Corona: మళ్లీ కొవిడా?

సమస్య: నాకు 42 ఏళ్లు. ఫిబ్రవరిలో కొవిడ్‌ వచ్చి తగ్గిపోయింది. మార్చిలో మొదటి మోతాదు, ఏప్రిల్‌లో రెండో మోతాదు టీకా తీసుకున్నాను. ఇప్పుడు నాకు రోజూ కొంచెం చలి పెట్టినట్టు, కళ్లు మండినట్టు, కాళ్లు చేతులు వణికినట్టు అనిపిస్తోంది. నీరసం, కాస్త ఒళ్లు నొప్పులు, కొద్దిగా జ్వరం ఉంటున్నాయి.

Updated : 18 May 2021 07:16 IST

సమస్య: నాకు 42 ఏళ్లు. ఫిబ్రవరిలో కొవిడ్‌ వచ్చి తగ్గిపోయింది. మార్చిలో మొదటి మోతాదు, ఏప్రిల్‌లో రెండో మోతాదు టీకా తీసుకున్నాను. ఇప్పుడు నాకు రోజూ కొంచెం చలి పెట్టినట్టు, కళ్లు మండినట్టు, కాళ్లు చేతులు వణికినట్టు అనిపిస్తోంది. నీరసం, కాస్త ఒళ్లు నొప్పులు, కొద్దిగా జ్వరం ఉంటున్నాయి. కొవిడ్‌ తగ్గినప్పటి నుంచీ అప్పుడప్పుడు ఇలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. దీనికి కారణమేంటి? నాకు మళ్లీ కొవిడ్‌ వచ్చిందా? ఇప్పుడు నేనేం చేయాలి? నాకు అధిక రక్తపోటు, మధుమేహం ఏమీ లేవు.        

- ఎల్‌.శ్రీధర్‌, కామారెడ్డి

సలహా: సాధారణంగా కొవిడ్‌ తగ్గాక 6-8 వారాల తర్వాతే టీకా వేయించుకోవాలి. తాజా మార్గదర్శకాల ప్రకారమైతే 6 నెలల వరకు ఆగాలి. కానీ మీరు నెలకే తీసుకున్నారు. తగినంత సమయం ఇవ్వకుండా త్వరగా టీకా తీసుకున్నట్టయితే రోగనిరోధకశక్తి మరింత ఉత్తేజితమవుతుంది. దీంతో జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు ఎక్కువయ్యే అవకాశముంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీకు కొవిడ్‌ అనుమానిత లక్షణాలే కనిపిస్తున్నాయి కాబట్టి వెంటనే పరీక్ష చేయించుకోవటం ముఖ్యం. టీకా తీసుకున్నంత మాత్రాన ఇన్‌ఫెక్షన్‌ రాదని అనుకోవటానికి లేదు. కొందరికి మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. కొవిడ్‌ పాజిటివ్‌గా ఉంటే తగు చికిత్స తీసుకోవాలి. నెగెటివ్‌గా వస్తే మీకు తలెత్తిన లక్షణాలను కొవిడ్‌ అనంతర పరిణామాలుగా భావించాలి.  పోషకాహారం తీసుకోవటం.. వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయటం ద్వారా ఇవి త్వరగా తగ్గేలా చూసుకోవచ్చు. జ్వరంలాగా ఉండటం వేరు. జ్వరం రావటం వేరు. మీరు థర్మామీటరుతో పరీక్షించుకొని నిజంగా జ్వరం వస్తోందా? లేదా? అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మధుమేహం లేదని రాశారు గానీ ఇటీవల గ్లూకోజు పరీక్ష చేయించుకున్నారో లేదో తెలియజేయలేదు. మీరు గ్లూకోజు మోతాదులను పరీక్షించుకోవటం మంచిది. గతంలో మధుమేహం లేకపోయినా 10-12% మందికి కొవిడ్‌ తగ్గాక మధుమేహం వచ్చే ఆస్కారముంది. చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు వాడి ఉండొచ్చు. ఇవి రక్తంలో గ్లూకోజు పెరిగేలా చేస్తాయి. కరోనా వైరస్‌ సైతం కొత్తగా మధుమేహానికి దారితీయొచ్చు. మధుమేహం మూలంగానూ కాళ్లనొప్పులు, నీరసం, బలహీనత వంటివి వేధించొచ్చు. గ్లూకోజు ఎక్కువగా ఉంటే తగు చికిత్స తీసుకుంటే ఇబ్బందులు తగ్గిపోతాయి. కొవిడ్‌ నెగెటివ్‌గా ఉండి, మధుమేహం లేకపోతే డాక్టర్‌ సలహా మేరకు ఐదు రోజులు యాంటీబయోటిక్‌, ప్యారాసిటమాల్‌ వంటివి వాడుకుంటే సరిపోతుంది. ఓ నెల జింక్‌, విటమిన్‌ సి, విటమిన్‌ డి మాత్రలు వేసుకోవాలి. ఇవి రోగనిరోధకశక్తి పుంజుకోవటానికి తోడ్పడతాయి.


- డా।। మహబూబ్‌ ఖాన్‌ సీనియర్‌ పల్మనాలజిస్ట్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని