Coronavaccine: కిడ్నీజబ్బులుంటే టీకా తీసుకోవచ్చా?

కిడ్నీ జబ్బులున్నవారు, కిడ్నీ విఫలమైన వారు, పుట్టుకతో ఒక కిడ్నీ గలవారు, ఒక కిడ్నీని తీసేయాల్సి వచ్చిన వారు, కిడ్నీ దానం చేసినవారు, కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారు,....

Updated : 25 May 2021 07:12 IST

సమస్య సలహా

సమస్య: కిడ్నీ జబ్బులున్నవారు, కిడ్నీ విఫలమైన వారు, పుట్టుకతో ఒక కిడ్నీ గలవారు, ఒక కిడ్నీని తీసేయాల్సి వచ్చిన వారు, కిడ్నీ దానం చేసినవారు, కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారు, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారు కరోనా టీకా తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

- నాగేశ్వరరావు, కెనడా

సలహా: తప్పకుండా తీసుకోవాలి. టీకా తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. ఎలాంటి భయాలూ అక్కర్లేదు. కిడ్నీజబ్బులు గలవారికి, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి  రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. దీంతో కొవిడ్‌-19 బారినపడే ముప్పు పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తితే అది జబ్బుగా, తీవ్రంగా మారే ప్రమాదమూ ఎక్కువే. అప్పుడు వీరికి చికిత్స చేయటమూ కష్టమే. కొవిడ్‌-19 తీవ్రమైనవారికి స్టిరాయిడ్లు వాడాల్సి వస్తోంది. వీటితో రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. దీంతో కిడ్నీలు మరింత దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల ముందే టీకా తీసుకోవటం మంచిది. ఇది ఇన్‌ఫెక్షన్‌ నివారణకే కాదు, జబ్బు తీవ్రంగా మారకుండానూ కాపాడుతుంది. ఇక ఒక కిడ్నీ గలవారికి రెండు కిడ్నీలు ఉన్నవారిలో మాదిరిగా అదనపు రక్షణ ఉండదు. నిజానికి పుట్టుకతోనే ఒక కిడ్నీ గలవారిలో చాలామందికి ఆ విషయమే తెలియదు. ఇతరత్రా జబ్బుల పరీక్షల కోసం వెళ్తే బయటపడుతుంటుంది. ఇలాంటివాళ్లు ఆరోగ్యంగానే ఉండొచ్చు. పైకి ఎలాంటి ఇబ్బందులూ లేకపోవచ్చు. కానీ ఏదైనా సమస్య ముంచుకొచ్చినప్పుడు రెండో కిడ్నీతో లభించే రక్షణ కొరవడుతుంది. ఆయా సమస్యలను తట్టుకునే శక్తీ అంతగా ఉండకపోవచ్చు. అందువల్ల నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా టీకా తీసుకోవటమే ఉత్తమం.

సమస్యలు పంపాల్సిన చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@enadu.com


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని