Bowel Cancer: పేగుకు పెద్ద చిక్కు!

పెద్దపేగు క్యాన్సర్‌. తొలిదశలో గుర్తిస్తే చికిత్స తేలికే. ఫలితాలూ మెరుగ్గా ఉంటాయి. ఆ మాటకొస్తే పరీక్షలతో ముందే గుర్తించొచ్చు. క్యాన్సర్‌గా మారకుండానూ చూసుకోవచ్చు. అయినా కూడా పెద్దపేగు క్యాన్సర్‌ కేసులు నానాటికీ పెరుగుతుండటం ఆందోళనకరం.

Updated : 13 Jun 2023 13:37 IST

పెద్దపేగు క్యాన్సర్‌. తొలిదశలో గుర్తిస్తే చికిత్స తేలికే. ఫలితాలూ మెరుగ్గా ఉంటాయి. ఆ మాటకొస్తే పరీక్షలతో ముందే గుర్తించొచ్చు. క్యాన్సర్‌గా మారకుండానూ చూసుకోవచ్చు. అయినా కూడా పెద్దపేగు క్యాన్సర్‌ కేసులు నానాటికీ పెరుగుతుండటం ఆందోళనకరం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమనుకునేది కాస్తా ఇప్పుడు మనదేశంలోనూ ఎక్కువగానే కనిపిస్తోంది. మారిపోతున్న ఆహార అలవాట్లు, బద్ధకంతో కూడిన జీవనశైలే దీనికి ఆజ్యం పోస్తోంది. తొలిదశలో ఎలాంటి లక్షణాలు లేకపోవటం.. ఒకవేళ లక్షణాలు కనిపించినా మలబద్ధకమో, విరేచనాలో, గ్యాసో, అజీర్ణమో, పొట్ట ఉబ్బరంగానో పొరపడటం వల్ల జబ్బును పోల్చుకోలేక పోతున్నారు. దీంతో నిర్ధరణా ఆలస్యమవుతోంది. కాబట్టి పెద్దపేగు క్యాన్సర్‌ మీద అవగాహన కలిగుండటం ఎంతైనా అవసరం.
తినటం ఎంత ముఖ్యమో, విసర్జనా అంతే. ఇందులో పెద్దపేగుదే పెద్ద పాత్ర. జీర్ణాశయం నుంచి వచ్చిన ఆహారంలోని ముఖ్యమైన అన్ని పోషకాలు, విటమిన్లను చిన్నపేగులు గ్రహించాక మిగిలినదంతా పెద్దపేగులోకి చేరుకుంటుంది. దీనిలోని నీటిని.. అలాగే సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లను పెద్దపేగు శోషించుకుంటుంది. మరోవైపు బ్యాక్టీరియా వ్యర్థ పదార్థాన్ని మరింతగా విచ్ఛిన్నం చేసి, కొన్నిరకాల విటమిన్లనూ ఉత్పత్తి చేస్తుంది. చివరికి వ్యర్థ పదార్థమంతా మలం రూపంలో ముద్దగా ఏర్పడుతుంది. ఇది మలాశయంలోకి చేరుకొని, విసర్జన సమయంలో బయటకు వచ్చేస్తుంది. ఇలా జీర్ణక్రియ చివరిదశలో పెద్దపేగు కీలకపాత్ర పోషిస్తుంది. దీనికిప్పుడు క్యాన్సర్‌ పెద్ద సమస్యగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా తరచూ కనిపించే క్యాన్సర్లలో ఇదొకటి. మనదేశంలో పురుషుల్లో తలెత్తే క్యాన్సర్లలో నాలుగోది ఇదే.


ఎందుకొస్తుంది?

పెద్దపేగు క్యాన్సర్‌ ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. ఏ క్యాన్సర్‌కైనా మూలం కణాల్లో డీఎన్‌ఏ పనితీరు అస్తవ్యస్తం కావటం. దీంతో ఇబ్బడి ముబ్బడిగా కణాలు విభజన చెంది, కణితిగా ఏర్పడతాయి. పెద్దపేగు క్యాన్సర్‌లోనూ ఇదే జరుగుతుంది. సాధారణంగా ఇది బుడిపెల (పాలిప్స్‌) రూపంలో మొదలవుతుంది. అడినోమటస్‌ రకం బుడిపెలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పది మిల్లీమీటర్ల కన్నా పెద్దగా ఉండే బుడిపెలతో ప్రమాదం ఎక్కువ. ఇవి క్రమంగా పెరుగుతూ కొంతకాలానికి క్యాన్సర్‌గా మారే అవకాశముంది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి.
పెద్ద వయసు: పెద్దపేగు క్యాన్సర్‌ ఏ వయసులోనైనా రావొచ్చు గానీ 50 ఏళ్లు పైబడ్డవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
కుటుంబ చరిత్ర: రక్త సంబంధీకుల్లో ఎవరైనా పెద్దపేగు క్యాన్సర్‌ గలవారుంటే ముప్పు ఎక్కువ. ఒకరి కన్నా ఎక్కువ కుటుంబ సభ్యులకు ఈ క్యాన్సర్‌ వచ్చి ఉంటే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది.
జబ్బులు: పేగు పూత (ఐబీడీ), పెద్దపేగులో బుడిపెలు గలవారికీ వచ్చే అవకాశముంది.
వంశపారంపర్య సమస్యలు: వంశపారంపర్యంగా సంక్రమించే కొన్ని జన్యు సమస్యలూ పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పును పెంచొచ్చు. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి అడినోమాటస్‌ పాలీపోసిస్‌, లీంచ్‌ సిండ్రోమ్‌ (హెరిడిటరీ నాన్‌పాలీపోసిస్‌ కొలరెక్టల్‌ క్యాన్సర్‌), ప్యూజెగర్స్‌ సిండ్రోమ్‌లు.
ఆహార మార్పులు: పీచు తక్కువగా, కొవ్వు.. ముఖ్యంగా గొర్రె, మేక మాంసం వంటివి ఎక్కువగా తినటం ముప్పు పెరిగేలా చేస్తుంది. ఇలాంటి ఆహారం తినేవారిలో    ఎఫ్‌. న్యూక్లియం అనే పెద్దపేగు క్యాన్సర్‌ సూచిక మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. చక్కెర, తీపి పానీయాలు అతిగా తీసుకోవటమూ ప్రమాదమే.
పొగ తాగటం: పొగలోని నికొటిన్‌ పెద్దపేగులో జిగురు ద్రవాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందువల్ల దీర్ఘకాలంగా సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చేవారికి పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది. పొగ మూలంగా వాపు ప్రక్రియ ప్రేరేపితం కావటంతోనూ బుడిపెలు ఏర్పడొచ్చు.
ఊబకాయం: మామూలు బరువు గలవారితో పోలిస్తే ఊబకాయులకు పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశం సుమారు 30% ఎక్కువ. అదీ 50 ఏళ్లలోపే రావొచ్చు.
బద్ధకం: శారీరక శ్రమ, వ్యాయామం అంతగా చేయకపోవ టమూ ప్రమాదమే. ఎక్కువసేపు కదలకుండా కూర్చునే వారికి పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది మరి.
మద్యం తాగటం: అసలే మద్యం తాగని వారితో పోలిస్తే ఒక మాదిరి నుంచి అధికంగా మద్యం తాగే అలవాటు గలవారికి పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం సుమారు 2 రెట్లు ఎక్కువ.
మధుమేహం: ఇన్సులిన్‌ నిరోధకతతో ముడిపడిన టైప్‌ 2 మధుమేహం గలవారికీ ముప్పు పొంచి ఉంటుంది.
గతంలో రేడియేషన్‌ చికిత్స: ఇంతకుముందు కడుపు భాగంలో వచ్చిన క్యాన్సర్లకు రేడియేషన్‌ చికిత్స తీసుకున్నవారికి ముప్పు పెరగొచ్చు.


సంకేతాలు, లక్షణాలు

పెద్దపేగు క్యాన్సర్‌ తొలిదశలో చాలామందికి ఎలాంటి లక్షణాలూ ఉండవు. క్యాన్సర్‌ ముదురుతున్నకొద్దీ కణితి సైజు, తలెత్తిన చోటును బట్టి లక్షణాలు కనిపిస్తుంటాయి.
*తరచూ మల విసర్జనలో మార్పులు. ఒకసారి విరేచనాలు, మరోసారి మలబద్ధకం వేధించొచ్చు. మలం తీరుతెన్నులూ మారొచ్చు. పలుచగా, పట్టీ మాదిరిగా ఉండొచ్చు.
* మలద్వారం నుంచి గానీ మలంలో గానీ రక్తం పడటం. కొందరికి మలంలో రక్తం కలిసిపోయి విరేచనం నల్లగానూ అవ్వచ్చు.
* కడుపులో ఏదో అసౌకర్యంగా ఉండటం. కడుపు నొప్పి, గ్యాస్‌, పొట్ట ఉబ్బరం వంటివి ఉండొచ్చు. పేగుల్లో అడ్డంకి ఏర్పడితే తీవ్రమైన కడుపు నొప్పి కూడా వస్తుంది.
* మల విసర్జన సాఫీగా కాలేదని అనిపించటం. మళ్లీ విసర్జనకు వెళ్లాలని అనిపించొచ్చు.
*బలహీనత లేదా అలసట. తీవ్రమైన రక్తహీనత.
* అసాధారణంగా బరువు తగ్గటం. ఆకలి లేకపోవటం.
- ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.


చికిత్స- దశలను బట్టి

పెద్దపేగులో క్యాన్సర్‌ ఎక్కడైనా తలెత్తొచ్చు. సాధారణంగా మలాశయం, దాని పైభాగాన ఎక్కువగా వస్తుంటుంది. క్యాన్సర్‌ ఏర్పడిన భాగం, దశలను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.
స్టేజ్‌ 1, స్టేజ్‌ 2 దశలో- క్యాన్సర్‌ ఉన్న భాగాన్ని, దాని చుట్టుపక్కల కణజాలాన్ని కత్తిరించి, తొలగిస్తారు (కోలెక్టమీ). అనంతరం రెండు చివర్లను కలుపుతారు (అనస్టోమాసిస్‌). ఒకవేళ పేగు అతుక్కోకపోతే మల విసర్జన కోసం పొట్టకు రంధ్రం చేసి, బ్యాగును అమరుస్తారు. పెద్దపేగును పొట్ట రంధ్రానికి జతచేస్తారు (కొలస్టమీ). దీనిలోంచి మలం బ్యాగులోకి వస్తుంది.
స్టేజ్‌ 3 దశలో- క్యాన్సర్‌ తలెత్తిన పెద్దపేగు భాగాన్ని తొలగించటంతో పాటు 6-8 సార్లు కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో క్యాన్సర్‌ మళ్లీ తిరగబెట్టకుండా చూసుకోవచ్చు.
స్టేజ్‌ 4 దశలో- క్యాన్సర్‌ పెద్దపేగును దాటుకొని ఇతర భాగాలకూ విస్తరిస్తుంది కాబట్టి కీమోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీ అవసరమవుతాయి. ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చే కీమోథెరపీ మందులు క్యాన్సర్‌ కణాలు చనిపోయేలా చేస్తాయి. దీంతో కణితి సైజు తగ్గుతుంది. టార్గెటెడ్‌ థెరపీ మందులు ఆయా కాన్సర్‌ కణాలకు అంటుకొని వాటిని నిర్మూలిస్తాయి. ఇమ్యునోథెరపీలో ఇచ్చే మోనోక్లోనల్‌ యాంటీబాడీలు రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. ఇవి కణితి కణాలకు అంటుకొని, క్యాన్సర్‌ కణాలతో పోరాడే శక్తిని పెంపొందిస్తాయి. స్టేజ్‌ 4 క్యాన్సర్లకు రేడియోథెరపీ కూడా అవసరమవుతుంది. ఇది నొప్పిని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ మూలంగా తలెత్తిన అడ్డంకులనూ తొలగిస్తుంది.
* అధునాతన క్యాన్సర్‌ చికిత్సల మూలంగా పెద్దపేగు క్యాన్సర్‌ మరణాలు ఒకప్పటితో పోలిస్తే చాలావరకు తగ్గాయి. చికిత్సల అనంతరం ఎంతోమంది హాయిగా జీవిస్తున్నారు. 60-70% మంది ఐదేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అదే తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తించినవారిలో 90% మంది ఐదేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవిస్తుండటం విశేషం. ప్రమాదకర సంకేతాలు, లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని ఇది సూచిస్తోంది. తొలిదశలోనే పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించి, చికిత్స తీసుకుంటే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.


ముందస్తు పరీక్షల మేలు

బుడిపెలు క్యాన్సర్‌గా మారకముందే గుర్తిస్తే పెద్దపేగు క్యాన్సర్‌ను చాలావరకు నివారించుకోవచ్చు. ఇందుకు కొలనోస్కోపీ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఇది సురక్షితమైన, ప్రామాణికమైన పరీక్ష. ప్రతి ఒక్కరూ 50 ఏళ్ల వయసులో ఒకసారి దీన్ని చేయించుకోవటం మంచిది. బుడిపెలేవీ లేకపోతే ప్రతి పదేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకుంటే చాలు. బుడిపెలుంటే మాత్రం డాక్టర్‌ సలహా మేరకు 3-5 ఏళ్లకోసారి కొలనోస్కోపీ చేయించుకుంటూ, అవి క్యాన్సర్‌గా మారుతున్నాయేమో చూసుకోవటం చాలా ముఖ్యం. ఇక కుటుంబంలో ఎవరైనా పెద్దపేగు క్యాన్సర్‌ గలవారుంటే 40 ఏళ్లలోనే ముందస్తు పరీక్షలు ఆరంభించాలి. కొందరికి మలంలో రక్తం పరీక్ష, సీటీ కొలనోస్కోపీ, ఫ్లెక్సిబుల్‌ సిగ్మాయిడోస్కోపీ వంటి ఇతర పరీక్షలూ అవసరమవుతాయి.


నివారణ ముఖ్యం

కణాల్లో డీఎన్‌ఏ మారినప్పటికీ అన్నిసార్లూ క్యాన్సర్‌గా మారాలనేమీ లేదు. మన ఆహార, విహారాల వంటి ఇతరత్రా అంశాలు తోడుకావటం దీన్ని మరింత ప్రేరేపిస్తాయి. కాబట్టి జీవనశైలి మార్పులతో నివారించుకోవటం మంచిది.
* పొగాకు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
* తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
* మద్యం తాగొద్దు. ఒకవేళ అలవాటుంటే పరిమితం చేసుకోవాలి.
* మాంసం తినేవారు మితంగా తినాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువు అదుపులో ఉంచుకోవాలి.
* కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ వచ్చి ఉంటే ముందే జాగ్రత్త పడాలి. పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పును అంచనా వేసుకోవాలి.


దశలు నాలుగు

క్యాన్సర్‌ అక్కడే ఉందా? లోపలి పొరలకు వ్యాపించిందా? కణితి ఏర్పడితే సైజు ఎంత? అనే వాటిని బట్టి దశలను అంచనా వేస్తారు.
* స్టేజ్‌ 1- క్యాన్సర్‌ పెద్దపేగు లోపల పైపొర నుంచి తర్వాతి పొరకు వ్యాపించటం.
* స్టేజ్‌ 2- పెద్దపేగు బయటి పొరలకూ క్యాన్సర్‌ వ్యాపిస్తుంది. కానీ పెద్దపేగుకే పరిమితమవుతుంది.
* స్టేజ్‌ 3- బయటి పొరలను దాటుకొని, ఒకట్రెండు లింఫ్‌ గ్రంథులకు క్యాన్సర్‌ వ్యాపించటం. అయితే అంత ఎక్కువ దూరాల అవయవాలకు వెళ్లదు.
* స్టేజ్‌ 4- పెద్దపేగు గోడను దాటుకొని ఇతర కణజాలాలకూ వ్యాపించటం. ఇది తీవ్రమవుతున్నకొద్దీ దూరంగా ఉన్న అవయవాలకూ విస్తరిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని