యాంటీబాడీలకూ లొంగని విధంగా..

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవీ2 రోజుకో కొత్తరూపు ధరిస్తోంది. రోజుకో కొత్త కలవరం కలిగిస్తోంది. ఇప్పటివరకూ ఇన్‌ఫెక్షన్‌ బారినపడితే యాంటీబాడీలు పుట్టుకొస్తాయి కదా. ఇక కొంతకాలం వరకు కరోనా వైరస్‌ గురించి పెద్దగా భయపడాల్సిన పనుండదనే అనుకుంటున్నాం.

Published : 27 Apr 2021 01:23 IST

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవీ2 రోజుకో కొత్తరూపు ధరిస్తోంది. రోజుకో కొత్త కలవరం కలిగిస్తోంది. ఇప్పటివరకూ ఇన్‌ఫెక్షన్‌ బారినపడితే యాంటీబాడీలు పుట్టుకొస్తాయి కదా. ఇక కొంతకాలం వరకు కరోనా వైరస్‌ గురించి పెద్దగా భయపడాల్సిన పనుండదనే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడిది యాంటీబాడీలకూ లొంగని విధంగానూ మారుతున్నట్టు టెక్సాస్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించటం మరింత ఆందోళనకర విషయం. దీని పేరు బివి-1. బ్రెజోస్‌ వ్యాలీలో తొలిసారి కనుగొనటం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. రోజువారీ నిర్వహించే ముందస్తు పరీక్షల్లో భాగంగా ఒక మాదిరి లక్షణాలు గల ఓ విద్యార్థి లాలాజలం నమూనాలో ఇది బయటపడింది. ఆ విద్యార్థికి మార్చి 5న కరోనా పరీక్ష పాజిటివ్‌గా తేలింది. మార్చి 25న కూడా పాజిటివ్‌గానే ఉంది. ఏప్రిల్‌ 2 నాటికి లక్షణాలు తగ్గిపోయాయి. ఏప్రిల్‌ 9న చేసిన మూడో పరీక్షలో నెగెటివ్‌గా తేలింది. అంటే చిన్న వయసు వారిలో కొత్త రకం వైరస్‌ ఎక్కువ రోజుల పాటు ఇన్‌ఫెక్షన్‌ కలగజేయగలదనే ఇది సూచిస్తోందన్నమాట. ప్రస్తుతానికి ఈ వైరస్‌ రకం గురించి పూర్తిగా తెలియదు గానీ అంతర్జాతీయంగా గుర్తించిన ఇతరత్రా వైరస్‌ రకాల్లో తలెత్తిన జన్యు మార్పుల మాదిరి సంయోగాలు ఇందులోనూ కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వేగంగా వ్యాపించటం, తీవ్రమైన జబ్బు కలగజేసే స్వభావంతో పాటు వైరస్‌ను నేరుగా నిర్మూలించే న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలను గట్టిగా ఎదుర్కొనే గుణంతో కూడిన జన్యు సంకేతాలన్నీ ఇది కలిగుందని వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని