కొవిడ్‌ పోరులో యాంటీబాడీల అండ

శత్రువుతో పోరాడుతున్నాం. మన బలం చాలటం లేదు. మరో వైపు శత్రువు బలం పెరుగుతోంది. అలాంటి స్థితిలో ఏదైనా సైనిక పటాలం వచ్చి, అండగా నిలిస్తే? కొండంత బలం వస్తుంది. శత్రువును తుదముట్టించటం తేలికవుతుంది. కొవిడ్‌-19 పోరాటంలో మోనోక్లోనల్‌ యాంటీబాడీలు అలాంటి భరోసానే ఇస్తున్నాయి.

Updated : 29 Jun 2021 02:07 IST

శత్రువుతో పోరాడుతున్నాం. మన బలం చాలటం లేదు. మరో వైపు శత్రువు బలం పెరుగుతోంది. అలాంటి స్థితిలో ఏదైనా సైనిక పటాలం వచ్చి, అండగా నిలిస్తే? కొండంత బలం వస్తుంది. శత్రువును తుదముట్టించటం తేలికవుతుంది. కొవిడ్‌-19 పోరాటంలో మోనోక్లోనల్‌ యాంటీబాడీలు అలాంటి భరోసానే ఇస్తున్నాయి.

రోనా జబ్బు ఒక్కొక్కరిని ఒకోలా వేధిస్తోంది. కొందరిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, అసలు జబ్బు వచ్చిన సంగతే తెలియకుండా నయమైపోతోంది. కొందరిని ఒక మాదిరిగా వేధిస్తే.. మరి కొందరికి తీవ్రంగా పరిణమించి, ప్రాణాల మీదికి తెస్తోంది. ఎవరికి మామూలుగా తగ్గుతుందో, ఎవరికి తీవ్రంగా మారుతుందో తెలియదు. కాబట్టి జబ్బు తీవ్రమయ్యే ముప్పు గలవారి విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. లేకపోతే పరిస్థితి వేగంగా దిగజారొచ్చు. శ్వాస తీసుకోవటం మరీ కష్టమైతే వెంటిలేటర్‌ అమర్చాల్సి రావొచ్చు. దుష్ప్రభావాలు ఎక్కువ కావొచ్చు. పరిస్థితి మరీ విషమిస్తే ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. వీటిని నివారించే దిశగా మోనోక్లోనల్‌ యాంటీబాడీలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. కాకపోతే ఎవరికి? ఎప్పుడు? ఇవ్వాలన్నదే కీలకం. జబ్బు తీవ్రమయ్యే ముప్పు ఎక్కువగా గలవారికి వీటిని తొలిదశలోనే ఇస్తే ఆసుపత్రిలో చేరాల్సిన, అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం తగ్గుతున్నట్టు అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొంటుండటం విశేషం. మన అనుభవాలూ ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. అందువల్ల వీటి విషయంలో అవగాహన అవసరం.

మోనోక్లోనల్‌ యాంటీబాడీలంటే?

ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి మన శరీరం సహజంగానే యాంటీబాడీలను సృష్టించుకుంటుంది. మోనోక్లోనల్‌ యాంటీబాడీలు కూడా ఇలాంటివే. కాకపోతే ఇవి ప్రయోగశాలలో తయారుచేసినవి. కృత్రిమమైనవే అయినా సహజ యాంటీబాడీల మాదిరిగానే పనిచేస్తాయి. కొవిడ్‌-19 చికిత్స కోసం ప్రత్యేకంగా తయారుచేసిన యాంటీబాడీల మిశ్రమాన్ని అప్పట్లో అమెరికా అధ్యక్షుడికి ఇవ్వటం, అది మంచి ఫలితం ఇవ్వటం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మనదగ్గర కూడా అత్యవసర చికిత్సగా దీన్ని వాడుతూ వస్తున్నాం.


ఎలా తయారు చేస్తారు?

ముందుగా కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారి రక్తాన్ని సేకరించి, దానిలోంచి యాంటీ బాడీలను వేరు చేస్తారు. అనంతరం ప్రయోగశాలలో వృద్ధి (క్లోన్‌) చేసి, బాగా శుద్ధి చేస్తారు. వీటిని అవసరమైనవారికి సెలైన్‌ ద్వారా ఇస్తారు.


ఎలా పనిచేస్తాయి?

సాధారణంగా వైరస్‌లో ఏదో ఒక భాగాన్ని ఎదుర్కొనేలా మోనోక్లోనల్‌ యాంటీబాడీలను రూపొందిస్తుంటారు. ఉదాహరణకు- కొన్ని యాంటీబాడీలు సార్స్‌-కొవీ2 కొమ్ముల మీద దాడిచేస్తాయి. మరికొన్ని ఇతరత్రా భాగాల మీద ప్రభావం చూపిస్తాయి. కొన్ని వైరస్‌ మొత్తాన్నీ ఎదుర్కోవచ్చు. ఇవి వైరస్‌ భాగాలకు అంటుకుపోయి ఆరోగ్యకరమైన కణాల్లో ఇన్‌ఫెక్షన్‌ కలగజేసే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సార్స్‌-కోవీ2 వివిధ రకాలనూ కొన్ని మోనోక్లోనల్‌ యాంటీబాడీలు సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే ఒకదాంతో కాకుండా రెండు, మూడు యాంటీబాడీలను కలిపి మిశ్రమ చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌-19 చికిత్స కోసం కాసిరివిమాబ్‌, ఇమ్‌డెవిమాబ్‌, బామ్లానివిమాబ్‌, ఎటెసెవిమాబ్‌, సోట్రివిమాబ్‌, జెడ్‌ఆర్‌సీ-3308 వంటి మోనోక్లోనల్‌ యాంటీబాడీలెన్నో పుట్టుకొచ్చాయి. ఒక్క కొవిడ్‌-19లోనే కాదు.. ఎబోలా, హెచ్‌ఐవీ వంటి ఇతరత్రా జబ్బుల్లోనూ మోనోక్లోనల్‌ యాంటీబాడీలను వినియోగిస్తుంటారు.


ఎప్పుడు ఇస్తారు?

మోనోక్లోనల్‌ యాంటీబాడీల చికిత్సను సరైన సమయంలో, సరైనవారికి చేయటం చాలా చాలా ముఖ్యం. అప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని తొలిదశలోనే.. అంటే జబ్బు నిర్ధరణ అయ్యాక వీలైనంత త్వరగా ఇవ్వాల్సి ఉంటుంది. లక్షణాలు కనిపించిన రెండు, మూడు రోజుల లోపే ఇస్తే బాగా ఉపయోగపడుతున్నట్టు మన అనుభవాలు చెబుతున్నాయి. ఒక మోతాదుతోనే మంచి ఫలితం కనిపిస్తోంది. అప్పటికే ఒంట్లో పుట్టుకొచ్చిన యాంటీబాడీలకు ఇవి తోడై జబ్బును కట్టడి చేస్తాయి. అదీ వెంటనే ప్రభావం చూపుతాయి.


ఎవరికి ఇస్తారు?

కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉండి, 12 ఏళ్లు దాటిన ఎవరికైనా మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స చేయొచ్చు. కొవిడ్‌-19 మామూలుగా ఉన్నవారికి, లక్షణాలు లేనివారికి ఇది అవసరం లేదు. ఒక మాదిరి నుంచి మధ్యస్థంగా జబ్బు గలవారికి.. అదీ 65 ఏళ్లు పైబడినవారు, ఊబకాయులు, మధుమేహం గలవారు, రోగనిరోధకశక్తిని అణచివేసే జబ్బులతో బాధపడుతున్నవారు, రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకునేవారు, దీర్ఘకాలంగా ఊపిరితిత్తుల జబ్బుతో బాధపడుతున్నవారు, గుండెజబ్బులు ఉన్నవారికి వీటిని ఇస్తారు. ఎందుకంటే వీరంతా జబ్బు ముప్పు ఎక్కువ గలవారే. జబ్బు తీవ్రమయ్యే ప్రమాదం ఎదుర్కొంటున్నవారే.


కాకపోతే ఖరీదే ఎక్కువ

మోనోక్లోనల్‌ యాంటీబాడీల ఖరీదు ఎక్కువ. ఒక మోతాదుకే సుమారు రూ.70 వేలు అవుతుంది. అందుకే చాలామంది స్టిరాయిడ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. స్టిరాయిడ్లు కూడా బాగానే పనిచేస్తున్నాయి. కాకపోతే దుష్ప్రభావాలు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే మధుమేహం, గుండెజబ్బుల వంటివి గలవారికి వీలుంటే తొలిదశలో మోనోక్లోనల్‌ యాంటీబాడీలు ఇవ్వటం మంచిదనే భావన పెరుగుతోంది.

అధ్యయనాల దన్ను

కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా గలవారికి వీలైనంత త్వరగా.. అంటే లక్షణాలు ఆరంభమైన ఆరు రోజుల్లోనే మోనోక్లోనల్‌ యాంటీబాడీలు ఇస్తే ఆసుపత్రిలో చేరాల్సిన, అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లొరిడా హెల్త్‌, టంపా జనరల్‌ హాస్పిటల్‌ సంయుక్త అధ్యయనం పేర్కొంటోంది. మోనోక్లోనల్‌ యాంటీబాడీల చికిత్స తీసుకున్నవారిలో ఎవరూ మరణించకపోవటం గమనార్హం.

జబ్బు తీవ్రమైనవారిలోనూ..

కొవిడ్‌ తీవ్రమై ఆసుపత్రిలో చేరినవారికి, ఆక్సిజన్‌ అవసరమైనవారికి మోనోక్లోనల్‌ యాంటీబాడీలు అంతగా పనిచేయవు. అయితే జబ్బు తీవ్రమైనవారిలోనూ సహజ యాంటీబాడీల ప్రతిస్పందన ఏమాత్రం లేనివారికి ఇవి బాగా ఉపయోగపడుతున్నట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ నిర్వహించిన తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఇలాంటివారిలో సాధారణ చికిత్స తీసుకున్నవారితో పోలిస్తే మోనోక్లోనల్‌ యాంటీబాడీల మిశ్రమాన్ని తీసుకున్నవారిలో మరణించే ముప్పు ఐదో వంతు వరకు తగ్గుతున్నట్టు తేలింది. ఈ చికిత్స తీసుకున్నవారికి వెంటిలేటర్‌ అవసరం తగ్గినట్టు, నాలుగు రోజుల ముందే ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినట్టు బయటపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు