కొందరికి వాసన కూడా తగ్గొచ్చు. నిజానికిది పార్కిన్సన్స్‌ తొలి సంకేతం కూడా కావొచ్చు.
* విసర్జన సమస్యలు: కొందరికి మూత్ర విసర్జన సమస్యలు తలెత్తుతాయి. కొందరికి మలబద్ధకం రావొచ్చు.
* నిద్ర సమస్యలు: కంటి నిండా నిద్ర పట్టకపోవటం, పీడకలలు, మెలకువ రావటం వంటి ఇబ్బందులూ వేధించొచ్చు.  
* ముఖ కవళికల మార్పు: ముఖ కవళికలు తగ్గిపోవచ్చు. దీంతో భావాలను సరిగా వ్యక్తం చేయలేరు.  
* చేతి రాత మార్పు: డోపమిన్‌ లోపం, అస్తవ్యస్త కదలికల మూలంగా చేతి రాత మారొచ్చు. అక్షరాలు చిన్నగా, గజిబిజిగా రాస్తారు.


నిర్ధారణ లక్షణాలే ముఖ్యం

పార్కిన్సన్స్‌ నిర్ధారణకు రక్త పరీక్షల వంటివేవీ లేవు. లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి? ఎలా ఉన్నాయి? ఎంత తీవ్రంగా ఉన్నాయి? అనే వాటిని బట్టే జబ్బును నిర్ధారిస్తారు. మందుల ఆరంభించిన తర్వాత లక్షణాలు తగ్గుముఖం పట్టినా జబ్బు ఉన్నట్టుగా పరిగణిస్తారు. అయితే నాడీ క్షీణతతో ముడిపడిన చాలా సమస్యల్లోనూ పార్కిన్సన్స్‌ లక్షణాలు ఉండొచ్చు. అందువల్ల నిశిత పరిశీలన ముఖ్యం. మొదట్లోనే మందులతో ఫలితం కనిపించకపోయినా, మింగటం కష్టమవుతున్నా.. లక్షణాలు మొదలైన ఐదేళ్లలోపే చక్రాల కుర్చీకి పరిమితమైనా, ఊపిరి తీసుకోవటం కష్టమైనా, కూర్చుని లేచినప్పుడు రక్తపోటు పడిపోతున్నా, మూత్ర విసర్జనకు ఇబ్బంది పడుతున్నా.. జబ్బు మొదలైన మూడేళ్లలోనే తరచూ పడిపోతున్నా పార్కిన్సోనిజమేమోనని అనుమానించాలి. ఇన్‌ఫెక్షన్లు, ఇతరత్రా మందులు కారణమవుతున్నాయేమో కూడా చూడాలి. ఇలా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని పార్కిన్సన్స్‌ను విశ్లేషించాల్సి ఉంటుంది. 

* అవసరాన్ని బట్టి స్కాన్‌ పరీక్షలు చేస్తారు. ఎంఆర్‌ఐతో పక్షవాతం, కణితుల వంటివి బయటపడతాయి. సీటీ స్కాన్‌లో సబ్‌డ్యూరల్‌ హెమటోమా వంటివి తెలుస్తాయి. ఇప్పుడు పార్కిన్సన్స్‌ నిర్ధారణకు డోపా పెట్‌ స్కాన్‌, ఎఫ్‌డీజీ బ్రెయిన్‌, ఎఫ్‌డోపా పెట్‌ స్కాన్‌ పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. 

* కుటుంబంలో ఎక్కువ మందికి ఈ సమస్య ఉన్నా, చిన్న వయసులోనే పార్కిన్సన్స్‌ వచ్చినా జన్యు పరీక్ష అవసరమవుతుంది.


చికిత్స డోపమిన్‌ భర్తీ కీలకం

ప్రస్తుతానికి పార్కిన్సన్స్‌ను నయం చేసే చికిత్స ఏదీ లేదు. కానీ మందులతో లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైంది రోజువారీ జీవితం హాయిగా గడిపేలా చూడటం. ఇందుకు లివోడోపా బాగానే ఉపయోగపడుతుంది. దీని సాయంతో నాడీ కణాలు డోపమిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో మెదడుకు తగినంత డోపమిన్‌ అందుతుంది. అయితే లెవోడోపాతో వాంతి, వికారం, రక్తపోటు తగ్గటం, చిరచిర వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. వీటిని తగ్గించటానికి కార్బిడోపాను కలిపి ఇస్తారు. మాత్ర ఎన్ని గంటలు పనిచేస్తుందనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. బిగుసుకుపోవటం, నిదానం, వణుకు వంటివి మొదలైతే తిరిగి మాత్ర వేసుకోవాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా వేసుకోవాలి. డాక్టర్‌కు చెప్పకుండా ఆపేయ్యొద్దు. హఠాత్తుగా ఆపేస్తే తీవ్ర సమస్యలు తలెత్తొచ్చు.
ఇతర మందుల్లో- డోపమిన్‌ ఉత్పత్తిని ప్రేరేపించే డోపమిన్‌ ఆగోనిస్ట్‌ రకం మందులు కూడా ఉపయోగపడతాయి. మావో-బి ఇన్‌హిబిటార్స్‌, సీవోఎంటీ ఇన్‌హిబిటార్స్‌ వంటి ఎంజైమ్‌ నిరోధకాలూ మేలు చేస్తాయి. ఇవి మెదడులో డోపమిన్‌ను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌ల పనితీరును నెమ్మదింపజేస్తాయి. దీంతో డోపమిన్‌ మోతాదులు పెరుగుతాయి. అసంకల్పిత కదలికలను ఆపటానికి ఎమాంటడిన్‌.. వణుకు, కండరాల బిగువు తగ్గటానికి యాంటీకొలనెర్జిక్‌ మందులు ఉపయోగపడతాయి.
* ఎపోమార్ఫిన్‌: లివోడోపా కొందరికి అరగంట వరకూ పనిచేయదు. కొందరిలో హఠాత్తుగా కదలికలు ఆగిపోయి, స్తంభించిపోతుంటారు కూడా. వీరికి ఎపోమార్ఫిన్‌ ఇంజెక్షన్‌ ఉపయోగపడుతుంది. దీంతో త్వరగా కదలికలు వస్తాయి. ఇప్పుడు ఎపోమార్ఫిన్‌ను క్రమంగా విడుదల చేసే పంప్‌లూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి చర్మం కింది నుంచి మందును విడుదల చేస్తాయి.


సర్జరీ డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌

మందులతో దుష్ప్రభావాలు ఎక్కువైనవారికి డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ సర్జరీ సూచిస్తారు. మెదడులో ఆయా భాగాల్లో ఎలక్ట్రోడ్లను అమర్చటం దీనిలోని కీలకాంశం. వీటిని ఛాతీ వద్ద అమర్చే చిన్న ఎలక్ట్రిక్‌ పరికరానికి అనుసంధానం చేస్తారు. ఇవి ఆయా కదలికలను నియంత్రించే భాగాలను నొప్పి లేకుండా ప్రేరేపిస్తాయి. ఫలితంగా వణుకు, నిదానం, బిగువు తగ్గుతాయి.
* లివోడోపా, కార్బిడోపాను జెల్‌ రూపంలో నేరుగా ఆంత్రమూలంలోకి విడుదల చేసే పంప్‌లను అమర్చే విధానమూ అందుబాటులోకి వచ్చింది. ఎండోస్కోప్‌ పద్ధతిలో వీటిని అమరుస్తారు.

ఇతర చికిత్సలు

* పార్కిన్సన్స్‌లో ఫిజియోథెరపీ కూడా ముఖ్యమే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం తప్పనిసరి. ముఖ్యంగా కండరాలను సాగదీసే వ్యాయామాలు మేలు చేస్తాయి. కొందరికి స్పీచ్‌థెరపీ కూడా అవసరమవుతుంది. మర్దనతో బిగువు తగ్గేలా చేయొచ్చు. కండరాలు సాగటానికి, తేలికగా కదలటానికి యోగాసనాలు కూడా బాగా ఉపయోగపడతాయి.


కౌన్సెలింగ్‌ ముఖ్యం

పార్కిన్సన్స్‌ జీవితాంతం వెంటాడే సమస్య. క్రమంగా, నెమ్మదిగా ఎక్కువవుతూ వస్తుంటుంది. జబ్బు ఉన్నట్టు తెలియగానే కొందరు ఆందోళన పడొచ్చు. కుంగుబాటుకూ లోనవ్వచ్చు. కాబట్టి జబ్బు తీరుతెన్నులు, చికిత్సలను క్షుణ్నంగా, అర్థమయ్యేలా వివరించటం చాలా ముఖ్యం. లేకపోతే మరింత గాబారా పడే ప్రమాదముంది. పార్కిన్సన్స్‌ బారినపడ్డవారికే కాదు.. ఇంట్లో వీరిని కనిపెట్టుకునేవారికీ కౌన్సెలింగ్‌ అవసరం. మందులతో పాటు జీవనశైలి విషయంలో జాగ్రత్తలు పాటించటమూ ముఖ్యమే.  
* వేళకు మందులు వేసుకోవటం ముఖ్యం. సరైన సమయానికి భోజనం తినాలి. కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినాలి. జబ్బు ముదురుతున్నకొద్దీ బరువు తగ్గే అవకాశముంది. కాబట్టి మంచి పోషకాహారం అవసరం. అవసరమైతే విటమిన్‌ మాత్రలూ వేసుకోవాలి.
* ఒంటరిగా ఉంటే ఆందోళన, కుంగుబాటు మరింత ఎక్కువవుతాయి కాబట్టి నలుగురితో కలిసేలా చూసుకోవాలి.
* హఠాత్తుగా లేస్తే రక్తపోటు పడిపోవచ్చు. జబ్బు ముదురుతున్నకొద్దీ తూలిపోయే ముప్పూ పెరుగుతుంది. కాబట్టి పడక మీది నుంచి గానీ కుర్చీలోంచి గానీ నిదానంగా లేవాలి.
* రాత్రిపూట బాత్రూమ్‌కు వెళ్లే దారిలో, బాత్రూమ్‌లో లైటు వెలిగేలా చూసుకోవాలి. చేత్తో పట్టుకోవటానికి వీలుగా గోడలకు రెయిలింగ్‌ పట్టీలు బిగించుకోవాలి. నేల పొడిగా ఉండేలా, మ్యాట్లు జారిపోకుండా చూసుకోవాలి.
* విసర్జన సమయంలో గట్టిగా ముక్కొద్దు. మలబద్ధకం తలెత్తకుండా తగినంత పీచు, ద్రవాలు తీసుకోవాలి.
* మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలుంటే మందులు వాడుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలి.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని